TGPSC: రేసులో 45 మంది.. టీజీపీఎస్సీ నెక్స్ట్ చైర్మన్ ఎవరు ?

by Rani Yarlagadda |   ( Updated:2024-11-24 01:55:48.0  )
TGPSC: రేసులో 45 మంది.. టీజీపీఎస్సీ నెక్స్ట్ చైర్మన్ ఎవరు ?
X

దిశ, తెలంగాణ బ్యూరో: పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పోస్టుకు తీవ్ర పోటీ నెలకొన్నది. ఆ ఒక్క పోస్టు కోసం సుమారు 45 దరఖాస్తులు వచ్చినట్టు తెలిసింది. రిటైర్డ్ ఐఏఎస్ లు కూడా అప్లై చేశారు. అలాగే వివిధ వర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు సైతం తమ దరఖాస్తులు పంపారు. ప్రస్తుత చైర్మన్ మహేందర్ రెడ్డి పదవి కాలం వచ్చే నెల 3న ముగియనుంది. ఈ లోపే కొత్త చైర్మన్ ను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం నోటీఫికేషన్ ఇవ్వగా ఈనెల 20తో దరఖాస్తుల గడువు ముగిసింది. వచ్చిన దరఖాస్తుల్లో ఒకరిని సీఎం ఎంపిక చేసి, నియామకం కోసం ఫైల్ ను గవర్నర్ ఆమోదం కోసం పంపనున్నారు. డిసెంబరు 3లోపు కొత్త చైర్మన్ ఎంపిక పూర్తవనుందని సెక్రటేరియట్ వర్గాల్లో ఉన్నటాక్. ఈసారి పూర్తి స్థాయి చైర్మన్ నియమించేందుకు సీఎం మొగ్గుచూపుతున్నారు. ఏడాది, రెండేళ్ల పాటు పదవిలో ఉండే చైర్మన్ కాకుండా 6 ఏళ్ల పాటు పదవిలో ఉండే వ్యక్తి కోసం ఆయన అన్వేషన చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత చైర్మన్ మహేందర్ రెడ్డి వయస్సురీత్యా కేవలం 11 నెలల పాటు మాత్రమే పదవిలో కొనసాగే అవకాశం ఉంది. ఆయన ఈ ఏడాది జనవరి 26న బాధ్యతలు చేపట్టారు. డిసెంబరు 3తో ఆయనకు 62 ఏళ్లు పూర్తవడంతో పదవీ విరమణ చేయడం తప్పనిసరి.

బీసీ వర్గానికి చైర్మన్ పదవి?

సామాజిక సమీకరణను దృష్టిలో పెట్టుకుని ఈసారి సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవిని బీసీ వర్గానికి ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్టు తెలిసింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ బ్యూరోక్రట్ కు చైర్మన్ బాధ్యతలు అప్పగించే యోచనలో ఆయన ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సమర్థుడనే పేరున్న సదరు ఆఫీసర్ ను బీఆర్ఎస్ పాలకులు కావాలనే ప్రయారిటీ ఇవ్వలేదన్న విమర్శలు ఉండేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయనకు కొన్ని కీలక శాఖల బాధ్యతలు అప్పగించిన సీఎం ఇప్పుడు సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవి కూడా అప్పగించేందుకు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed