ఒకే ఉంగరంలో 7801 వజ్రాలు..

by Sujitha Rachapalli |
ఒకే ఉంగరంలో 7801 వజ్రాలు..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఉంగరాల్లో వజ్రాలు పొదగడమన్నది సాధారణ విషయమే. అయితే అందులోనూ తమ ప్రత్యేకతను చాటుకునేందుకు జ్యువెలరీ డిజైనర్స్ ప్రయత్నిస్తుంటారు. ఒక ఉంగరంలో ఒకటి నుంచి పది వజ్రాల వరకు అలంకరిస్తారు. కానీ హైదరాబాద్‌కు చెందిన కొట్టి శ్రీకాంత్ అనే నగల డిజైనర్ మాత్రం ఏకంగా ఒకే ఉంగరంలో 7,801 వజ్రాలను అమర్చి, గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాడు.

అరుదైన పుష్పం బ్రహ్మకమలం స్ఫూర్తితో హైదరాబాద్‌కు చెందిన కొట్టి శ్రీకాంత్ అనే వ్యక్తి.. 7,801 వజ్రాలను పొదిగి, బ్రహ్మకమలం ఆకారంలో ఉండే ఉంగరాన్ని తీర్చిదిద్దాడు. దీని కోసం అతడు 11 నెలలు కష్టపడ్డాడు. మొదట ఉంగరానికి సంబంధించిన స్కెచ్‌లు వేసి, ఆ తర్వాత కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ ద్వారా రూపొందించాడు. ఒక్కో లేయర్‌లో ఎనిమిది పూరెక్కలతో మొత్తంగా ఆరు లేయర్లతో ఉంగరాన్ని తయారుచేశారు. జూబ్లీహిల్స్‌ రోడ్ నంబర్‌ 36లోని ‘ది డైమండ్‌ స్టోర్‌’లో సోమవారం ఆ అరుదైన వజ్రాల ఉంగరాన్ని ప్రదర్శించారు. సహజ సిద్ధమైన వజ్రాలను ఉపయోగించి తయారుచేసిన ఆ ఉంగరాన్ని ఆన్‌లైన్‌ వేలం ద్వారా విక్రయిస్తామని, దక్షిణ భారతదేశంలో జ్యువెలరీ విభాగంలో గిన్నిస్‌బుక్‌ ఎక్కిన తొలిసంస్థ తమదేనని పేర్కొన్నారు. కాగా ఈ ఉంగరానికి సంబంధించిన వీడియోను గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ తమ పేజీలో పోస్ట్ చేసింది.

సూరత్‌కు చెందిన విశాల్‌ అగర్వాల్‌, ఖుష్బూ అగర్వాల్‌ ఇద్దరూ కలిసి 2018లో 6690 వజ్రాలతో గిన్నిస్ రికార్డు సాధించగా.. తాజాగా శ్రీకాంత్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. విశాల్, ఖుష్భూలు 48 పూరేకుల తామరపువ్వు ఆకారంలో 18 కేరెట్ల రోజ్‌ గోల్డ్‌తో రూపొందించిన ఈ ఉంగరం బరువు 58 గ్రాములు.

Advertisement

Next Story