వలస కూలీలకు పాత్రికేయుని సాయం

by Aamani |
వలస కూలీలకు పాత్రికేయుని సాయం
X

దిశ, ఆదిలాబాద్: లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న 20 మంది మహారాష్ట్ర కూలీలకు ఓ జర్నలిస్టు అండగా నిలిచాడు. చేతిలో పని లేకపోవటంతో ఇంటికి బయలుదేరిన కూలీల ధీన స్థితిని గమనించి తన సొంత ఖర్చులతో వారి స్వగ్రామానికి పంపేలా ఏర్పాట్లు చేశాడు. వివరాల్లోకి వెళితే… కొండూరి రవీందర్ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓ దినపత్రికలో పాత్రికేయుడిగా పని చేస్తున్నాడు. నాందేడ్ జిల్లా కిన్వాట్ తాలూకా హిమాయత్ నగర్ ప్రాంతానికి చెందిన 15 మంది కూలీలు సహ ఐదురుగు పిల్లలు లాక్‌డౌన్ కారణంగా హైదరాబాద్‌లో చిక్కుకుపోయారు. తాము మహారాష్ట్రకు వెళ్లాలని చెప్పడంతో ఒక లారీలో వారిని మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా కేంద్రం సమీపంలో దింపారు. ఇది తమ ప్రాంతం కాదని గుర్తించి కరీంనగర్‌కు వచ్చారు. అక్కడి నుంచి మంచిర్యాల జిల్లా గూడెం గోదావరి నది వద్దకు చేరుకున్నారు. మూడు రోజులుగా నడుచుకుంటూ ఆదివారం సాయంత్రం నిర్మల్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న కొండాపూర్ గ్రామానికి వచ్చారు. అటుగా వెళ్తున్న రవీందర్‌ కనిపించటంతో గోడు వెళ్లబోసుకుని తమ స్వగ్రామానికి తీర్చాలని వేడుకున్నారు. దీంతో రవీందర్ తన సొంత ఖర్చులతో ప్రత్యేక వాహనాన్ని మాట్లాడి వారిని మహారాష్ట్రలోని హిమాయత్‌నగర్‌కు తీసుకువెళ్లేలా ఏర్పాటు చేశారు. కాగా రవీందర్‌ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అభినందించారు.

tags: Nirmal,Migrants,journalist,Maharashtra

Advertisement

Next Story