ఆపరేషన్ దుర్యోధన సీన్ రిపీట్.. శ్రీకాంత్ లెవల్‌లో జేసీ ప్రభాకర్ రెడ్డి క్లాస్

by srinivas |   ( Updated:2021-04-05 11:54:34.0  )
ఆపరేషన్ దుర్యోధన సీన్ రిపీట్.. శ్రీకాంత్ లెవల్‌లో జేసీ ప్రభాకర్ రెడ్డి క్లాస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎప్పుడూ వివాదాలతో వార్తల్లో ఉండే టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. మరోసారి కొత్త వివాదంతో మీడియాకెక్కారు. తాడిపత్రిలోని పలు వార్డుల్లో ప్రభాకర్ రెడ్డి గత కొద్దిరోజులుగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తాజాగా ఒక వార్డులో పర్యటించగా.. అక్కడి ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

రోడ్లు సరిగా లేవని, మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోందని ప్రజలు చెప్పారు. దుర్వాసనను భరింలేకపోతున్నామని, తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. దీంతో ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోయారు. ‘ఎన్నికల్లో ఓటుకు రూ.2 వేలు ఇచ్చా. అప్పుడు డబ్బులు తీసుకుని ఇప్పుడు పనులు చేయమని ఎలా అడుగుతారు?’ అంటూ చెలరేగిపోయారు. ఓటుకు డబ్బు తీసుకున్నవారికి పనులు చేయాలని అడిగే హక్కు ఉండదంటూ చెప్పారు.

డబ్బు తీసుకోకుండా ఓట్లు వేసి ఉంటే తాను పనులు చేసేవాడినని, తన చొక్కా పట్టుకుని నిలదీసే హక్కు మీకు ఉంటుందని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. డబ్బులు తీసుకుని ఓటు వేస్తారు కాబట్టే.. తాము పనులు చేయకపోయినా ధైర్యంగా తిరగగలుగుతున్నామని అన్నారు. దీంతో అక్కడ ఉన్న ప్రజలు జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలకు ఆశ్చర్యపోయారు.

కాగా, శ్రీకాంత్ హీరోగా పోసాని కృష్ణమురళి తెరకెక్కించిన ‘ఆపరేషన్ దుర్యోధన’ సినిమాలో తమ సమస్యలను చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలతో హీరో శ్రీకాంత్ ఇలాగే రెచ్చిపోతాడు. మీరు డబ్బులు తీసుకుని ఓట్లు వేసినప్పుడు మేము పనులు ఎందుకు చేయాలంటూ శ్రీకాంత్ చెప్తాడు. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మాాటలు ఆ సినిమాలోని శ్రీకాంత్ డైలాగ్‌లను గుర్తుకు తెస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed