లాక్‌డౌన్‌పై స్పష్టతనిచ్చిన సీఎం కేసీఆర్..

by Anukaran |   ( Updated:2021-05-06 12:06:16.0  )
లాక్‌డౌన్‌పై స్పష్టతనిచ్చిన సీఎం కేసీఆర్..
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించబోమని, దాని వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల్లో లౌక్‌డౌన్ విధించినా పాజిటివ్ కేసులు తగ్గడం లేదని, గతేడాది అనుభవం కూడా ఇదే తేల్చిందని, అందుకే ఆ దిశగా నిర్ణయం తీసుకోవడంలేదని నొక్కిచెప్పారు. హైదరాబాద్ నగరం మెడికల్ హబ్‌గా ఉన్నందున పొరుగు రాష్ట్రాల నుంచి కూడా కొవిడ్ పేషెంట్లు ఇక్కడికి వస్తున్నారని, ఫలితంగా ఆక్సిజన్, రెమిడెసివిర్ లాంటివాటికి డిమాండ్ పెరిగిందని, నగరంపై వత్తిడి ఎక్కువైందన్నారు. కరోనా పరిస్థితులపై ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య శాఖ అధికారులతో గురువారం సుదీర్ఘంగా సమావేశం నిర్వహించిన కేసీఆర్ లాక్‌డౌన్ విధించే ప్రసక్తే లేదని పత్రికా ప్రకటనలో స్పష్టంచేశారు.

రాష్ట్రానికి కావాల్సిన కరోనా వాక్సిన్లు, ఆక్సిజన్, రెమిడెసివర్ తదితరాల సరఫరా గురించి ప్రధాని నరేంద్రమోడితో టెలిఫోన్‌లో మాట్లాడిన కేసీఆర్ తక్షణమే రాష్ట్రానికి సమకూర్చాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తమిళనాడులోని శ్రీపెరంబదూరు నుంచి, కర్నాటకలోని బల్ళారి నుంచి రాష్ట్రానికి కేటాయించిన ఆక్సిజన్ అందడంలేదని ప్రధాని దృష్టికి తీసుకెళ్ళారు. మహారాష్ట్ర, చత్తీస్‌గడ్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు కోవిడ్ చికిత్స కోసం రావడంవలన వీటికి డిమాండ్ పెరిగిందన్నారు. తెలంగాణలో మొత్తం కొవిడ్ ఇన్‌పేషెంట్లలో 50 శాతం ఇతర రాష్ట్రాలకు చెందినవారేనని గుర్తుచేశారు. అందువల్లనే ఆక్సిజన్, వాక్సిన్, రెమిడిసివర్ లాంటివాటికి డిమాండ్ ఎక్కువైందన్నారు.

రష్యా నుంచి క్రయోజెనిక్ ఆక్సిజన్..

ప్రస్తుతం రోజుకు 440 టన్నుల ఆక్సిజన్ మాత్రమే రాష్ట్రానికి అందుతోందని, దాన్ని 500 టన్నులకు పెంచాల్సిందిగా ప్రధానికి విజ్ఞప్తి చేశారు. కేవలం 4,900 రెమిడెసివిర్ ఇంజెక్షన్లు మాత్రమే అందుతున్నాయని దాన్ని పాతిక వేలకు పెంచాలని కోరారు. ఇప్పటివరకు కేంద్రం 50 లక్షల వ్యాక్సిన్ డోసులను అందచేసిందని, కానీ రాష్ట్ర అవసరాల దృష్ట్యా రోజుకు రెండున్నర లక్షల డోసులు వినియోగించేలా సత్వరమే సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ ఫోన్‌లో కేసీఆర్‌తో మాట్లాడి ఆక్సిజన్, వాక్సిన్, రెమిడెసివిర్ సత్వర సరఫరాకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తూర్పు రాష్ట్రాల నుంచి ఆక్సిజన్‌ను సరఫరా జరిగేలా చూస్తామన్నారు. తక్షణమే 500 ఆక్సీజన్ ఎన్‌రిచర్లను కొనుగోలు చేయాల్సిందిగా ఆదేశించారు.

