కరోనా హాట్‌స్పాట్‌గా కరీంనగర్

by Sridhar Babu |   ( Updated:2021-08-08 23:07:10.0  )
Karimnagar
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరీంనగర్ జిల్లా కరోనా హాట్ స్పాట్‌గా మారింది. గత 10 రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో జిల్లాలో పెరిగిన సభలు, సమావేశాలు వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నాయి. ఎన్నికలకు ముందే పరిస్థితి చేయిదాటేలా ఉందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితులను అదుపు చేసేందుకు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణలు చేపట్టి తగు సూచనలు చేస్తున్నారు.

జీహెచ్ఎంసీ తరువాత రాష్ట్రంలో అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం గత 10 రోజులుగా రోజు 65 మందికి వైరస్ సోకినట్టుగా ప్రకటిస్తున్నప్పటికి అనధికారికంగా రోజుకు 300 నుంచి 400 కేసులు నమోదవుతున్నట్టుగా స్థానిక వైద్యులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో 29 ఆక్టీవ్ మైక్రో కంటైన్‌మెంట్ జోన్లను ప్రభుత్వం గుర్తించగా వీటిలో అత్యధికంగా కరీంనగర్ జిల్లాలోనే 6 ఆక్టీవ్ మైక్రో కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయంటే జిల్లాలో వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో అంచనా వేయవచ్చు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు పేషెంట్లు బారులు తీరుతున్నారు. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రిలో చేరిన మూడు, నాలుగు రోజుల్లోనే పలువురు చనిపోయినట్టుగా తెలుస్తోంది.

హుజూరాబాద్ ఎన్నికలకు ముందే హెచ్చరికలు

హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందే కరీంనగర్ జిల్లాను ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. గతంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు కొనసాగుతున్న క్రమంలో వైరస్‌ను ఏ మాత్రం లెక్కచేయకుండా పెద్ద ఎత్తున సభలు సమావేశాలు, నిర్వహించారు. దీంతో సెకండ్ వేవ్‌లో నల్గొండ జిల్లా భారీ మూల్యాన్ని చెల్లించుకోవల్సి వచ్చింది. తిరిగి అలాంటి పరిస్థితులే కరీంనగర్ జిల్లాలో ఉత్పన్నమయ్యేలా కనిపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ఖరారు కాకముందే హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున పథకాలకు సంబంధించిన సభలు నిర్వహిస్తుండటం, ప్రతిపక్ష పార్టీ నాయకులు పాదయాత్రలు నిర్వహిస్తుండటంతో వైరస్ క్రమంగా విజృంభిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తే కరీంనగర్ జిల్లా కరోనాకు అడ్డాగా మారనుంది.

అధికారులకు సవాల్ మారిన కరీంనగర్

కరీంనగర్ జిల్లాలో కరోనాను కంట్రోల్ చేయడం వైద్యారోగ్య శాఖ అధికారులకు సవాల్‌గా మారింది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఇటీవల ప్రజారోగ్యశాఖ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు జమ్మికుంట ప్రభుత్వాసుపత్రిని పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మెడికల్ సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.

కొవిడ్ థర్డ్ వేవ్, డెల్టా వేరియంట్ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ ద్వారా కొవిడ్‌ను నియంత్రించాలని, ఒకరికి కొవిడ్ పాజిటివ్ వస్తే, వారికి సంబంధించి ప్రైమరీ కాంట్రాక్టు కింద 20 నుండి 25 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతిరోజు జిల్లాలో 8 నుండి 9 వేల కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఎక్కువ జన సమూహాలు ఉన్న చోట మొబైల్ బృందాల ద్వారా కొవిడ్ పరీక్షలు చేయించాలని అన్నారు.

Advertisement

Next Story