డిస్కస్ త్రోలో రికార్డులు.. కమల్‌ప్రీత్ కౌర్ ప్రస్థానం ఇదే..!

by Shiva |
డిస్కస్ త్రోలో రికార్డులు.. కమల్‌ప్రీత్ కౌర్ ప్రస్థానం ఇదే..!
X

దిశ, స్పోర్ట్స్ : ఇంత వరకు ఏ భారతీయ అథ్లెట్ సాధించని రికార్డును కమల్‌ప్రీత్ కౌర్ సాధించింది. ఇటీవల పటియాలలో నిర్వహించిన ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 65.06 మీటర్ల దూరం డిస్కస్ త్రో చేసింది. భారత డిస్కస్ త్రో స్టార్ క్రిష్ణ పూనియా 2012లో 64.76 మీటర్లు విసిరింది. గత 9 ఏళ్లుగా ఆ రికార్డును ఎవరూ అధిగమించలేకపోయారు. కానీ తాజాగా యువ క్రీడాకారిణి కమల్‌ప్రీత్ కౌర్ ఆ జాతీయ రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా.. టోక్యో ఒలంపిక్స్‌కు అర్హత సాధించింది.

అథ్లెటిక్స్‌లో భారత క్రీడాకారులకు అంతర్జాతీయ వేదికలపై సరైన రికార్డులు లేవు. ఒలంపిక్స్ అథ్లెటిక్స్‌లో ఇండియా పతకం సాధించి 121 ఏళ్లు అవుతుంది. 1900వ సంవత్సరం పరుషుల 200 మీటర్లలో నోర్మాన్ ప్రిత్‌చార్డ్ వెండి పతకం సాధించాడు. ఆ తర్వాత ఒలంపిక్స్‌లో ఏ ఇండియన్ అథ్లెట్ కూడా పతకాలు సాధించలేదు. ఇప్పుడు డిస్కస్ త్రోలో కమల్‌ప్రీత్ కౌర్‌కు ఒలంపిక్ పతకం సాధించే సత్తా ఉన్నదని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

చదువులో వెనకబడి.. ఆటల్లో దూసుకెళ్లి..

పంజాబ్‌లోని శ్రీ ముక్త్సర్ సాహిబ్ జిల్లాలోని బాదల్ గ్రామానికి చెందిన కమల్‌ప్రీత్ చిన్నతనం నుంచే క్రీడలపై మక్కువ పెంచుకున్నది. చిన్నప్పుడు స్కూల్‌కు పంపిస్తే క్లాస్ రూమ్‌లో కంటే ఎక్కువగా మైదానంలో గడిపేది. చదువుల్లో వెనుకబడిన కమల్ ప్రీత్.. క్రీడలంటే మాత్రం చాలా ఇష్టంగా ఆడేది. స్కూల్‌లో ఉండే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కమల్ ప్రీత్‌లోని టాలెంట్‌ను గుర్తించాడు. అథ్లెటిక్స్‌ను కెరీర్‌గా మలుచుకోమని సలహా ఇచ్చాడు. 2012లో అథ్లెటిక్స్‌ను కెరీర్‌గా ఎంచుకొని సాధన మొదలు పెట్టింది. ఆ ఏడాది స్టేట్ మీట్‌లో నాలుగవ స్థానంలో నిలిచింది. దీంతో ఆమెకు సాయ్ నుంచి పిలుపు వచ్చింది.

2014లో తమ గ్రామంలో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సెంటర్‌లో చేరి అథ్లెటిక్స్ శిక్షణ ప్రారంభించింది. అక్కడ చేరిన కొన్నాళ్లకే మంచి ప్రదర్శన చేయడం మొదలు పెట్టింది. 2016లో అండర్-18, అండర్-20 నేషనల్ చాంపియన్‌గా అవతరించింది. 2017లో నిర్వహించిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో ఆరవ స్థానంలో నిలిచింది. 2019లో దోహాలో ఐదవ స్థానంతో సరిపెట్టుకుంది.

కరోనా సమయంలో కఠినమైన శ్రమ..

ఒలంపిక్ పతకమే లక్ష్యంగా పెట్టుకున్న కమల్‌ప్రీత్ అందుకోసం చాలా కష్టపడింది. పతకం కంటే ముందు అందుకు అర్హత సాధించడం ముఖ్యం. 2019లో ఆసియా అథ్లెటిక్ చాంపియన్‌షిప్ తర్వాత మరింత కఠిన శిక్షణ ప్రారంభించింది. అయితే ఇంతలోనే కరోనా కారణంగా క్రీడలన్నీ ఆగిపోయాయి. ఒలంపిక్స్ అర్హత పోటీలు కూడా వాయిదా పడ్డాయి.

ఆ సమయంలో ఇంటి వద్దనే ఉండిపోయిన కమల్‌ప్రీత్.. ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టింది. సాయ్ సెంటర్లు తిరిగి తెరుచుకున్న తర్వాత అథ్లెటిక్స్ శిక్షణ ప్రారంభించింది. ముఖ్యంగా డిస్కస్ త్రో ఈవెంట్‌లో తనకు ఉన్న సహజమైన టెక్నిక్ ఉపయోగించి ఎక్కువ దూరం విసిరేలా శిక్షణ తీసుకుంది. ఫెడరేషన్ కప్‌లో 65 మీటర్లు మించి విసరడంతో ఒక్క సారిగా అందరి దృష్టి కమల్ ప్రీత్‌పై పడింది.

2019 ఫెడరేషన్ కప్‌లో 60.25 మీటర్లు విసిరి స్వర్ణ పతకం గెలిచిన కమల్ ప్రీత్.. రెండేళ్లలోనే ఐదు మీటర్లు అదనంగా విసిరే సామర్థ్యాన్ని తెచ్చుకున్నది. ఇదంతా కఠినమైన శిక్షణ, శారీరిక శ్రమ కారణంగానే వచ్చిందని కోచ్‌లు చెబుతున్నారు. రైల్వేలో ఉద్యోగి అయిన కమల్ ప్రీత్.. జాతీయ క్రీడల్లో రైల్వేల తరపునే ఆడుతున్నది. సీమా పునియా తనకు ఆదర్శమని.. తన కోచ్ బల్జీత్ సింగ్ శిక్షణ ద్వారానే తాను రాటు తేలినట్లు కమల్ ప్రీత్ చెబుతున్నది. ఈ సారి ఒలంపిక్ పతకం సాధించడం తన లక్ష్యమని కమల్ అంటున్నది.

Advertisement

Next Story