రాష్ట్రంలో నెలకొన్న తాజా కరోనా పరిస్థితులను అధికారులతో కూలంకషంగా సమీక్షించిన కేసీఆర్ ప్రస్తుతం ఎంత ఆక్సిజన్ అందుతోంది, ఇంకా ఎంత కావాలి, వాక్సిన్‌లు ఎంత అందుబాటులో వున్నాయి, రోజుకు ఎంత అవసరం, రెమిడెసివిర్ సప్లయి ఎలా ఉంది, రాష్ట్ర అవసరాలకు రోజుకు ఎన్ని అవసరం, ఆక్సిజన్ బెడ్ల లభ్యత తదితరాలపై ఆరా తీశారు. రెమిడెసివిర్ తయారీ సంస్థలతో ఫోన్‌లో మాట్లాడిన సిఎం వాటి లభ్యతను మరింతగా పెంచాలని కోరారు. ప్రస్తుతం ఉన్న 9500 ఆక్సిజన్ బెడ్లను హైదరాబాద్ సహా జిల్లాల్లో మరో వారం రోజుల్లో అదనంగా 5000 పెంచాలన్నారు. మెరుగైన ఆక్సిజన్ సరఫరా కోసం ఒక్కోటి కోటి రూపాయల చొప్పున మొత్తం 12 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను చైనా నుంచి వాయుమార్గంలో అత్యవసరంగా దిగుమతి చేయాలని ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ, ఏరియా ఆస్పత్రుల్లో మొత్తం ఏర్పాటైన 5,980 కోవిడ్ అవుట్ పేషెంట్ సెంటర్ల సేవలను ఉపయోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

రికవరీ బాగా మెరుగైంది..

సెకండ్ వేవ్‌లో ఇప్పటిదాకా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కలిపి 1.56 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాని, ఇందులో 1.30 లక్షల మంది (85 శాతం) కోలుకున్నారని అధికారులు సీఎంకు వివరించారు. కరోనా పరిస్థితిపై ప్రతి రోజూ సాయంత్రం వైద్య అధికారులు సాయంత్రం మీడియా సమావేశాన్ని నిర్వహించి వివరాలను వెల్లడించాలని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ను సీఎం ఆదేశించారు. పాజిటివ్ కేసులు, కోలుకున్నవారు, హోం క్వారెంటైన్ పేషెంట్లు, చికిత్స పొందుతున్నవారు, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇన్‌పేషెంట్లుగా ఉన్నవారు తదతిర వివరాలను పబ్లిక్ డొమెయిన్‌లో ప్రదర్శించాలని ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం వైద్యశాఖ తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. వైద్య శాఖకు అవసరమైన నిధులను వెంట వెంటనే విడుదల చేయాలని ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించి, ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలన్నారు.

సెకండ్ డోస్‌కు ప్రాధాన్యత

మొదటి డోస్ వాక్సిన్ వేసుకున్నవాళ్ళకు వారి నిర్ణీత సమయాన్ని అనుసరించి రెండో డోస్ వేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఆదేశించారు. పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు గ్రామాలు పట్టణాల్లో సోడియం హైపోక్లోరేట్‌ను పిచికారీ చేయించి పరిసరాలను పరిశుభ్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు భాగస్వాములు కావాలన్నారు. కరోనా విషయంలో ప్రజలు భయాందోళన గురికావద్దని, ఏమాత్రం అనుమానం వచ్చినా టెస్టుల కోసం ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అందించే కొవిడ్ మెడికల్ కిట్లను వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. ‘ఆశా‘ వర్కర్లు, ఎఎన్ఎంల ద్వారా ఇంటింటికీ ఈ కిట్లను అందచేస్తామన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రణాళికా సంఘం ఉపాద్యక్షులు వినోద్ కుమార్, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, సీఎంవో కరోనా ప్రత్యేక పర్యవేక్షణాధికారి రాజశేఖర్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ డాక్టర్ రమేశ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story