కేసీఆర్ సర్.. లండన్​, న్యూయార్క్‌లా ఎప్పుడు?

by Shyam |   ( Updated:2021-07-01 22:31:02.0  )
కేసీఆర్ సర్.. లండన్​, న్యూయార్క్‌లా ఎప్పుడు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: మళ్లీ వానాకాలం మొదలైంది. చిన్నపాటి వర్షాలకే రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. గతంలో ఈ నగరాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్​ చేసిన ప్రకటనలో మళ్లీ కండ్ల ముందుకు వస్తున్నాయి. కానీ ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేరలేదు. ఎన్నికల సమయంలో అరచేతిలో వైకుంఠం చూపించే సర్కారు ఆ తర్వాత కనీసం పట్టించుకోవడం లేదు. కరీంనగర్​ను లండన్​, న్యయార్క్​ తరహాలో తీర్చి దిద్దుతామన్నారు. హైదరాబాద్​ను విశ్వనగరంగా చేస్తామన్నారు. కానీ గతేడాది వరదలకు రాజధాని మొత్తం బురదమయంగా మారింది. అటు వరంగల్​ను రాష్ట్రానికి రెండో స్మార్ట్​ సిటీ చేస్తామన్నారు. తాజాగా కెనడా వంటి ఆస్పత్రి నిర్మిస్తున్నామని ప్రకటించారు. అటు పాత బస్తీని ఇస్తాంబుల్​ తరహా తీర్చిదిద్దుతామన్నారు. కానీ అక్కడ ఇప్పటివరకు చిన్న రాయి కూడా పెకిలించలేదు.

మాయా ప్రపంచం

హుజూరాబాద్ ఉపఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్​ సడెన్​గా జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఇటీవల వరంగల్ పర్యటనలో ఆయన చేసిన ప్రకటన రాజకీయ విశ్లేషకుల్ని మళ్లీ ఆశ్చర్య పరుస్తోంది. గతంలో ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేరలేదు. ఇప్పుడు మళ్లీ అదే రాగమెత్తుకుంటున్నారు. జిల్లా పర్యటనలకు వెళ్లిన ప్రతిసారి ప్రపంచంలోని ఏదో ఒక ప్రసిద్ధి నగరంతో పోల్చి అదే తరహాలో అభివృద్ధి చేస్తామంటూ సీఎం ప్రకటిస్తున్నారు.

కరీంనగర్​ నుంచి మొదలు

2014లో టీఆర్​ఎస్​ గెలిచిన తర్వాత సీఎం హోదాలో కరీంనగర్​కు వెళ్లారు. రెండు రోజులు ఉత్తర తెలంగాణ భవన్​లో బస చేశారు. ఈ సందర్భంగా రివ్యూలో సీఎం ​కరీంనగర్​ను లండన్​, న్యూయార్క్​ తరహాలో మారుస్తానని, అద్దం తునకలాగా తయారు అవుతోందని, కరీంనగర్​ ప్రజలు కలలో కూడా ఊహించరని, రింగ్​రోడ్​, ఫోర్​లైన్​ వస్తాయని, ఫాస్ట్​ గోయింగ్​ టౌన్​గా మారుతున్న కరీంనగర్​కు తానే ఇంఛార్జీగా ఉంటున్నానని, లండన్​ తరహాలో చేసి చూపిస్తానంటూ ప్రకటించారు. కరీంనగర్​ ఎంత అద్భుతంగా ఉంటుందో ఎవరూ ఊహించని విధంగా మారుస్తానని చెప్పారు. ఇక అప్పటి నుంచి రాష్ట్రంలోని ఏ నగరానికి వెళ్లినా అక్కడ ఇలాంటి ప్రకటనలే చేయడం ఆనవాయితీగా మారింది.

