అబద్దం పుట్టాక.. ఎవరు పుట్టారో తెలుసా.. క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి

by Anukaran |
అబద్దం పుట్టాక.. ఎవరు పుట్టారో తెలుసా.. క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి
X

దిశ, జమ్మికుంట: అబద్దాలు చెప్పడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిట్ట అని, అబద్దం ముందు పుట్టి, కేసీఆర్ కుటుంబం తర్వాత పుట్టిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం ఇల్లందకుంట మండలంలోని బూజునూరు, సీతంపేట, మరివానిపల్లి, భోగంపాడు, సిరిసేడు తదితర గ్రామాలలో హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే 100 కోట్ల టీకా డోసులు పూర్తయ్యాయని, ప్రతి పేదవాడికి ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చే బాధ్యత బీజేపీ ప్రభుత్వం తీసుకుందని గుర్తు చేశారు. దళిత బంధు పథకాన్ని మేము ఆపామని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అలాంటివారికి నేను సవాల్ చేస్తున్న.. మీకు బుద్ధి ఉంటే ఎన్నికలయ్యాక ఒకేరోజు దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ ఎన్నికల్లో నియంతృత్వానికి, కుటుంబ రాజకీయాలకు చరమగీతం పాడే అవకాశం ప్రజలకు వచ్చిందని, దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ డబ్బులను, అబద్దాలను, మోసాలను, ఫిరాయింపులను, కొనుగోళ్లను నమ్ముకున్నారని.. కానీ, ఈటల రాజేందర్ మాత్రం ప్రజలను నమ్ముకుని మీ దగ్గరకు వచ్చారన్నారు. ఆత్మగౌరవం కలిగిన హుజూరాబాద్ ప్రజలను కొనే శక్తి కేసీఆర్‌కు లేదన్నారు.

తెలంగాణ ప్రజలు సైతం మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పుకు మొదటి అడుగు హుజూరాబాద్ ప్రజలే వేయాలని, రాష్ట్ర ప్రజల జీవితాలు ఇప్పుడు హుజూరాబాద్ ప్రజల చేతిలో ఉందన్నారు. అమరవీరులకు ఆత్మశాంతి చేకూరాలంటే, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. గతంలో తెలంగాణ ప్రజలు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారని, ఇప్పుడు కేసీఆర్ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారని కిషన్ రెడ్డి హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed