హరీశ్ రావు చేసిన పనికి ‘కేసీఆర్’ సొంత ఊరి మహిళల ఆగ్రహం..

by Shyam |   ( Updated:2023-03-15 02:24:22.0  )
Chintamadaka
X

దిశ ప్రతినిధి, మెదక్ : సీఎం కేసీఆర్ సొంత గ్రామంలో వృద్ధ మహిళల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. సీఎం కేసీఆర్ హామీ మేరకు డబుల్ బెడ్ రూం ఇండ్లు అందరికీ నిర్మించాల్సి ఉన్నప్పటికీ నిర్మించలేదు. ఫలితంగా కొందరు వృద్ధులకు ఆశ్రయం లేకుండా పోతున్నది. శనివారం చింతమడక మధిర గ్రామమైన దమ్మచెరువులో డబుల్ బెడ్ రూం ఇండ్లను రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్ రావు మరి కాసేపట్లో ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో చింతమడక మీదుగానే మంత్రి వెళ్లనున్నారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న చింతమడక వృద్ధులు మంత్రిని అడిగేందుకు ఊరి శివారుకు చేరుకున్నారు.

అందరికీ ఇండ్లు ఇస్తాం..

సిద్దిపేట జిల్లా చింతమడక కేసీఆర్ స్వగామమన్న విషయం ప్రతీ ఒక్కరికి తెలిసిందే. గతంలో చింతమడకలో పర్యటించిన కేసీఆర్.. ఊరందరితో కలిసి భోజనం చేశారు. తన సొంత ఊరికి మేలు చేయాలన్న సంకల్పంతో ప్రతీ ఇంటికి పది లక్షల బెనిఫిట్స్‌తో పాటు అందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు చింతమడకతో పాటు చుట్టుపక్కల రెండు, మూడు గ్రామాల్లో సైతం ఊరంతా ఒకేలా కనిపించేలా డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించారు. కొన్ని నిర్మాణ దశలో ఉండగా.. మరికొన్ని దాదాపు పూర్తికావచ్చాయి. జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి దగ్గరుండి డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులను చూసుకుంటున్నారు.

మాకు ఇండ్లు కట్టియ్యిర్రి..

మేము మునలోళ్లమైనం.. మా కోడళ్లు మమ్మల్ని కొత్త ఇంట్లకు రానిస్తలేరు.. ముసలితనంలో ఎక్కడ బతకాలి.. మాకు అందరి లాగే కొత్త ఇండ్లు కట్టియ్యిర్రి అంటూ వృద్ధ మహిళలు తమ ఆవేదనను వెలిబుచ్చారు. శనివారం మంత్రి వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న వృద్ధులు ఊరు శివారులో మంత్రిని కలిసేందుకు సిద్ధమయ్యారు. సుమారు ఓ ఇరవై మంది వరకు వృద్ధులు తమకు ఇండ్లు కట్టివ్వాలని కోరుతున్నారు. ఒకవేళ మంత్రి కట్టిస్తామని హామీ ఇవ్వకపోతే సీఎం కేసీఆర్‌ను కలుస్తామని.. ఇందుకు ఆటో పట్టుకోని పోతాం లేక పాదయాత్ర చేసైనా సరే కేసీఆర్‌ను కలిసి తీరుతామని తెగేసి చెబుతున్నారు. మరీ.. వీరి పట్ల మంత్రి హరీశ్ రావు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇండ్ల ప్రారంభానికి వస్తున్న మంత్రి..

చింతమడక పక్కనే ఉన్న దమ్మచెరువులో డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి హరీశ్ రావు ప్రారంభించనున్నారు. అందరికీ ఇండ్లు అందివ్వాలన్న సీఎం కేసీఆర్ ఆలోచన బాగున్నా.. స్థానిక నాయకుల సమన్వయ లోపంతో అది నెరవేరడం లేదు. ఫలితంగా కొంతమంది వృద్ధ మహిళలు ఆశ్రయం కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. దమ్మచెరువు గ్రామంలో చాలా మంది వృద్ధులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇవ్వలేదు. ఈ క్రమంలో శనివారం వాళ్లు మంత్రిని అడిగేందుకు సిద్ధమయ్యారు. వీరికి మంత్రి నుంచి ఎలాంటి సమాధానం దొరుకుతుందో చూడాలి. మంత్రి కట్టిస్తామని హమీ ఇస్తాడా.. లేక వృద్ధ మహిళలు సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు సిద్ధమైతారా అనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed