బీజేపీ నేతలకు అచ్చిరాని పదవి అదేనా?

by Anukaran |
బీజేపీ నేతలకు అచ్చిరాని పదవి అదేనా?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆ పోస్టుకు.. ఆ పదవికి అచ్చి రావడం లేదా? ముణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిన ఆ పదవికి అకారణంగా దూరమవుతున్నారా? అంటే అవుననే అనిపిస్తున్నాయి ఇటీవల ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న ఘటనలు. రాష్ట్రంలో తిరుగులేని పట్టు సాధించాలని నాయకులు తహతహలాడుతుంటే.. ఉమ్మడి జిల్లాలో ఎదురవుతున్న పరిణామాలు మాత్రం కమలనాథుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. హైదరాబాద్ మినహాయిస్తే తెలంగాణ మొత్తంలో బీజేపీని అక్కున చేర్చుకున్న చరిత్ర ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే దక్కుతుంది. అయితే నేడు ఇదే జిల్లాలో బీజేపీకి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నేతలు వివాదాల్లో ఇరుక్కుంటుండడం చర్చనీయాంశంగా మారింది.

బాస.. సోమారపు..

మూడు నెలల క్రితం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బాస సత్యనారాయణ వివాహేతర బంధానికి సంబంధించిన వీడియోలు లీకయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ విషయంపై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బాసను బాధ్యతల నుంచి తప్పించారు. అయితే తాజాగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ తనను బాధ్యతల నుండి తప్పించాలని కోరుతూ అధిష్ఠానానికి లేఖ రాశారు.

జనవరి 4న రాష్ట్ర నాయకత్వానికి లేఖ రాసినట్టు ఆయన మీడియా సమావేశంలో ప్రకటించారు. దీంతో మరోసారి ఉమ్మడి జిల్లా బీజేపీలో కలకలం రేపింది. మరో వైపు సోమారపు సత్యనారాయణ బీజేపీ నాయకుడితో మాట్లాడిన ఆడియో లీక్‌ కావడంతో చర్చ మరింత తీవ్రం అయింది. తనను బాధ్యతల్లోనే ఉండాలని రాష్ట్ర నాయకత్వం కోరినట్లు సోమారపు సత్యనారాయణ వెల్లడించారు. అయితే ఆయన ఆడియోలో బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ కారణమని చెప్పడంతో ఆయన ఆ పదవిలో కొనసాగిస్తున్నారా లేదా అన్న విషయంపై తర్జన భర్జనలు సాగుతున్నాయి.

మూడు నెలల్లోనే..

వివాదాల్లో ఇరుక్కున్న రెండు జిల్లాల బీజేపీ అధ్యక్షుల పేర్లు ఒకటే కావడం విశేషం. మూడు నెలల్లోనే బీజేపీలో ప్రధాన చర్చకు కేంద్ర బిందువుగా మారిన బీజేపీ జిల్లా అధ్యక్షుల ఇద్దరి పేర్లూ సత్యనారాయణ కావడం గమనార్హం. దీంతో ఉమ్మడి కరీంనగర్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షులుగా ఈ పేరుతో ఉన్న వారికి కలిసి రావడం లేదా అని కూడా చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed