కేసీఆర్ అన్నం పెట్టిన వాళ్ళకు సున్నం పెట్టేరకం

by Shyam |
Kodandareddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇందిరాపార్కు ధర్నా కంటే ముందు ..అసెంబ్లీ సమావేశాలు పెట్టి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి డిమాండ్ చేశారు. గాంధీ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్… అన్నంపెట్టే వాళ్లకు సున్నం పెట్టే రకం అని దుయ్యబట్టారు.

వానాకాలం వరి వేయకముందే ధాన్యం పై కేంద్రం లేఖ రాసిందని, ఆ లేఖ ఇప్పుడే వచ్చినట్లు కేసీఆర్ చెప్పడం ఆయనకు రైతాంగంపై ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. వ్యవసాయ చట్టాలు వచ్చి సంవత్సరం అయిందని ఇన్ని రోజులు టీఆర్ఎస్ ఏమిచేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న పార్టీలు ధర్నా చేయడం ఏమిటని ప్రశ్నించారు.

బీజేపీ ,టీఆర్ఎస్ మధ్య లోపాయకారి ఒప్పందం ఉందని ఆరోపించారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు బీజేపీ, టీఆర్ఎస్ దొంగ నాటకాలు.. ఆడుతున్నాయని మండిపడ్డారు. చివరి గింజ వరకు కొంటామన్న కేసీఆర్.. ఆ మాట మీద నిలబడతారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. దూర దృష్టి లేని ముఖ్యమంత్రి వల్లే ఈ సమస్యలు అని ఆరోపించారు. సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి హర్కర వేణుగోపాల్, కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు సంగిశెట్టి జగదీశ్, ఆదాం సంతోష్, కాంగ్రెస్ ఫిషేర్మెన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed