పవన్ కల్యాణ్ మరో పోరాటం.. త్వరలో కీలక నిర్ణయం

by Anukaran |   ( Updated:2021-07-03 07:15:30.0  )
pawan kalyan news
X

దిశ, ఏపీ బ్యూరో: ఒకవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలతో బిజీబిజీగా గడిపిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గత కొంత కాలంగా ఇంటికే పరిమితమయ్యారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తర్వాత పవన్‌కు కరోనా సోకింది. దీంతో నెలరోజుల పాటు ఆయన విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత అధికమవ్వడంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌లు ప్రకటించాయి. తెలంగాణ రాష్ట్రం లాక్‌డౌన్ ప్రకటించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్ఫ్యూ విధించింది. దీంతో పవన్ కల్యాణ్ ఇంటి వద్దే ఉండాల్సి వచ్చింది. అటు రాజకీయాల్లో గానీ ఇటు సినీ షూటింగ్‌లలో ఎక్కడా కనిపించలేదు. కేవలం పేపర్ ప్రకటనలకే పరిమితమయ్యారు.

మూడేళ్లు రాజకీయాల్లో బిజీబిజీగా గడిపిన పవర్ స్టార్ ఆతర్వాత ‘వకీల్ సాబ్’ సినిమాతో వెండితెరపై దర్శనమిచ్చాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. సినిమాలు చేయాలని కుటుంబ సభ్యులు.. అటు అభిమానులు కోరడంతో పవన్ కల్యాణ్ మరో రెండు సినిమాలపై సైన్ చేశాడు. అందులో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ మూవీ ఒకటి. ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగానే పవన్ కల్యాణ్ మధ్యలో ఆపేసి తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో పాల్గొన్నారు. అనంతరం కరోనా సోకడంతో నెలరోజులపాటు ఇంటికే పరిమితమవ్వడం అందరికీ తెలిసిందే.

దాదాపు మూడు నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో జనసేన పార్టీ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. పవన్ కల్యాణ్ సైతం రాజకీయాలకు సంబంధించి ప్రకటనలు ఇవ్వడమే తప్ప బయటకువచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు. దీంతో జనసేన పార్టీ నాయకులు కాస్త నిరుత్సాహంగా ఉన్నారు. ఇన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న టీడీపీ సైతం ఇటీవలే యాక్టివ్ అయ్యింది. టీడీపీ అధినేత చంద్రబాబు సారథ్యంలో కరోనా బాధితులను ఆదుకోవాలని కోరుతూ సాధన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ కూడా పార్టీ తరపున దీక్షలు లేదా ప్రజల్లోకి వెళ్లాలని పలువురు సూచిస్తున్నారట. రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గకపోవడంతో ప్రజల మధ్యకు వెళ్తే ఇబ్బంది అని పవన్ కల్యాణ్ అన్నట్లు తెలుస్తోంది.

పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా అవినీతి చోటు చేసుకుందని, రైతుల బకాయిలు ఇవ్వకపోవడం, కరోనా బాధితులను ఆదుకోవడంలో వైఫల్యం, జల వివాదాలు వంటి అంశాలపై బహిరంగ పోరాటానికి సన్నద్ధం కావాలని పార్టీ కీలక నేతలు పవన్‌పై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ జూలై మూడోవారంలో పవన్ కల్యాణ్ ప్రజల మధ్యకు వెళ్తారని తెలుస్తోంది. చంద్రబాబు సాధన దీక్షలా దీక్షలు చేస్తారా లేక గతంలో రైతు సమస్యలపై జిల్లాల వారీగా పర్యటన చేసిన పవన్ కల్యాణ్ అదే తరహాలో రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై పోరడతారా అనేది తేలాల్సి ఉంది. ఈ వారంలో జనసేన పార్టీ ఓ నిర్ణయం తీసుకోనుున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story