తండ్రి అలా.. తనయుడిలా..

by Shamantha N |   ( Updated:2020-03-10 04:57:43.0  )
తండ్రి అలా.. తనయుడిలా..
X

దిశ, వెబ్‌డెస్క్: దివంగత నేత మాధవరావు సింధియా మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. ఓటమి ఎరుగని నేత. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. మాధవరావు మరణించేంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. మొదట జనసంఘ్ నుంచి గుణ లోక్‌సభ స్థానానికి పోటీ చేసి గెలిచిన ఆయన 1977 ఎమర్జెన్సీ తర్వాత అదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. 1984లో గ్వాలియర్ లోకసభ స్థానం నుంచి అప్పటి బీజేపీ నాయకుడు, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిపై కాంగ్రెస్ తరఫున గెలుపొందారు. మాధవరావు తనయుడు జ్యోతిరాదిత్య సింధియా కూడా తండ్రి బాటలోనే కాంగ్రెస్ పార్టీ పట్ల విధేయత కనబరిచేవారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. కానీ, మారిన రాజకీయ పరిస్థితులు, పరిణామాల దృష్ట్యా ఆయన మారిపోయారు. ఇవాళ (మంగళవారం) కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక ఆయన బీజేపీలో చేరడం లాంఛనమేనని ఆయన అనుచరులు అంటున్నారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ప్రధాని నరేంద్ర మోదీని ఆయన కలిశారు.

ఇద్దరూ కేంద్రమంత్రులుగా..

మాధవరావు, జ్యోతిరాదిత్య సింధియాలిద్దరూ కేంద్ర మంత్రులుగా పనిచేశారు. రాజీవ్ గాంధీ మంత్రి వర్గంలో మాధవరావు రైల్వే శాఖ మంత్రిగా, పి.వి.నరసింహారావు మంత్రివర్గంలో పౌరవిమానాయన శాఖ మంత్రిగా పనిచేశారు. మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో జ్యోతిరాదిత్య కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి (స్వతంత్ర హోదా)గా ఉన్నారు.

తండ్రి చేయలే.. కానీ, తనయుడు..

1996లో మాధవరావు సింధియాకూ కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేసే అవకాశం వచ్చింది. కానీ, ఆయన అలా చేయలేదు. కేంద్రంలో అర్జున్ సింగ్ ఇతర నాయకులు నేతృత్వంలో యూనైటెడ్ ఫ్రంట్‌కు ఆలోచనలు చేస్తున్న సమయంలో ఆయనకు ఫ్రంట్‌లో భాగస్వామ్యం కావాలని ఆహ్వానాలు వచ్చాయి. అప్పటికే మాధవరావు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చి మధ్యప్రదేశ్ వికాస్ కాంగ్రెస్ అనే పార్టీని స్థాపించారు. అందరూ ఆయన కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేస్తారనుకున్నారు. కానీ, ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. తన పార్టీని విలీనం చేసి.. కాంగ్రెస్ పార్టీకి విధేయుడినని నిరూపించుకున్నారు. ప్రస్తుత మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ గానూ వ్యవహరిస్తున్నారు. మొదట్లో ఈ పదవి(పీసీసీ చీఫ్) కోసం కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య మధ్య పోటీ ఉండేది. ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. మధ్యప్రదేశ్ నుంచి ముగ్గురు రాజ్యసభకు నామినేట్ అయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీలో బలాల దృష్ట్యా కాంగ్రెస్ 2, బీజేపీ నుంచి ఒక్కరు గెలిచే అవకాశం ఉంది. తనకు అవకాశం వస్తుందని జ్యోతిరాదిత్య సింధియా భావించారు. కానీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌నే అధిష్ఠానం ఖరారు చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో జ్యోతిరాదిత్య ఇక కాంగ్రెస్ పార్టీలో తనకు ప్రాధాన్యత ఉండదని భావించారో.. ఏమో తెలియదు కానీ, ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యం సొంత పార్టీపై తండ్రి తిరుగుబాటు చేయలేదు కానీ, తనయుడు ఆ పని చేశాడని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed