పోరుబాటకు సై.. జనం మధ్యకు జనసేనాని

by Anukaran |
Pavan kalyan
X

దిశ, ఏపీ బ్యూరో: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై పోరుబాటకు రెడీ అయ్యారు. ఇప్పటికే పలు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన జనసేనాని ఇటీవలే రోడ్లపై నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అది సక్సెస్ కావడం.. పరిషత్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడంతో దూకుడు పెంచాలని పవన్ నిర్ణయించారు. ఇందులో భాగంగా అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఏపీలోని రెండు ప్రాంతాల్లో శ్రమదానం చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. శ్రమదానం కార్యక్రమంలో భాగంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల్లో పవన్ పాల్గొంటారు. ఈ మేరకు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది.

అక్టోబర్ 2న రెండు జిల్లాల్లో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. అక్టోబరు 2న తొలుత ఉదయం 10 గంటలకు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద కాటన్ బ్యారేజిపై ఛిద్రమైన రోడ్డుకు మరమ్మతులు చేసే కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం అక్కడ నుంచి అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు అనంతపురం జిల్లా కొత్తచెరువు పంచాయతీ పరిధిలోని పుట్టపర్తి-ధర్మవరం రోడ్డు మరమ్మతు పనుల్లో పాల్గొంటారని ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో రహదారుల దుస్థితిపై జనసేన కొన్నాళ్లుగా పోరాడుతోంది. ప్రభుత్వం తాము విధించిన గడువులోగా స్పందించకపోతే స్వయంగా తానే రంగంలోకి దిగుతానని పవన్ కల్యాణ్ నిరసనకు పిలుపునిచ్చినప్పుడే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గాంధీ జయంతి నాడు ప్రతి నియోజకవర్గంలోనూ జనసేన శ్రేణులు రహదారుల మరమ్మతు కార్యక్రమాల్లో పాల్గొంటాయని పవన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

పవన్‌ను వ్యక్తిగతంగా విమర్శిస్తే సహించేది లేదు

పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని ఆ పార్టీ పీఏసీ సభ్యుడు పంతం నానాజీ అన్నారు. సినీ ఇండస్ట్రీలో జరిగే కష్టాల గురించి పవన్ కల్యాణ్ మాట్లాడితే అది తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. విజయవాడలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యం నడుస్తోందని విమర్శించారు. వైసీపీ మంత్రులు భాష, పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.

పవన్ కల్యాణ్‌ ఒక్కరినే సన్నాసి అని అన్నారని కానీ, రాష్ట్రంలో ఇంతమంది సన్నాసులున్నారని తమకు ఇప్పుడే తెలిసిందన్నారు. పవన్ కల్యాణ్ ఏమంత్రిని కూడా వ్యక్తిగతంగా దూషించలేదని.. విమర్శలు చేయలేదన్నారు. దుర్గమ్మ గుడి రథంపై ఉన్న సింహం బొమ్మను కొట్టేసిన సన్నాసి మంత్రి వెల్లంపల్లి అంటూ పంతం నానాజీ ఘాటుగా విమర్శించారు.

Advertisement

Next Story