హైదరాబాద్​ బురదమయం

రాజధానిని విశ్వనగరంగా మారుస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు విశ్వనగరంపై భ్రమలు తొలగిపోతున్నాయి. రాజధాని నగరం నరకంగా మారింది. గతేడాది భారీ వర్షాలతో హుస్సేన్‌సాగర్ నిండిపోయింది. ఆ నీటిని బయటకు పంపేందుకు దిగువభాగంలో ఉన్న అశోక్‌నగర్ వంటి లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయించారు. 2000 ఆగస్టులో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొనగా, బోట్లు ఏర్పాటు చేశారు. గత ఎన్నికల ముందు హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని హామీలు గుప్పించిన విషయం తెలిసిందే. విశ్వనగరం ఏమోకానీ… కనీసం భరోసాగా బతికే అవకాశం లేదంటున్నారు.

ప్రస్తుతం మళ్లీ వర్షాకాలం మొదలైంది. ఎక్కడ మ్యాన్​హోల్స్​ ఉన్నాయో, ఎక్కడ పైపులు పగిలి ఉన్నాయో తెలుసుకోవడమంటే అదో పెద్ద సాహసమే. ఇప్పటికే చిన్నపాటి వర్షాలు కురిసినా ప్రధాన రోడ్లు మొత్తం నీటితో నిండుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్​ పాత ప్రకటనలను మళ్లీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు.

ఎక్కడైనా… ఏదోకటి..!

లండన్, ఇస్తాంబుల్, డల్లాస్, న్యూయార్క్, కెనడా… ఇలా రాష్ట్రంలోని ఎక్కడకు వెళ్లినా ఇలా ఏదో ఒక సిటీ పేరు చెప్పడం, మాయ చేయడం కేసీఆర్​కు, టీఆర్​ఎస్​కు అలవాటుగా మారిందని రాజకీయవర్గాల్లో విమర్శలున్నాయి. ఎన్నో వాగ్దానాలు చేసి వాటి ఊసెత్తకుండా, మళ్లీ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో గతంలో చేసిన వాగ్ధానాలే సరిగ్గా నెరవేరలేదని, ఇప్పుడు కేసీఆర్ మళ్లీ అదే పాట పాడుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అంటున్నారు.

సోషల్​ మీడియాలో సెటైర్లు

గతేడాది వరదల్ని హైదరాబాద్ ప్రజలు ఇప్పటికీ మర్చిపోవడం లేదు. వాటిని సూచిస్తూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​పై పంచులు పేలుస్తున్నారు. డల్లాస్ అంటిరి.. ఇస్తాంబుల్ అంటిరి.. ఏం చేయాలో అర్థం కాక బర్బాద్ చేస్తిరి… అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. కేసీఆర్ చెప్పిన నగరాలన్నీ కట్టుకథలే అని తేలిపోతున్నాయని, ఇప్పుడు కెనడా పేరుతో వరంగల్​లో కొత్త నాటకం ఎత్తారంటూ సెటైర్లు వేస్తున్నారు.

హాలివుడ్​ను తలదన్నామా..?

హైదరాబాద్​ అభివృద్ధిపై ప్రభుత్వంపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. 2014, అక్టోబర్​ 10న టీడీపీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా కేసీఆర్​ మాట్లాడుతూ “ హాలీవుడ్‌ను తలదన్నేలా సినీ పరిశ్రమ ఉంటుందని, దేశం గర్వపడే విధంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలను రూ. 10 వేల కోట్లతో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అంతర్జాతీయ నగరాలను మించిన మహా నగరాన్ని నిర్మిస్తామని, హాలీవుడ్‌ను తలదన్నేలా సినీ పరిశ్రమను ఉంటుందని, టర్కీలోని ఇస్తాంబుల్ నగరాన్ని వారసత్వ సంపద దెబ్బతినకుండా ఏ విధంగా అభివృద్ధి చేశారో.. అదే తరహాలో వారసత్వ సంపదకు నష్టం కలుగకుండా హైదరాబాద్‌లోని పాతబస్తీని అభివృద్ధి చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఒక్కటి కూడా నెరవేరలేదు.

సీఎం కేసీఆర్​ ఇచ్చిన హామీలను ఓసారి గుర్తుకు తెచ్చుకుంటే..

