దారుణంగా పడిపోయిన ఉద్యోగ కల్పన

by Anukaran |   ( Updated:2020-08-21 10:31:42.0  )
దారుణంగా పడిపోయిన ఉద్యోగ కల్పన
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో ఉద్యోగ కల్పన దారుణంగా పడిపోయినట్టు ఈపీఎఫ్‌వో (EPFO) గణాంకాలు వెల్లడించాయి. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో ఉద్యోగ కల్పన ఏకంగా 71.8 శాతం పడిపోగా, కేవలం 8,47,649 కొత్త ఉద్యోగాలు మాత్రమే కల్పించబడ్డాయి. అంతకుముందు ఇదే కాలంలో మొత్తం 30,02,975 ఉద్యోగాలు వచ్చాయి.

ఈపీఎఫ్‌వో గణాంకాల ప్రకారం ఏప్రిల్ నెలలో 20,164, మేలో 1.7 లక్షలు, జూన్‌లో 6.55 లక్షల ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. గతేడాది గణాంకాల ప్రకారం..ఏప్రిల్ నెలలో 9.2 లక్షలు, మేలో 8.57 లక్షలు, జూన్‌లో 12.24 లక్షలు సృష్టించబడ్డాయి. ముఖ్యంగా కొవిడ్-19 వ్యాప్తి వల్లనే కొత్త ఉద్యోగాల కల్పన దారుణంగా దెబ్బతిన్నట్టు ఈపీఎఫ్‌వో తెలిపింది. దీనివల్ల తక్కువ నగదుతో కొనసాగుతున్న సంస్థలు ఉద్యోగులను తొలగించడం, జీతాలను తగ్గించడం లాంటి చర్యలకు ఆశ్రయించక తప్పలేదు.

సీఎంఐఈ (CMIE) ప్రకారం..ఏప్రిల్, మే వరుస నెలల్లో నిరుద్యోగిత రేటు వరుసగా 23 శాతానికిపైగా నమోదైంది. జూన్ నుంచి సొంత ఊళ్లకు వెళ్లిన వారు తిరిగి వస్తుండటంతో ఉద్యోగ కల్పన పెరిగిందని ఈపీఎఫ్‌వో తెలిపింది. కాగా చాలామంది ఉద్యోగులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు, జీవనోపాధిని కొనసాగించడానికి తమ ఈపీఎఫ్ ఖాతాల నుంచి నగదును ఉపసంహరించడానికి నిర్ణయించుకున్నారు. లేబర్ మినిస్ట్రీ ప్రకారం.. కరోనా వైరస్, లాక్‌డౌన్ కాలంలో ఈపీఎఫ్‌వో 36.2 లక్షల క్లెయిమ్‌లను పరిష్కరించింది. ఈపీఎఫ్ పథకం కింద మొత్తం రూ. 11,540 కోట్లను పంపిణీ చేసింది.

Advertisement

Next Story