టీఆర్ఎస్ నేత స్కెచ్: వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ బ‌రిలో జ‌న‌సేన‌

by Shyam |
Jana Sena party, GWMC, trs
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: తెలంగాణ రాజ‌కీయాల్లో క్రియాశీల‌క‌మ‌వుతామ‌ని ప్రక‌టించిన‌ జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆ దిశ‌గా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమ‌వుతోంది. తెలంగాణలో పార్టీ విస్తర‌ణే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్నారు. అయితే ఇప్పటివ‌ర‌కు తెలంగాణ‌లో జ‌రిగిన ఏ ఎన్నిక‌ల్లోనూ ఆ పార్టీ ప్రత్యక్షంగా పోటీ చేసింది లేదు. మ‌ద్దతు రాజ‌కీయాల‌తోనే స‌రిపెట్టింది. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికి పార్టీ బ‌లోపేతం కావాలంటే ఇప్పటి నుంచే ఎన్నిక‌ల్లో ఉనికి చాటుకోవాల‌ని ప‌వ‌న్‌పై తెలంగాణ‌కు చెందిన కొంత‌మంది నేత‌లు ఒత్తిడి తేవ‌డంతో వ‌రంగ‌ల్ కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో బ‌రిలో దిగేందుకు నిర్ణయించుకున్నారని పార్టీ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలోనే దాదాపు నెల‌క్రిత‌మే ఇందుకు సంబంధించిన ప్రణాళిక సిద్ధమై, పార్టీ కార్యాల‌యం కూడా తెరుచుకోవ‌డం విశేషం. వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో సాధ్యమైన‌న్నీ ఎక్కువ స్థానాల నుంచి పోటీ చేయాల‌ని ఆ పార్టీ నేత‌లు భావిస్తున్నారు.

జ‌న‌సేన వెనుక ఆ టీఆర్ ఎస్ నేత‌..

సొంత‌ పార్టీ బ‌లోపేతం కావాల‌ని ఆ పార్టీకి చెందిన నేత‌లు కోరుకోవ‌డంలో పెద్దగా ఆశ్చర్యం లేదు. కానీ జ‌న‌సేన బ‌లోపేతం కావాల‌ని టీఆర్ ఎస్‌లో చాలా కీల‌కంగా ఉంటున్న నేత కోరుకోవ‌డ‌మే ఇక్కడ ఆస‌క్తి క‌లిగిస్తోంది. గతంలో వ‌రంగ‌ల్ ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా నుంచి పీఆర్పీలో క్రియాశీల‌కంగా వ్యవ‌హ‌రించిన స‌ద‌రు నేత ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో కొన‌సాగుతున్నారు. అయితే పార్టీలో ఆయ‌న స్థానం, ప్రాధాన్యత, అప్రాధాన్యంగా మారింది. ఎమ్మెల్యేగా ఒక్కసారైనా గెల‌వాల‌నుకుంటున్న ఆ సీనియ‌ర్ నేత‌.. క‌ల నెర‌వేర్చుకునేందుకు అనేక రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లు వేస్తున్నా ఫ‌లించ‌డం లేదు. కొద్దిరోజుల క్రితం బీజేపీలోకి వెళ్లేందుకు విశ్వ ప్రయ‌త్నం చేశారు. రెండు మూడు రోజుల్లో చేరిక ఖాయం అనుకుంటున్న స‌మ‌యంలో అధిష్ఠానం నుంచి స‌రైన హామీ ల‌భించ‌లేద‌ని ఆగిపోయిన‌ట్లుగా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

వేవ్‌ను ప‌ట్టుకునేందుకే ప్రొత్సాహామ‌ట‌..

స్వత‌హాగా ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు వ‌రంగ‌ల్‌లో సినీ అభిమానులు ఎక్కువే. మెగా ఫ్యామిలీకి ప్యాకేజీగా అభిమానం ప్రక‌టించేవాళ్లు వేల సంఖ్యలోనే ఉన్నారు. రాజ‌కీయంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు స‌పోర్ట్ చేస్తారా లేదా అనే విషయం పక్కనబెడితే, వేవ్ ఎంత ఉన్నది అన్నది ఎన్నిక‌ల‌కు వ‌స్తేగాని తెలియ‌దు. ఈ వేవ్‌ను ప‌ట్టుకునేందుకు స‌ద‌రు నేత‌.. వ్యూహాత్మకంగా స్థానికంగా ఉన్న కొంత‌మంది ప‌వ‌న్ అభిమానుల‌ను, జ‌న‌సేన కార్యక‌ర్తల‌ను యాక్టివ్‌గా ముందుకు న‌డిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. వేవ్ ఉంద‌ని తెలిస్తే భ‌విష్యత్‌లో ఆ పార్టీకి వెళ్లాల‌నే వ్యూహంతో ఉన్నట్లుగా విశ్వస‌నీయంగా తెలిసింది. ఈ ప్లాన్‌తోనే స‌ద‌రు నేత‌ జ‌న‌సేన నాయ‌కుల‌కు ట‌చ్‌లో ఉన్నట్లు స‌మాచారం. మొత్తంగా 66 డివిజ‌న్లతో అవ‌త‌రించిన నూత‌న గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ కార్పోరేష‌న్ స‌మ‌రాంగంలో జ‌న‌సేన శంఖారావం పూరించ‌డం ఖాయమ‌ని తెలుస్తోంది. పోటీ చేసే స్థానాల‌పై ఇప్పటికే చ‌ర్చలు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఏడెనిమిది స్థానాల నుంచే పోటీ చేయాల‌ని, అభ్యర్థులు ఓట‌ర్లను ప్రభావితం చేసేలా ఉండాల‌నే ప్రాథ‌మిక నియ‌మాల‌తో క‌స‌ర‌త్తు జ‌రుగుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed