కేటీఆర్ సెల్ఫ్ గోల్.. కేసీఆర్ నుంచి అక్షింతలు

by Anukaran |   ( Updated:2021-03-02 03:53:28.0  )
KCR angry, KTR
X

దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి కేటీఆర్ ప్రకటన గులాబీలను ఇరుకున పడేసిందా? దీనిపై సీఎం కేసీఆర్​ ఎందుకు ఆగ్రహంగా ఉన్నారు? అనేదే ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో జరుగుతున్న చర్చ. అందుకే మండలి ఎన్నికల్లో సీఎం కేసీఆర్​ అంతా తానై నడిపిస్తున్నాడట. ఎందుకంటే ఉద్యోగాల భర్తీ అంశంలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో పడేసింది. దాన్ని సమర్ధించుకోలేని పరిస్థితి ఓవైపు… అనవసరంగా లెక్కలు ఇచ్చి తలనొప్పి తీసుకొచ్చారని అధినేత ఆగ్రహంగా ఉన్నట్లు గులాబీ శ్రేణులు చెప్పుతున్నాయి.

రాష్ట్రంలో లక్షా 32 వేల ఉద్యోగాలను భర్తీ చేశామనే మంత్రి కేటీఆర్ ప్రకటన అధికార పార్టీని ఇబ్బందుల్లో పడేసింది. దానిపై ఇంకా సర్ధి చెప్పుకునేందుకు కూడా ఛాన్స్ లేకుండాపోయింది. రోజుకో మంత్రి దీనిపై ప్రకటనలు చేస్తున్నా.. అదంతా మేకపోతు గాంభీర్యమే. ఎందుకంటే దాన్ని నిరూపించుకోలేని పరిస్థితి. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు కోపంతో ఉన్నాయి. వారిని ఎలా మచ్చిక చేసుకోవాలనే విషయంలో చాలా ప్లాన్​లే వేస్తున్నారు. ఇటు నిరుద్యోగులు టీఆర్‌ఎస్ పార్టీ అంటేనే అగ్గి మండుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో భుజాలపై వేసుకున్న నిరుద్యోగులు, విద్యార్థులు ఇప్పుడు ఓట్లు అడిగేందుకు అధికార పార్టీ నుంచి ఎవరైనా వస్తే దాడి చేసేంత కోపంతో రగులుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటన మరింత ఆజ్యం పోసింది.

మంత్రులకు చుక్కలు

ఇక ఉద్యోగాల భర్తీ అంశంలో కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న కొంతమంది మంత్రులకు ప్రతిపక్షాలు, నిరుద్యోగులు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే కాకతీయ యూనివర్సిటీలో మంత్రి ఎర్రబెల్లిని బయటకు పంపించారు. ఇక్కడ కేయూలో కూడా అదే పరిస్థితి. అసలే పార్టీకి యువరాజు.. సీఎం కేసీఆర్​కొడుకు… కాలం కలిసొస్తే కాబోయే సీఎం.. ఇంకేం పార్టీ నేతలు యువరాజు చెప్పిందే అక్షరాలా నిజమంటూ చెప్పుకొస్తున్నారు. ఇలాగే చెప్పేందుకు ప్రయత్నాలు చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​ ప్రతిపక్షాలకు దొరికిపోయాడు. ఆయనపై ఆలుగడ్డల నుంచి అసమ్మతి దాకా విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన కొంత సైలెంట్ అయ్యాడు. అక్కడో, ఇక్కడో మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి కూడా పాలమూరు గడ్డపై ఉద్యోగాల భర్తీపై ఏదో చెప్పబోయారు. కానీ గులాబీ నేతలే వారించారు. ఉద్యోగాల భర్తీపై చెప్పాలంటే కొంత వణుకు మొదలవుతోంది. కానీ కేటీఆర్ చెప్పిన లెక్కలను సమర్ధించాల్సి రావడంతోనే నేతలకు తప్పడం లేదు. మరోవైపు సీనియర్లు మాత్రం దీనిపై నోరెత్తడం లేదు. మంత్రులు ఈటల రాజేందర్, హరీష్ రావు, ఇంద్రకరణ్​రెడ్డి, నిరంజన్​రెడ్డి వంటివారు మాత్రం ఉద్యోగాల భర్తీ లెక్కలపై కొంత వెనకడుగే వేస్తున్నారు.

కేటీఆర్ సెల్ఫ్​గోల్

మండలి ప్రచారానికి ముందు మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో లక్షా 32వేల ఉద్యోగాల భర్తీపై లెక్కలను బయటకు ఇచ్చారు. దీంతో అన్ని వర్గాలు భగ్గుమన్నాయి. లెక్కలను ఇచ్చిన మంత్రి కేటీఆర్.. ప్రస్తుతం దాన్ని చెప్పకుండా ఉండేందుకే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. మండలి ఎన్నికల వేళ నిరుద్యోగులు, యువత ఓట్ల కోసం బయటకు ఇచ్చిన ఉద్యోగాల భర్తీ లెక్కలు మంత్రి కేటీఆర్‌కే చుట్టుకుంటున్నాయి. మరోవైపు సీఎం కేసీఆర్ నుంచి కూడా దీనిపై కొంత అసహనం వ్యక్తమైనట్లు పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. దీనికోసమే ఆయన్ను ఎందుకైనా మంచిదనే కారణంతో మండలి ఎన్నికల ప్రచారంలో పూర్తిస్థాయిలో తిప్పడం లేదు. ఎక్కడో ఓ చోట ప్రెస్​మీట్లకు పరిమితమవుతున్నారు. అంతేకానీ యూనివర్సిటీలు, విద్యా సంస్థలకు అడుగు పెట్టడం లేదు. మొన్నటి వరకు యూత్ ఐకాన్‌గా ప్రచారం చేసుకున్న గులాబీ దళం.. ఇప్పుడు మాత్రం కేటీఆర్ యూత్‌కూ దూరంగానే వ్యవహరిస్తున్నారు. అనవసరం రాద్ధాంతాన్ని ముందుకేసినట్లు అటు సీఎం నుంచి కూడా అక్షింతలు పడినట్లు పార్టీ నేతలు చెప్పుతున్నారు. దీంతో మంత్రి కేటీఆర్ సెల్ఫ్ గోల్ అయినట్లు పార్టీలో ప్రచారం.

ఛీ ఛీ.. అక్కడ కూడా కేసీఆర్ బొమ్మలేనా?

Advertisement

Next Story

Most Viewed