2014, మార్చి, 3.
తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు ఎలా కోరుకుంటున్నారో అలా పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. భారత దేశానికి కాశ్మీర్ ఎలాంటిదో తెలంగాణ రాష్ట్రానికి ఆదిలాబాద్ జిల్లా అలాంటిది. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు కడితే ఆదిలాబాద్ జిల్లా సస్యశ్యామలమవుతుంది. ఆదిలాబాద్​ను తెలంగాణ కాశ్మీర్​ చేస్తాం.

2014, ఆగస్ట్ 5.
“ కరీంనగర్ అద్దం తునకలా తయారవుతుంది. ఎవరూ నమ్మలేని విధంగా రూపొందుతుంది. అద్భుతమైన రింగురోడ్డు, ఫోర్ లైన్ రోడ్లు.. లండన్, న్యూయార్క్ నగరాల్లో ఉండే మోడల్ లో నగరం తయారవుతుంది. కచ్చితంగా చేసి చూపిస్తాం.

2014, అక్టోబర్ 29
హైదరాబాద్ పై ప్రత్యేక దృష్టి పెట్టాం. టర్కీలో ఉన్న ఇస్తాంబుల్ సిటీ తరహాలో పాత బస్తీని తయారు చేస్తాం. పాతబస్తీకి వచ్చామా… ఇస్తాంబుల్​లో ఉన్నామా అనే అనుమానం రావాలి. అది నాదే బాధ్యత.

2014, నవంబర్​ 11.
హుస్సేన్​సాగర్​ చుట్టూ ఆకాశ హర్మ్యాన్లు నిర్మిస్తాం. ఎత్తైన భవనాలు, ట్యాంక్​బండ్​ చుట్టూ పెద్ద నిర్మాణాలు చేస్తాం. దీన్ని చూస్తే హైదరాబాద్​ సిటీ దేశ, విదేశాల్లో గుర్తుకు రావాలి.

2014, డిసెంబర్​ 29.
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌ను శుద్ధి చేస్తాం. దాన్ని మంచి నీటి చెరువుగా మారుస్తాం. కానీ ఇప్పటికీ మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థాలను హుస్సేన్ సాగర్‌లోకి తీసుకొచ్చే నాళాలను మళ్లించే ప్రయత్నంలో తెలంగాణ సర్కారు విజయం విఫలమవుతూనే ఉంది.

2015, జనవరి 1
ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నుమాయిష్-2015ను ప్రారంభించిన సందర్బంగా మాట్లాడుతూ హైదరాబాద్​లో డల్లాస్ తరహాలో మల్టీ లేయర్స్ ఫ్లై ఓవర్లు, సిగ్నల్ ఫ్రీ చౌరస్తాలు ఏర్పాటు చేస్తాం.

2016, సెప్టెంబర్ 24
హైదరాబాద్​ను విశ్వనగరంగా మారుస్తాం. రాజధాని అంటే ఇలా ఉండాలి అని చూపిస్తాం. హుస్సేన్​సాగర్​లో నీళ్లు కొబ్బరినీళ్లలాగా తయారుచేస్తాం. మొత్తం శుద్ది చేస్తాం. హుస్సేన్​సాగర్​లో నుంచి బాటిళ్లలో నీళ్లు ముంచుకుని తాగాలి.

2‌‌018, అక్టోబర్​, 3
నిజామాబాద్​ను న్యూయార్క్​గా మారుస్తాం. న్యూయార్క్​గా మార్చేందుకు మంత్రి పోచారం శ్రీనివాస్​రెడ్డి బాధ్యత తీసుకోవాలి.

2019, డిసెంబర్ 30.
కరీంనగర్​ను లండన్​గా మార్చుతానంటే నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు. కాళేశ్వరం పూర్తయితే లండన్​లో నది ఎలా ఉంటుందో మానేరు నది కూడా అంత సజీవంగా ఉంటుంది.

2021, జూన్ 21
వరంగల్​లో కెనడా తరహా వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తాం. పెద్ద పెద్ద ఆస్పత్రులను నిర్మిస్తాం.
అంతకు ముందు వరంగల్​ను రెండో రాజధాని తరహాలో అభివృద్ధి చేస్తామని కూడా ప్రకటించారు. వరంగల్​లో మెట్రో రైలు ఉంటుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed