రుయా ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్.. ప్రభుత్వానికి హెచ్చరిక

by Anukaran |
Pawan Kalyan
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారనే వార్త తనను తీవ్ర ఆవేదన కలిగించిందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ‘‘ఊపిరి అందించే వాయువుని సక్రమంగా అందించని దుస్థితి నెలకొనడం వల్లే అత్యంత విషాదకరమైన ఈ ఘటన చోటుచేసుకుంది. రాయలసీమ ప్రజల వైద్య అవసరాలకు కేంద్రమైన రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా, వైద్య పరమైన మౌలిక వసతులు సరిగా లేవని రోగులు ఎంతో ఆవేదన చెందుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని అందరూ చెబుతున్నారు. కర్నూలు, హిందూపురంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ రోగులు ఆక్సిజన్ అందక చనిపోయారు. అయినప్పటికీ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించుకోలేదు. ఇలాంటి విపత్కర సమయంలో విమర్శలు చేయకూడదని సంయమనం పాటిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించకుండా తక్షణమే పరిస్థితులను చక్కదిద్దాలి. రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి విషాదకర ఘటనలకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

Advertisement

Next Story