- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీసు ప్రమోషన్.. పాలసీ స్లోమోషన్
దిశ, కరీంనగర్: పోలీస్‌శాఖలో అడ్‌హక్ ప్రమోషన్ల పేరిట టైంపాస్ చేస్తుండటంతో బ్యాచ్‌లకు బ్యాచ్‌లే నష్టపోతున్నాయి. 2002 నుండి డీపీసీ సమావేశం ఏర్పాటు చేయక పోవడంతో డీఎస్పీలుగా పదోన్నతి పొందినవారు అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ అందుకోలేక పోతున్నారు. చివరకు కొందరు కోర్టును ఆశ్రయించారంటే పోలీస్‌శాఖలో ప్రమోషన్ల తంతు ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2002 నుండి సీనియారిటీ లిస్ట్ తయారు చేయడం లేదంటే ఉన్నతాధికారులు ఎంతవరకు నిబంధనలను అమలుచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. 18 ఏళ్ల నుండి అడ్‌హక్ ప్రమోషన్ల పేరిట కొందరికే పదోన్నతులు కల్పిస్తూ సీనియారిటీ లిస్ట్‌ను మాత్రం రెడీ చేయట్లేదు. దీంతో కిందిస్థాయి అధికారులపై హైలెవల్ ఆఫీసర్స్ చూపుతున్న విధానం కళ్లకు కట్టినట్టు కనపడుతోంది.
డీపీసీ అంటే..?
డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీని (డీపీసీ) ప్రతి సెప్టెంబర్‌లో సమావేశం పర్చాలి. బ్యాచ్‌ల వారీగా పదోన్నతులకు అర్హత ఉన్నవారి జాబితాను ఈ కమిటీ రివ్యూ చేస్తుంది. శాఖాపరమైన చర్యలు పెండింగ్‌లో ఉన్నా, సాంకేతిక కారణాలు ఉన్నవారిని జాబితా నుండి తప్పించి అర్హుల లిస్ట్ తయారు చేస్తారు. ఫైనల్ లిస్ట్‌ను బట్టే అర్హులైన డీఎస్పీలకు అడిషనల్ ఏస్పీలుగా ప్రమోషన్ కల్పించాలి. అయితే శాఖాపరమైన చర్యలతో పదోన్నతులకు అర్హత కల్పించనివారిపై ఉన్న ఆరోపణలు రుజువు కాకుంటే రివ్యూ డీపీసీ ఏర్పాటు చేసి వారి పదోన్నతికి అప్రూవల్ చేసి అదే బ్యాచ్‌కు చెందిన మిగతావారికి ఎప్పటి నుండైతే పదోన్నతులు కల్పించారో అప్పటి నుండే వీరికి కూడా సీనియారిటీని పరిగణించాల్సి ఉంటుందన్నది ఫండమెంటల్ రైట్. కానీ, డీపీసీనే ఏర్పాటు చేయకపోడం సీనియారిటీ లిస్ట్ తయారు చేసే విధానానికే మంగళం పాడడం ఇక్కడి పోలీసు అధికారులకే చెల్లింది. దీంతో రిటైర్ అయ్యేనాటికి నిబంధనల ప్రకారం వారు అందుకోవాల్సిన ప్రమోషన్లు చేజిక్కించుకోలేకపోతున్నారు.
నోషనల్ సీనియారిటీ జాబితా పక్కనపెట్టి తమవారి కోసం అడ్‌హక్ ప్రమోషన్లు కల్పిస్తుండడంతో అర్హులైనవారు కూడా డీఎస్పీలుగానే మిగిలిపోతున్నారు. దీంతో జూనియర్లు అడ్‌హక్ ప్రమోషన్ల ద్వారా అడిషనల్ ఎస్పీ పదోన్నతుల సీనియారిటీ జాబితాలో చేరిపోతున్నారు. ఈ విధానంతో నిబంధనల ప్రకారం పదోన్నతులు పొందాల్సిన సీనియర్లు కొంతమంది రిటైర్ పోతున్నారు. ఏంటి సార్ ఈ అన్యాయం అని అడిగితే బాసులనే ఎదిరిస్తున్నాడన్న అపవాదు మూటగట్టుకోవాల్సి వస్తోందన్న బాధ కొందరిదైతే, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆగిపోతాయన్న భయం మరికొందరిలో ఉంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాతైనా తమ జీవితాల్లో వెలుగు వస్తుందని భావించిన అధికారులకు కూడా నిరాశే మిగిలింది. ఇప్పుడు కూడా అడ్‌హక్ ప్రమోషన్లకే ప్రాధాన్యత ఇస్తుండడంతో డీపీసీ విధానాన్ని మర్చిపోయినట్టే అయింది.
ఐపీఎస్‌లకు పర్‌ఫెక్ట్ టైంలోనే పదోన్నతులు వస్తుంటే కిందిస్థాయివారు మాత్రం ఏళ్లకు ఏళ్లు ఎదురు చూస్తున్నారు. దీంతో తమ కళ్లముందే ఐపీఎస్‌లు అలాట్ అయి ప్రొబేషనరీగా పనిచేసి ఎస్పీలు, ఐజీలు, అడిషనల్ డీజీలుగా పదోన్నతులు పొందితే, కిందిస్థాయి అధికారులు రిటైరయ్యే నాటికి ముచ్చటగా మూడు ప్రమోషన్లు కూడా అందుకోవట్లేదు. సమన్యాయం పాటించాల్సిన కొందరు అధికారులు కొందరు మంత్రులపైనే ఆధారపడుతుంటారన్నది బహిరంగ రహస్యం. మంత్రులు కాని మంత్రులుగా పోలీసుశాఖను శాసిస్తోంది మాత్రం మినిస్టీరియల్ స్టాఫేనని చెప్పాలి. సకాలంలో పదోన్నతుల జాబితాను తయారు చేయకపోవడం కూడా ప్రధాన కారణమని తెలుస్తోంది. కొంతమంది అధికారులు మినిస్టీరియల్ స్టాఫ్ వ్యవహారంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నా ఫిర్యాదు చేయని పరిస్థితి నెలకొంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ల గుట్టు అంతా వారి చేతిలోనే ఉండడం ఓ కారణం అయితే పనిష్మెంట్ల విషయంలోనూ వీరిదే కీలకపాత్ర కావడంతో జీవితాలపై రెడ్ మార్క్ పెట్టేస్తారన్న భయం కూడా చాలామందిలో ఉంది.
రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు విషయంలో ఓ విధానం అమలవుతుంటే.. పోలీసుశాఖలో మాత్రం భిన్నంగా సాగుతోందనే చెప్పాలి. ఓ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరి అధికారిగా పదోన్నతి పొందితే, అధికారిగా పోస్టింగ్ పొందిన పోలీసు అధికారి ప్రమోషన్ పొందడానికి దశాబ్దాలు గడిచిపోతోంది. ఇది ఇతరశాఖల్లో పనిచేసేవారికి పోలీసుశాఖలో పనిచేస్తున్న వారికి తేడా. అయినా ఈ విషయాన్ని పట్టించుకునే వారు లేరు… ప్రశ్నించే వారు అంతకన్నా లేరనే చెప్పాలి.
Tags: Karimnagar, Police Department, Ad Hoc, Promotions, Departmental Promotion Committee, Notional, IPS, SC, DSP, Court, 2002, Telangana