‘పెన్’తో గిన్నీస్ రికార్డ్స్

by Shyam |
‘పెన్’తో గిన్నీస్ రికార్డ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా పెన్ను మన వేలు కన్న కాస్త పొడవుగా ఉంటుంది. అంతకన్నా పొడవైన పెన్నులు కూడా ఉంటాయనుకోండి. కానీ, కేరళకు చెందిన ముహమ్మద్‌ దిలీఫ్‌ అనే యువకుడు తయారు చేసిన పెన్ను 9 అడుగుల పొడవుంది. దాంతో ఏదైనా రాయాలంటే రెండు చేతులతో ఎత్తి రాయాల్సిందే. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న ఈ భారీ పెన్ ఫొటోలు, వీడియోలో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతున్నాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద పెన్నును రూపొందించిన దిలీఫ్ తన పేరును గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో లిఖించుకున్నాడు. ఈ భారీ పెన్ను పరిమాణం 2.745మీ x 0.315 మీ ఉంది. గిన్నీస్‌ అధికారులు ఆ భారీ పెన్నుకు సంబంధించిన వీడియోను ఇటీవలే షేర్ చేయగా, నెటిజనాల నుంచి అనూహ్య స్పందన అందుకుంటోంది. దిలీఫ్‌, అతనితోపాటు మరికొందరు పెన్నును తయారు చేయడాన్ని వీడియోలో చూడొచ్చు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 5న ఈ పెన్నును రూపొందించగా, గిన్నీస్ తాజాగా ఈ ఫీట్‌ను గుర్తించింది.

‘‘ప్రపంచంలో అతిపెద్ద మార్కర్‌ పెన్‌ను తయారుచేయడం, దానిని ఉపయోగించే అవకాశం రెండూ భారత్‌కు చెందిన ముహమ‍్మద్‌ దిలీఫ్‌కు లభించాయి’’ అంటూ గిన్నిస్ నిర్వాహకులు షేర్ చేసిన వీడియోకు క్యాప్షన్ పెట్టారు. ఇదే వీడియో దిలీఫ్ సోషల్ మీడియాలో పంచుకుంటూ ‘‘కొత్త తరాన్ని చదవడానికి ప్రేరేపించండి, ప్రోత్సహించండి’’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు. ‘గ్రేట్ క్రియేటివిటీ’, ‘వావ్ వాట్ ఏ ఇన్నోవేషన్’ అంటూ దిలీఫ్‌‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ‘ఇది థానోస్ (అవెంజర్స్‌) కోసం తయారు చేసింది’ అని, ‘హల్క్ ఏదైనా డాక్యుమెంట్‌పై సైన్ చేయాల్సి వస్తే ఇది ఉపయోగపడుతుంది’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed