జలగం.. బలం తగ్గిందా.. తగ్గించారా..?

by Anukaran |
Jalgam Venkat Rao
X

దిశ ప్రతినిది, ఖమ్మం : జలగం.. ఈ పేరంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. దివంగత నేత, మాజీ సీఎం జలగం వెంగళరావు వారసత్వాన్ని పుణికి పుచ్చుకునన్న నేతగా ఆయన తనయుడు సైతం రాజకీయాలను ఒకప్పుడు ఏలాడు. కొత్తగూడేన్ని అభివృద్ధి బాట పట్టించిన నేతగా వెంకటరావుకు పేరుంది. ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యాడు. 2014లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఆ పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు.

మరి అలాంటి నేత 2018 ఎన్నికల్లో అతి స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నియోజకవర్గానికి దూరమయ్యాడనే విమర్శలు వస్తున్నాయి. మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను అభివృద్ధిలో ఉరుకులు పెట్టించిన నేత నిజంగానే తన నియోజకవర్గానకి దూరమయ్యారా..? లేక దూరం చేశారా..? పార్టీలోని కొందరు నేతలు పెద్దల సహకారంతో కావాలనే జలగం చరిష్మాకు గండికొడుతున్నారా..? వచ్చే ఎన్నికల్లో ఆయన పరిస్థితి ఏంటి..? అనే చర్చ ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా జోరుగా నడుస్తోంది.

అసలేం జరిగింది..?

2014లో జలగం టీఆర్ఎస్ తరఫున పోటీచేసి సమీప ప్రత్యర్థి కూనంనేని సాంబశివరావుపై విజయం సాధించారు. తర్వాత ఐదు సంవత్సరాలు కొత్తగూడేన్ని అభివృద్ధి బాటపట్టించారు. అనంతరం జరిగిన 2018 ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన వనమా వెంకటేశ్వరరావుపై స్వల్ప తేడాతో ఓడిపోయారు. వనమా అధికార పార్టీలో చేరడంతో నియోజకవర్గంలో జలగం ప్రాబల్యం తగ్గిస్తూ వచ్చారు. తన హయాంలో చేసిన అభివృద్ధిని ఏమాత్రం కనిపించకుండా చేయడానికి వనమా వర్గం ఇప్పటికీ కృషి చేస్తూనే ఉంది.

అంతేకాదు.. పార్టీలోని కొంతమంది పెద్దలు కావాలనే జలగాన్ని పక్కకు పెట్టించేలా చేశారనే ప్రచారం కూడా జరిగింది. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా వెంకటరావు మనుషులకు కాకుండా వనమా వర్గానికి చెందిన నేతలకే పూర్తిగా టికెట్లు కేటాయించడం, అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానం అందించకపోవం వల్ల కొంతకాలం వెంకటరావు సైతం దూరంగానే ఉన్నారు. ఇప్పుడు కొత్తగూడెం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ వనమా, జలగం వర్గాల మధ్య విభేదాలు నడుస్తున్నాయి.

అధిష్టానం లైట్ తీసుకుందా..?

వాస్తవానికి జలగం వెంకటరావుకు తన తండ్రిలాగే మంచి పేరుంది. అయితే ఆయన ఓడిపోయాన నియోజకవర్గంతో పాటు జిల్లా్వ్యాప్తంగా మంచి పట్టు సాధించారు. ఆయన అనుచరగణం కూడా బాగానే ఉంది. ఈ క్రమంలో పార్టీలోని కొందరు జలగాన్ని పూర్తిగా పక్కకు తప్పించాలనే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అధిష్టానానికి కూడా ఫిర్యాదులు చేయడం మొదలు పెట్టారు. భవిష్యత్ లో మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే తమకు ఇబ్బందులు తప్పవనుకున్న ప్రత్యర్థి పార్టీలు సైతం ఏకమై గులాబీ పెద్దలతో మంతనాలు జరిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అధిష్టానం కూడా జలగాన్ని లైట్ తీసుకున్నట్లు వనమా వర్గం నాయకులు ప్రచారం చేయడం గమనార్హం.

ఈ అభివృద్ధి ఎవరిది..?

జలగం వెంకటరావు గెలిచిన తర్వాత వాస్తవానికి కొత్తగూడేన్ని చాలా డెవలప్ చేశారనే పేరుంది. జిల్లాగా ఏర్పడ్డ భద్రాద్రి కొత్తగూడేన్ని టూరిజం హబ్ గా మార్చడంలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ పార్క్ ఏర్పాటు నిజంగా ఓ వరమే అని చెప్పాలి. అలసిసొలసిన ప్రజలకు సెంట్రల్ పార్క్ ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుంది. ఇక కిన్నెరసాని అభివృద్ధికి కూడా జలం ఎంతో కృషి చేశారు. కొత్తగూడెం వాసులు ఎన్నో ఏళ్ల కల కొత్తగూడెం టు కొల్షాపూర్ రైలు లైన్ లో కూడా వెంకటరావు కృషి ఉంది.

ముఖ్యంగా భద్రాద్రి జిల్లాకు ఎయిర్ పోర్టు అనేది జలగం హయాంలోనే పురుడుపోసుకుంది. విమానాశ్రయం ఏర్పాటుకు ఆయన ఎంతో కృషిచేసిన విషయం జిల్లా ప్రజలందరికీ తెలిసిందే. కొత్తగూడెం జిల్లా కేంద్రంగా ఏర్పాటయ్యాక అన్ని రకాల కార్యాలయాలు నిర్మాణంలో ఏమాత్రం జాప్యం లేకుండ చేయడంలో వెంకట్రావుదే ప్రముఖ పాత్ర. ప్రగతి మైదానాన్ని ఏర్పాటు చేసిన ఘనత కూడా ఆయనదే. అలాంటి నేత ఇప్పుడు నియోజకవర్గానికి దూరమవడం హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

Next Story