నిఘా నీడలో ‘కిష్టరాయనిపల్లి’

by Shyam |   ( Updated:2021-02-13 09:59:52.0  )
police surveillance
X

దిశ, చండూరు : డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని లక్ష్మాపురం వద్ద కిష్టరాయనిపల్లి రిజర్వాయర్ పనులు పోలీస్ నిఘా నీడలో కొనసాగతున్నాయి. 330 మంది పోలీసుల మధ్య ప్రాజెక్టు పనులు మళ్లీ మొదలు పెట్టారు. మొదటి నుంచి లక్ష్మానాపురం భూ నిర్వాసితులు పరిహారం ఇచ్చిన తర్వాతే ప్రాజెక్టు పనులు నిర్వహించాలని పట్టుబడుతున్నారు. పనులు జరగకుండా అడ్డుకుంటున్నారు. దీంతో గతేడాది డిసెంబర్ 27న పోలీస్ బందోబస్తు మధ్య పనులు జరిపించేందుకు గుత్తేదారు యత్నించగా, నిర్వాసితులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. భూ నిర్వాసితులు పోలీసులు అరెస్టు చేయడంతో నల్గొండ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. సమస్య పరిష్కరించే వరకూ పనులు నిలిపివేస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో నిర్వాసితులు ధర్నాను విరమించారు. తిరిగి ఇటీవల గుత్తేదారు తన పలుకుబడిని ఉపయోగించి పనులు ప్రారంభించడంతో మూడు రోజులపాటు భూ నిర్వాసితులు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చిన తర్వాతనే ప్రాజెక్టు పనులు నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

అయితే గుత్తేదారు శుక్రవారం సాయంత్రం 330 మంది పోలీసుల బందోబస్తు మధ్య ప్రాజెక్టు పనులు మళ్లీ ప్రారంభించారు. దేవరకొండ సబ్ డివిజనల్ అధికారి ఆనంద్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు వద్ద భాష్పవాయువు బలగాలను సైతం రంగంలోకి రప్పించారు. ప్రాజెక్టు వద్దకు ఎవరిని రాకుండా పోలీసులచే గుత్తేదారు అష్ట దిగ్బంధనం చేయడంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం తీరుపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో లక్ష్మాపురం గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

పరిహారం తర్వాతనే పనులు : గడ్డి యాదయ్య, భూ నిర్వాసితుడు

కిష్టరాయనిపల్లి ప్రాజెక్టులో సర్వం కోల్పోయాం. మాకు పునరావాసం కల్పించిన తర్వాతే ప్రాజెక్టు పనులు చేపట్టాలి. కవ్వింపు చర్యలకు పాల్పడితే తాము ప్రతిఘటించడానికి వెనుకాడే ప్రసక్తి లేదు.

అక్కడి ప్యాకేజీనే.. ఇక్కడా ఇవ్వాలి : కంచుకట్ల సుభాష్, ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్

కిష్టరాయనిపల్లి ప్రాజెక్టు పరిధిలో భూములు కోల్పోయిన వారికి మల్లన్న సాగర్ ప్రాజెక్టు ప్యాకేజీనే ఇవ్వాలి. నిర్వాసితులకు పునరావాసం కల్పించిన తర్వాతే ప్రాజెక్టు పనులు ముట్టుకోవాలి.

Advertisement

Next Story