- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యే సాయన్నకు సెగ… ఎమ్మెల్యే సీటుకు ఆ ముగ్గురు ఎర్త్ పెడతారా?
దిశ, కంటోన్మెంట్: కంటోన్మెంట్ కు కార్పొరేషన్ పదవుల పంట పండింది. ఈ ప్రాంత నేతలకు మూడు చైర్మన్ పదవులను సీఎం కేసీఆర్ కట్టబెట్టారు. ఒకే సామాజిక వర్గానికి(దళిత) చెందిన గజ్జెల నాగేశ్, డాక్టర్ ఏర్రోళ్ల శ్రీనివాస్, మన్నే క్రిశాంక్ లకు కార్పొరేషన్ పదవులు దక్కాయి. ఉద్యమకారులను, ముఖ్యంగా పార్టీ కోసం ఎంతో కష్టపడిన వారిని పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి నేపథ్యంలో కంటోన్మెంట్ ప్రాంతం నుంచి ముగ్గురిని కార్పొరేషన్ చైర్మన్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కంటోన్మెంట్ అసెంబ్లీ సీటుపై అశలు పెట్టుకున్న ముగ్గురు నాయకులకు అధిష్టానం ఊహించని రీతిలో కార్పొరేషన్ పదవులను కట్టబెట్టడం చర్చనీయాంశంగా మారింది.
ముగ్గురు ఉద్యమకారులే…
తెలంగాణ ఉద్యమంలో గజ్జెల నగేశ్, డాక్టర్ ఏర్రోళ్ల శ్రీనివాస్, మన్నే క్రిశాంక్ లు కీలక భూమిక పోషించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా డాక్టర్ ఏర్రోళ్ల శ్రీనివాస్, మన్నే క్రిశాంక్ లు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఏర్రోళ్ల శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం గణపూర్ కు చెందినప్పటికీ, గత కొంతకాలంగా కంటోన్మెంట్ నియోజకవర్గం మారేడ్ పల్లిలో నివాసం ఉంటున్నారు. గత కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషిచే శారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్ రేసులోనూ ఉన్నారు. తెలంగాణ తొలి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గా కూడా పనిచేశారు. ఇటీవల హుజురాబాద్ ఎన్నికల్లో మంత్రి హరీశ్ రావు వెంట టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపుకోసం శ్రమించారు. ఎమ్మెల్సీ జాబితాలో ఏర్రోళ్ల పేరు ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ఏర్రోళ్లను మెడికల్ సర్వీసెస్, ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించారు.
అదేవిధంగా ఖైరతాబాద్ కు చెందిన గజ్జెల నాగేశ్ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. దీంతో కేసీఆర్ గజ్జెల నగేశ్ ను కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జీగా బాధ్యతలు అప్పగించి, 2014 ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇచ్చారు. నాటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సాయన్న చేతిలో స్వల్ప ఓట్లతో నగేశ్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత సాయన్న టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో 2018 ముందస్తు ఎన్నికల్లో గజ్జెల నగేశ్ కు పార్టీ టికెట్ ఇవ్వకుండా సాయన్నకు కేటాయించారు. దీంతో గజ్జెల నగేశ్ రెబల్ గా రంగంలోకి దిగారు. అయినా సాయన్న భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత నగేశ్ ను పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేశారని కొంతకాలం పాటు పార్టీ దూరం పెట్టింది. అయితే కేసీఆర్ ఆశీస్సులతో నగేశ్ కు కీలకమైన బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మన్నే క్రిశాంక్ ఓయూ జేఏసీ లీడర్ గా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పనిచేశారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణకు క్రిశాంక్ స్వయాన అల్లుడు. ఎమ్మెల్యే కావాలనే ఆకాంక్షతో కంటోన్మెంట్ కేంద్రంగా ప్రజా సమస్యలపై పోరాడారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్రిశాంక్ కు టికెట్ కేటాయించినా.. చివరి నిమిషంలో ప్రజా సంఘాల ఉద్యమ నేత గజ్జెల కాంతంకు పార్టీ బీఫారం ఇచ్చింది. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో టికెట్ వస్తుందని ఆశించిన క్రిశాంక్ కు నిరాశే మిగిలింది. అధిష్టానం ఆయన మామ సర్వే సత్యనారాయణకు కేటాయించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన క్రిశాంక్ కాంగ్రెస్ పార్టీని వీడి కారెక్కారు. గత కొంతకాలంగా టీఆర్ ఎస్ సోషల్ మీడియా విభాగంలో కీలకంగా పనిచేస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ తాజాతా క్రిశాంక్ కు మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిఇచ్చారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే పీఠంపై కన్నేసిన ముగ్గురు యువ నేతలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కడం హాట్ టాపిక్ గా మారింది.
సాయన్నకు తలనొప్పేనా..?
తాజా కార్పొరేషన్ చైర్మన్ల నియామకం సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్నకు తలనొప్పిగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కంటోన్మెంట్ నియోజవర్గంలో గత ముప్పై ఏళ్లుగా సాయన్న తిరుగులేని నేతగా వెలుగొందుతున్నారు. ఇక్కడి నుంచి ఐదు సార్లు (నాలుగుసార్లు టీడీపీ, ఒకసారి టీఆర్ఎస్) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.అయితే ఇదే ప్రాంతానికి చెందిన ముగ్గురు నేతలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులను సీఎం కేసీఆర్ కట్టబెట్టడంతో ఇక మీదట నియోజకవర్గంలో నలుగురు నేతలు పవర్ సెంటర్లుగా మారే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తన రాజకీయ వారసురాలిగా సాయన్న తన కుమార్తెను ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కావాలని కలలు కంటున్న ముగ్గురు నేతలకు కీలకమైన కార్పొరేషన్ పదవులను పార్టీ అధిష్టానం కట్టబెట్టంది. పార్టీ అధిష్టానం తీసుకున్న తాజా నిర్ణయంతో మున్ముందు ఏమి జరుగుతుందో.. అసలు సీఎం కేసీఆర్ వ్యూహం ఏలా ఉండబోతుందోనని పార్టీ శ్రేణుల్లో మాత్రం గందరగోళ పరిస్థితి నెలకొంది. గత కొంతకాలంగా కీలకమైన పదవులేమీ లేక కంటోన్మెంట్ లో గజ్జెల నగేశ్, మన్నే క్రిశాంక్, ఏర్రోళ్ల శ్రీనివాస్ ల ప్రభావం పెద్దగా కనిపించకపొవడంతో వారి అనుచరులంతా మెల్లమెల్లగా ఎమ్మెల్యే సాయన్నకు దగ్గరయ్యారు.
అయితే తాజాగా తమ అభిమాన నేతలకు పార్టీ అధిష్టానం కీలక పదవులను కట్టబెట్టడంతో సాయన్న వద్దనే కొనసాగాలా..? లేక వారి అభిమాన నేతల వద్దకు వెళ్లాలా? అనే అయోమాయం పార్టీ శ్రేణులు, వారి వారి అనుచరుల్లో నెలకొంది. తాజా పరిణామాలతో కంటోన్మెంట్ లో రాజకీయం ఏ మలుపులు తీసుకుంటుందో వేచి చూద్దాం..