క‌రీంన‌గ‌ర్‌లో సీక్రెట్‌గా ఆ పౌడ‌ర్‌ను వాడేస్తున్నారు

by Anukaran |
క‌రీంన‌గ‌ర్‌లో సీక్రెట్‌గా ఆ పౌడ‌ర్‌ను వాడేస్తున్నారు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ పోలీసులు టాస్క్ వేసి పట్టుకున్న గన్ పౌడర్ వినియోగం వెనక అసలు వాస్తవాలు ఏంటీ? దొంగచాటుగా మందుగుండు తెప్పించుకోవడం ఎందుకు? క్వారీల్లో నిబంధనలు తుంగలో తొక్కుతున్నారా? గ్రానైట్ మాఫియా చేస్తున్న ఘోర తప్పిదాలేంటి అన్న చర్చ సాగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 250 వరకు గ్రానైట్ క్వారీలు నడుస్తున్నాయి. ఈ క్వారీల్లో నిబంధనలు తుంగలో తొక్కుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దొంగ చాటుగా ఎందుకో..?

గ్రానైట్ క్వారీల్లోని గుట్టల నుంచి రెండు రకాలుగా రా మెటీరియల్ సేకరిస్తారు. గ్యాంగ్ సా, కట్టర్ బ్లాక్‌గా రా మెటీరియల్‌ను సేకరిస్తున్న క్వారీల నిర్వాహకులు మందుగుండు వినియోగించాల్సి వస్తే సంబంధిత శాఖల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. పర్మీషన్ తీసుకున్న క్వారీల్లో మ్యాగ్జిన్ ఎక్స్‌పర్ట్స్‌తో మాత్రమే పేలుడు పదార్థాలు ఉపయోగించాల్సి ఉంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన మేరకు మందుగుండును ఉపయోగిస్తున్న క్వారీల యజమానులు దొంగచాటుగా గన్ పౌడర్ తెప్పించుకోవడం ఎందుకన్నది అంతుచిక్కడం లేదు. క్వారీల్లో పేలుడు పదార్థాల వినియోగం ఎంత మేర అవసరం ఉంటుందో నిపుణులు అంచనా వేసిన మేరకు ప్రభుత్వ శాఖలు అంతే క్వాంటిటీకి పర్మీషన్ ఇస్తున్నప్పుడు దర్జాగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అయితే సీక్రెట్‌గా పర్మీషన్ లేకుండా గన్ పౌడర్ తెప్పించుకోవడం వెనక ఏ రహస్యం దాగుందోనన్న చర్చ సాగుతోంది.

అందుకేనా..?

గ్రానైట్ క్వారీల్లో సేకరించే రా మెటిరియల్ సప్లై చేసే విషయంలో వే బిల్లులు రీసైకిల్ అవుతున్నాయని అరోపణలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం అనుమతి ఇచ్చిన మందుగుండు లీగల్‌గా జరిగే మెటీరియల్ సేకరించేందుకు సరిపోతుందని, గుట్టుగా తీసేందుకు ఉపయోగించేందుకే ఈ గన్ పౌడర్‌ను వినియోగిస్తున్నారా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. సీక్రెట్‌గా చేసే ఈ వ్యవహారంలో ప్రతి విషయంలో కూడా అధికారులకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే గుట్టు చప్పుడు కాకుండా గన్ పౌడర్ సరఫరా చేయించుకుంటున్నారని స్పష్టం అవుతోంది. వే బిల్లుల రీ సైక్లింగ్ వల్ల ప్రభుత్వానికి రూ. కోట్లలో రాయల్టీ కట్టకుండా దారి మల్లుతుందన్న విమర్శలు వస్తున్నాయి.

అనుమతి లేని క్వారీల్లో..

అలాగే పేలుడు పదార్థాలు వినియోగించేందుకు పర్మిషన్ తీసుకోని క్వారీల్లో కూడా మందుగుండును వాడుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పర్మిషన్ లేని క్వారీల్లో గన్ పౌడర్, డిటోనేటర్లు, జిలిటెన్లను వినియోగిస్తున్నారా మెటీరియల్ సేకరిస్తున్నారా అన్న విషయంపై అధికారులు దృష్టి సారించాల్సి ఉంది. పెద్ద ఎత్తున ఉన్న ఈ క్వారీల్లో ఏం జరుగుతుందో కూడా అంతుచిక్కని పరిస్థితి తయారైంది.

రాకెట్‌పై చెక్ పెడ్తారా?

గన్ పౌడర్‌తో పాటు ఇతరత్రా పేలుడు పదార్థాల అక్రమ రవాణా వ్యవహారం గుట్టును కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. అయితే ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరుపుతారా లేదా అన్నదే సంశయంగా మారింది. పోలీసుల దాడితో వెలుగులోకి వచ్చిన ఈ దందా వెనక పెద్ద రాకెట్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్‌లో ఈ పౌడర్ సరఫరా చేయడంతో పాటు, వినియోగించుందుకు కూడా స్పెషల్ టీంలు కూడా ఉన్నాయని సమాచారం. పూర్తి స్థాయిలో ఈ దందాపై ఆరా తీస్తే మరిన్ని ముఠాలు తతంగం కూడా బయటకు వస్తోంది.

Advertisement

Next Story