జియోలో కేకేఆర్ పెట్టుబడి విలువ రూ. 11,367 కోట్లు!

by Harish |
జియోలో కేకేఆర్ పెట్టుబడి విలువ రూ. 11,367 కోట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్‌లోకి మరో భారీ పెట్టుబడి రానున్న సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన ప్రముఖ ఈక్విటీ కంపెనీ కేకేఆర్‌.. జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడి పెట్టనున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్‌ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. కేకేఆర్ 2.32 శాతం ఈక్విటీని కొనుగోలు చేసేందుకు రూ.11,367 కోట్లతో ముందుకు వచ్చింది. కేకేఆర్ ఆసియాలోనే అతిపెద్ద పెట్టుబడి సంస్థ. గడిచిన నెలరోజుల్లో జియో ప్లాట్‌ఫామ్‌లో పలు అగ్రశ్రేణి కంపెనీల పెట్టుబడులతో మొత్తం పెట్టుబడుల విలువ రూ.78,562 కోట్లకు చేరుకుంది.

గత నెల రోజుల వ్యవధిలో జియో ప్లాట్‌ఫామ్‌లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. తొలుత ఫేస్‌బుక్ 9.99 శాతం వాటా కొనుగోలుతో రూ.43,574 కోట్ల ఒప్పందం జరిగింది. తర్వాత అమెరికా ప్రైవేటు ఈక్విటీ దిగ్గజం సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ 1 శాతం వాటాను రూ.5,655 కోట్లకు కొనుగోలు జరిపింది. అనంతరం విస్టా ఈక్విటీ 2.3 శాతం వాటాను రూ.11,367 కోట్లతో దక్కించుకుంది. ఇటీవల జనరల్ అట్లాంటిక్ పార్ట్‌నర్స్ రూ.6,598.38 కోట్ల పెట్టుబడితో 1.34 శాతం వాటాను చేజిక్కించుకుంది. తాజాగా కేకేఆర్ రూ.11,367 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చింది. ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా ఇండియాను నిర్మించాలనే తమ లక్ష్యంలో కేకేఆర్ భాగస్వామ్యమవుతోందని, ఇందులో భాగంగానే షేర్లను కొనుగోలు చేసిందని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు.

కేకేఆర్ సంస్థ 1976లో స్థాపించబడింది. ఈ సంస్థ టెక్ కంపెనీల్లో ఇప్పటివరకు 30 బిలియన్ డాలర్లను పెట్టుబడులు పెట్టింది. సంస్థ పోర్ట్‌పోలియోలో టెక్నాలజీ, మీడియా, టెలికం రంగాలకు చెందిన సుమారు 20 కంపెనీలు ఉన్నాయి. కేకేఆర్ 2006 నుంచి మన దేశంలో పెట్టుబడులు పెడుతోంది. ఈ కంపెనీకి ఇండియా వ్యూహాత్మక మార్కెట్‌గా భావిస్తోంది. ఈ సందర్భంగా కేకేఆర్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో హెన్రీ క్రావిస్ స్పందిస్తూ… ప్రపంచస్థాయి ఆవిష్కరణలు, బలమైన నాయకత్వ బృందంలో పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed