విజయసాయిరెడ్డీ.. అధికార మదంతో మాట్లాడొద్దు: కన్నా

by srinivas |
విజయసాయిరెడ్డీ.. అధికార మదంతో మాట్లాడొద్దు: కన్నా
X

విజయసాయిరెడ్డీ.. అధికార మదంతో మాట్లాడొద్దు అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ వైఎస్సార్సీపీ ఎంపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 20 కోట్లకు అమ్ముడుపోయారంటూ ట్విట్టర్ మాధ్యమంగా విజయసాయిరెడ్డి కన్నాపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కన్నా స్పందించారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, తనపై విజయసాయిరెడ్డి లేని పోని ఆరోపణలు చేశారన్నారు. జైలు నుంచి వచ్చిన వ్యక్తి తన గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్న ఆయన, తనపై విమర్శలు చేయడమంటే ఆకాశంపై ఉమ్మి వేయడమేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తనను కొన్నారని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు… తనను ఎవరూ కొనుగోలు చేసేవారు ఇంకా పుట్టలేదని అన్నారు. విజయ సాయిరెడ్డి మరోసారి ఇలా మాట్లాడితే మర్యాద ఉండదు జాగ్రత్త అంటూ హెచ్చరించారు.

అధికార మదంతో మాట్లాడొద్దని విజయసాయిరెడ్డికి హెచ్చరిస్తూ, ఆయన చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తానని వార్నింగ్ ఇచ్చారు. కరోనా పరీక్ష 1200 రూపాయలకే మెడ్‌టెక్‌లో చేస్తామని వైఎస్సార్సీపీ ప్రభుత్వం గతంలో చెప్పిందని గుర్తు చేసిన ఆయన… మెడ్‌టెక్ జోన్‌లో కిట్లు తయారు చేస్తే.. కొరియా నుంచి ఎందుకు తెప్పించారు? అని ప్రశ్నించారు. ఛత్తీస్‌గడ్ ఒక్కో ర్యాపిడ్ టెస్ట్ కిట్‌కు 337 రూపాయలకే కొంటే అవే కిట్లకు ఒక్కోదానికి 700 రూపాయల దాకా ఎందుకు ఖర్చు పెట్టారు? అని ఆయన నిలదీశారు. మీరే ఛత్తీస్‌గఢ్‌లోని కిట్లు దేశంలోనే తయారైనవని, ఫలితాలకు 30 నిమిషాలు పడుతుందని అంటున్నారు. ఏపీకి తెప్పించిన కొరియా కిట్ల ద్వారా 10 నిమిషాల్లోనే కచ్చితమైన ఫలితాలు వస్తాయంటున్నారు… అలాంటప్పుడు అవే కిట్లు తెప్పిస్తే తప్పేముందని ప్రశ్నించారు.

తాను నిజాలను చెబుతుంటే దుష్ప్రచారం చేసినట్టు ఎలా అవుతుంది? అని ఆయన అడిగారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు మీ పరిస్థితి ఉందని ఆయన విమర్శించారు. పర్చేజ్‌ ఆర్డర్‌ ప్రకారం ఒక్కో కిట్‌ రూ.730 ప్లస్‌ జీఎస్టీ అని మొదట చెప్పారని గుర్తు చేశారు. అయితే, ఆరోగ్య శాఖ కార్యదర్శి మాత్రం ఒక్కో కిట్‌ రూ.640 మాత్రమే అని చెబుతున్నారని, ఒక్కొక్కరు ఒక్కో ధర చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతుంటే.. తప్పుడు లెక్కలు చెబుతూ తగ్గిపోయిందని నిరూపించుకోవడానికి తాపత్రయపడుతున్నారని ఆయన విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్న తొందరలో రాష్ట్రాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారని ఆయన మండిపడ్డారు.

tags:kanna lakshminarayana, ap bjp, ysrcp, vijayasai reddy

Advertisement

Next Story