స్మార్ట్ సిటీ పనులతో కరీంనగర్ రూపురేఖల్ని మార్చాలి

by Sridhar Babu |   ( Updated:2021-12-27 07:59:19.0  )
Gangula Kamalakar
X

దిశ, కరీంనగర్ సిటీ : ప్రజలు గర్వపడేలా కరీంనగర్‌ను అభివృద్ధి చేయడంతోపాటు, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర పౌరసరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులపై మున్సిపల్, ఆర్ అండ్ బీ ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నగర మేయర్ సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి చేయాలన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ మంజూరు అయిందని తెలిపారు. హుజురాబాద్ శాసనసభ ఉప ఎన్నిక, స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా నగరంలో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. ప్రజల సహకారంతో రోడ్లను వెడల్పు చేయడంతోపాటు, నాణ్యంగా రోడ్లు వేయాలని అధికారులకు సూచించారు.

స్మార్ట్ సిటీ పనులకు సంబంధించి నిధులకు కొరత లేదని, పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మున్సిపల్, ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరములో 14.5 కిలోమీటర్ల పరిధిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఫుట్ పాత్ లలో పాదచారులు నడిచేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కేబుల్ పనుల కోసం రోడ్లను తవ్వి పాడు చేయవద్దని, మున్సిపల్, ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారుల అనుమతి లేకుండా ఇష్టారీతిన రోడ్లను తవ్వి పాడుచేస్తే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు రోడ్లను ఊడ్చే యంత్రాలతో రోడ్లపై మట్టి లేకుండా శుభ్రం చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. రోడ్లపై కూరగాయలు, పండ్లు విక్రయించే వ్యాపారులను రైతు బజార్లకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

Minister Ganguly

కళాశాల మైదానంలో చేపడుతున్న పార్కు పనులను 2022 ఫిబ్రవరి 14వ తేదీ లోపు పూర్తి చేయాలని మంత్రి తెలిపారు. పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వచ్చే నెల జనవరి మొదటి వారంలో ప్రారంభించాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. డీఎంఎఫ్టీ నిధులతో చేపడుతున్న షాదీఖానా, ఆర్ అండ్ బి అతిథి గృహం, కళాభారతి ఆడిటోరియం, అంబేద్కర్ భవన్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తిచేయాలని తెలిపారు. గణేష్ నగర్ బైపాస్ రోడ్ లోని డ్రైనేజీ, స్మార్ట్ సిటీ రోడ్డు పనులను, అంబేద్కర్ స్టేడియం నుంచి కట్ట రాంపూర్ వెళ్లే రహదారి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్యాకేజీ 1, 2, 3 పనులను, డంపింగ్ యార్డ్ పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి తెలిపారు. నగరంలో డైరీ ఫామ్ దగ్గర రెండు ఎకరాల్లో, ఆర్టీసీ వర్క్ షాప్ దగ్గర రెండు ఎకరాల్లో కూరగాయల మార్కెట్ లను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. నగరం నడిబొడ్డులో ఉన్న మటన్, ఫిష్ మార్కెట్లను ఆధునీకరిస్తామని అన్నారు.

డ్యామ్ దగ్గర లేక్ పోలీస్ స్టేషన్ నుంచి రెండు కిలోమీటర్ల పొడవున నిర్మించతలపెట్టిన వాకింగ్ ట్రాక్ ను, సైకిల్ ట్రాక్ పను లను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ మొదటి డోసును 100 శాతం, రెండవ డోసును 86 శాతం పూర్తి చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచినందుకు అధికారులను మంత్రి అభినందించారు. ఒమిక్రాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు.

ఈ సమీక్షా సమావేశంలో నగర మేయర్ వై.సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, మున్సిపల్ కమిషనర్ ఇస్లావత్ నాయక్, డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ శ్రీనివాసరావు, ఆర్డీఓ ఆనంద్ కుమార్, మున్సిపల్ ఈఈ రామన్, డీసీపీ సుభాష్, సీపీఓ కొమురయ్య, స్మార్ట్ సిటీ కన్సల్టెన్సీ అధికారులు సందీప్, ఆర్ అండ్ బీ ఎస్ఈ నాయక్, పబ్లిక్ హెల్త్ ఈఈఈ సంపత్, కాంట్రాక్టర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

బాలల సత్వర సేవలకు బాల రక్షక్ వాహనం

జిల్లాలోని బాలలకు సత్వర సేవలు అందించేందుకు బాల రక్షక్ వాహనం అందుబాటులోకి వచ్చినట్లు రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో బాల రక్షక్ వాహనాన్ని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ తో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆపదలో ఉన్న పిల్లలను త్వరగా కాపాడడానికి ప్రభుత్వం బాల రక్షక్ వాహనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నవంబర్ 14న రాష్ట్రం మొత్తం 33 వాహనాలను సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అన్ని జిల్లాలకు కేటాయించారు అన్నారు.

ఆపదలో ఉన్న పిల్లలు ఎక్కడ కనపడినా హెల్ప్ లైన్ 1098 నెంబర్ కు ఫోన్ చేస్తే ఈ వాహనంలో సంబంధించిన అధికారులు వచ్చి పిల్లల రక్షణ మరియు సంరక్షణ చూసుకుంటారని అన్నారు. జిల్లాలోని బాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని అన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ వై.సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప హరిశంకర్, జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి, సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ ధనలక్ష్మి, డీసీపీఓ శాంత, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story