మెట్రోపై కేసీఆర్ కీలక ప్రకటన?

by Shyam |
మెట్రోపై కేసీఆర్ కీలక ప్రకటన?
X

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ మెట్రో విస్తరణపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రపంచ హంగులతో విశ్వనగరంలో నిర్మితమైన మెట్రో ఇప్పటికే పరుగులు పెడుతుండగా మరో 15 కిలోమీటర్లకు సంబంధించిన జేబీఎస్.. ఎంజీబీఎస్ మెట్రోమార్గాన్ని ఈ నెల 7న కేసీఆర్ ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. అయితే అదేరోజున నగరంలో మెట్రో విస్తరణపై ప్రకటన చేయబోతున్నారని, ఇప్పటికే దీనిపై అధికారులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు ఉన్న మెట్రోను పటాన్‌చెరు వరకు, నాగోల్- రాయదుర్గం మార్గాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు విస్తరించడంతోపాటు నాగోల్, ఎల్బీనగర్ మెట్రో స్టేషన్లను అనుసంధానం చేసి, హయత్‌నగర్ లేదా ఔటర్ రింగ్ రోడ్డు వరకు మెట్రో పొడగింపునకు కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మొదటగా రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో పనులను రెండు మూడేళ్లలోనే పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈసారి చేపట్టబోయే మెట్రో పనులకు మళ్లీ టెండర్లు పిలవడమా.. లేకుంటే ఇదివరకు మెట్రోను నిర్మించిన ఎల్ అండ్ టీ కంపెనీకే అప్పగించడమా అన్న దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఎయిర్ పోర్టు వరకు మెట్రో సర్వీసులు అందుబాటులోకి వస్తే నగర ప్రయాణికులు ఎమర్జనీ పనుల మీద బయటకు వెళ్లాలనుకున్న సమయంలో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నగరంలో ట్రాఫిక్ నరకం చూపిస్తుండటంతో మెట్రో విస్తరణ చేపడితేనే భవిష్యత్‌లో ఇబ్బందులు రాకుండా ఉంటాయన్న యోచనను అధికారులు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం.

మొదటిసారిగా మెట్రోను 2017లో ప్రధాని మోడీ ప్రారంభించగా తర్వాత ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు సర్వీసులను అప్పటి గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. తర్వాత అమీర్‌పేట నుంచి రాయదుర్గం మార్గంలో మెట్రో సర్వీసుల పొడగింపులను మంత్రులే ప్రారంభించారు కానీ సీఎం కేసీఆర్ హాజరుకాలేదు. ఈసారి జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో సర్వీసుల ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ వస్తుండటంతో నగరంలో మెట్రో విస్తరణపై కీలక ప్రకటన చేయబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాదిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉండటంతో అప్పటిలోపే ప్రకటన చేసి పనులను ప్రారంభించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఒకవైపు మెట్రో పనులు జరుగుతుంటే.. మరోవైపు ప్రచారంలో టీఆర్ఎస్‌కు అనుకూల పవనాలు వీచే అవకాశాలు ఉంటాయని పార్టీ శ్రేణులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే కేసీఆర్ మెట్రో ప్రారంభోత్సవానికి రాబోతున్నరన్న ప్రచారం జరుగుతోంది.

Advertisement

Next Story