ఏపీ బీజేపీలో జోష్.. విజయమ్మపై గెలిచిన నేతకు కీలక పదవి

by srinivas |   ( Updated:2021-07-06 06:22:39.0  )
ఏపీ బీజేపీలో జోష్.. విజయమ్మపై గెలిచిన నేతకు కీలక పదవి
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో బీజేపీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబును గవర్నర్ పదవి వరించింది. మిజోరం గవర్నర్‌గా హరిబాబును నియమిస్తూ మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గెజిట్ విడుదల చేశారు. మెుత్తం 8 మందిని గవర్నర్లుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇకపోతే తెలంగాణకు చెందిన బండారు దత్తాత్రేయను హర్యానా గవర్నర్‌గా నియమించింది. దత్రాత్రేయ గతంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేశారు.

కంభంపాటి రాజకీయ ప్రస్థానం

కంభంపాటి హరిబాబు ప్రకాశం జిల్లాలోని తిమ్మసముద్రం గ్రామంలో జన్మించారు. విశాఖలోని ఏయూలో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్‌లో బీటెక్ చేసారు. అదే యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డీ సైతం పూర్తి చేశారు. అనంతరం ఏయూలోనే అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేసిన ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అనంతరం రాజకీయ అరంగేట్రం చేశారు. ఇకపోతే హరిబాబు విద్యార్థి దశలోనే జై ఆంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెన్నేటి విశ్వనాధం, సర్దార్ గౌతు లచ్చన్న, వెంకయ్యనాయుడులతో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1972లో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల యూనియన్‌కు సెక్రటరీగా పనిచేశారు.

1974లో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆధ్వర్యంలో జరిగిన లోక్‌ సంఘర్ష సమితి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ కాబడి 6 నెలలపాటు జైలు శిక్ష అనుభవించారు. 1977లో జనతాపార్టీలో ఏపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యునిగా సేవలందించారు. 1978లో జనతా యువమోర్చాకు రాష్ట్ర ఉఫాధ్యక్షుడిగా పనిచేశారు. 1991-1993 కాలంలో హరిబాబు బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా నియమితులయ్యారు. అనంతరం 1993-2003 మధ్య బీజేపీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. 1999లో విశాఖపట్నం-1 అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 2003లో శాసనసభలో బీజేపీ ప్లోర్‌లీడర్‌గా కొనసాగారు. అనంతరం 2014లో బీజేపీ అధిష్టానం ఆయనను ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. అనంతరం 2014 ఎన్నికల్లో విశాఖపట్నం లోకసభ నియోజకవర్గం నుండి టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మపై గెలుపొందారు.

Advertisement

Next Story

Most Viewed