జేసీ బ్రదర్స్ సంచలన నిర్ణయం.. వాటి కోసమే కలుస్తున్నామంటూ..

by srinivas |   ( Updated:2021-08-01 08:09:20.0  )
జేసీ బ్రదర్స్ సంచలన నిర్ణయం.. వాటి కోసమే కలుస్తున్నామంటూ..
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగొందిన జేసీ బ్రదర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాయలసీమ నీటి సమస్యల పరిష్కారానికి నడుంబిగించారు. రాయలసీమ నీటి విషయంలో పెద్ద ఎత్తున పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రాంతాలకు చెందిన కీలక నేతలను ఒక్కొక్కరుగా కలుస్తున్నారు. తాజాగా ఆదివారం మాజీమంత్రి, మాజీ ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిని కలిశారు. మడకశిర మండలం నీలకంఠాపురంలో రఘువీరారెడ్డితో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి భేటీ అయ్యారు. రఘువీరా కుటుంబ సభ్యులు నిర్మించిన నూతన ఆలయాలను రఘువీరారెడ్డితో కలిసి జేసీ ప్రభాకర్‌రెడ్డి సందర్శించారు. అనంతరం స్వామివారి పూజ, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అనంతరం ఆలయం మొత్తం తిరిగి నిర్మాణం, కట్టడాలను పరిశీలించారు. అనంతరం తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలు, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు, నీటి సమస్యలపై చర్చించారు. రాయలసీమకు సంబంధించిన జల సమస్యలను పరిష్కారం కోసం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జేసీ ప్రభాకర్‌రెడ్డి రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి పార్టీలతో సంబంధం లేకుండా అందర్నీ కలుస్తానని ప్రకటించారు.

జెండాలు, అజెండాలు పక్కనపెట్టి రాయలసీమను రత్నాల సీమగా మార్చేందుకు కృషి చేస్తానన్నారు. ఈ ఉద్యమంలో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఉద్యోగస్థులను భాగస్వామ్యం చేసి వారి సహకారంతో ముందుకు వెళ్తానని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంతా ఒక్క తాటిపైకి వచ్చి సీమ జలాల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. తన పోరాటానికి రఘువీరా మద్దతు లభిస్తోందని ఆశిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాల్లో శత్రువులు ఉంటారు.. మిత్రులు ఉంటారని.. అయితే భవిష్యత్ తరాల కోసమే తాము కలిశామనని జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story