గవర్నర్‌తో కేసీఆర్ సమావేశం.. ఈ భేటీకి ప్రాధాన్యత!

by Shyam |   ( Updated:2020-07-20 02:32:52.0  )
గవర్నర్‌తో కేసీఆర్ సమావేశం.. ఈ భేటీకి ప్రాధాన్యత!
X

దిశ, న్యూస్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌తో రాజ్‌భవన్‌లో సమావేశం కానున్నారు. త్వరలో క్యాబినెట్ సమావేశం జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కట్టడికి తీసుకుంటున్న చర్యలు, ఇస్తున్న ఫలితాలు, రోజురోజుకూ పెరిగిపోతున్న కేసులు, టెస్టుల సంఖ్యను పెంచడం, హోం ఐసొలేషన్‌లో ఉంటున్నవారికి ప్రభుత్వం తరఫున అందజేస్తున్న కిట్‌లు… తదితర పలు అంశాలపై గవర్నర్‌కు కేసీఆర్ వివరించనున్నారు. దేశంలో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్న ప్రధాన నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటిగా ఉన్నందున ఇప్పటివరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఇకపైన తీసుకోవాల్సిన చర్యలపై గవర్నర్‌కు వివరించే అవకాశం ఉంది. దేశంలో కరోనా వైరస్ కమ్యూనిటీ వ్యాప్తి జరిగిందని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ హాస్పిటల్ బోర్డు ఛైర్మన్ డాక్టర్ ఆర్వీ మోంగా వ్యాఖ్యానించిన నేపథ్యంలో రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. చాలా కాలం తర్వాత గవర్నర్‌తో కేసీఆర్ భేటీకావడం విశేషం.

పాత సచివాలయాన్ని కూల్చివేసి దాని స్థానంలో కొత్తదాన్ని నిర్మాణం చేయడంపై మంగళవారం మంత్రులు, రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారులు, డిజైన్ చేసిన ఆర్కిటెక్టుతో భేటీ కావడానికి ముందు గవర్నర్‌ను కలిసి ఈ విషయాన్ని వివరించనుండడం గమనార్హం. కొత్త సచివాలయం డిజైన్‌ను ఖరారు చేసేందుకు మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నందున త్వరలో జరిగే క్యాబినెట్ భేటీ గురించి కూడా ఈ సమావేశం సందర్భంగా గవర్నర్‌కు వివరించే అవకాశం ఉంది.

Advertisement

Next Story