వారికి మరోసారి ఛాన్స్..? కొలిక్కి వచ్చిన ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక

by Shyam |   ( Updated:2021-11-06 11:13:29.0  )
trs 1
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్యే కోటా కింద భర్తీ కావాల్సిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక దాదాపు కొలిక్కి వచ్చింది. వీటితో పాటే గవర్నర్ కోటా కింద భర్తీ చేస్తే నామినేటెడ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా ఖరారైనట్లు తెలిసింది. ఇంతకాలం శాసనమండలి ఛైర్మన్‌గా ఉన్న గుత్తా సుఖేందర్‌రెడ్డిని ఈసారి గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ చేయనున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు కడియం శ్రీహరి, మధుసూదనాచారి, కౌశిక్‌రెడ్డి, ఎర్రోళ్ళ శ్రీనివాస్, ఎంసీ కోటిరెడ్డి పేర్లు ఖరారైనట్లు తెలిసింది. కానీ పార్టీ కార్యదర్శి తక్కళ్ళపల్లి రవీందర్ రావు, ఎల్.రమణ తదితరుల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ఈ నెల 9వ తేదీన నోటిఫికేషన్ జారీ కావడం, అదే రోజున నామినేషన్లు కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో రెండు రోజుల్లో పార్టీ అధికారికంగా ప్రకటించనున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.

కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటా కింద నామినేటెడ్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రతిపాదించి ఫైల్‌ను రాజ్‌భవన్‌కు పంపినప్పటికీ.. ఇంకా ఆమోదం లభించలేదు. దీంతో కౌశిక్‌రెడ్డిని ఈసారి ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీని చేసి గుత్తా సుఖేంధర్‌రెడ్డిని గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ చేయాలనే ఆలోచన ఉన్నట్లు తెలిసింది. నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా నల్లగొండ జిల్లాకు చెందిన ఎంసీ కోటిరెడ్డిని ఎమ్మెల్సీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలోనే ప్రకటించారు. ఆ కారణంగా ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ కానున్నట్లు తెలిసింది.

ఇంతకాలం ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా వ్యవహరించిన ఎర్రోళ్ళ శ్రీనివాస్‌ను ఈసారి ఎమ్మెల్సీ చేయాలని కేసీఆర్ భావించినట్లు తెలిసింది. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ కూడా ఈ ప్రతిపాదన పట్ల సంతృప్తి వ్యక్తం చేసి ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంట ఉన్న మధుసూదనాచారిని ఎమ్మెల్సీని చేయనున్నట్లు పలు సందర్భాల్లో కేసీఆర్ ప్రకటించారు. ఇటీవల ప్లీనరీ సందర్భంగా కూడా ఈ ప్రస్తావన తెచ్చారు. దీంతో ఈసారి ఆయన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కానున్నట్లు పార్టీ వర్గాలు నొక్కిచెప్పాయి.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఇటీవల టీఆర్ఎస్‌లో చేరిన ఎల్.రమణకు కూడా ఎమ్మెల్సీ అవకాశం కల్పించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఆయన పేరు పరిశీలనలోనే ఉన్నదని, అయితే కేసీఆర్ ఖరారు చేసిన సంగతి ఇంకా బహిర్గతం కాలేదని పార్టీ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. వరంగల్ జిల్లాకు చెందిన తక్కళ్ళపల్లి రవీందర్ రావు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. మొత్తానికి ఆరుగురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే కోటా కింద, ఒకరు గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ కానున్నారు. పార్టీ అధికారికంగా ప్రకటన చేసిన తర్వాత దీనిపై మరింత క్లారిటీ రానున్నది. నామినేషన్లు ప్రారంభం కావడానికి మరో మూడు రోజులు గడువు ఉండడంతో ఈ లోపే పార్టీ నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది.

Advertisement

Next Story

Most Viewed