పుట్టిన ఊరుకు చేయూత.. ఆ గ్రామానికి వారే మహర్షిలు

by Shyam |   ( Updated:2021-12-23 05:18:11.0  )
పుట్టిన ఊరుకు చేయూత.. ఆ గ్రామానికి వారే మహర్షిలు
X

దిశ, అచ్చంపేట : ఆర్థికంగా ఎదిగిన వారు పుట్టిన ఊరు‌ను కన్న తల్లిదండ్రులను చిన్నచూపు చూస్తున్న సందర్భాలు మన కళ్ల ముందు కోకొల్లలుగా కనిపిస్తుంటాయి. కానీ అందుకు భిన్నంగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం, మాచవరం గ్రామంలో బాల్యములో అడుగులేసి, అందరితో కలిసిమెలిసి, ఇక్కడే అక్షరాభ్యాసాలు నేర్చుకుని, స్వతహాగా వారు కష్టపడుతూ ఆర్థికంగా కాస్త మెరుగుపడ్డారు జలం‌ధర్ రెడ్డి బ్రదర్స్. వీరిది నల్లమల ప్రాంతంలో మాచారంలోని ఓ చిన్న గ్రామం. వారి కష్టార్జితం గా వచ్చిన సంపాదనలో నుంచి మా వంతుగా గ్రామానికి సహాయం చేస్తామని అనేక సందర్భాలలో ముందుకు వస్తూ అందరి మన్ననలను గ్రామస్తుల దీవెనలు పొందుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. మాచవరం గ్రామంలో కౌసల్య నారాయణ రెడ్డి పుణ్య దంపతులకు ముగ్గురు కుమారులు ముగ్గురు కూతుళ్లు సంతానం. దంపతులు కష్టపడుతూ వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగించారు. జలంధర్ రెడ్డి ఏవన్ సివిల్ కాంట్రాక్టర్ గా కొనసాగుతూ మిగతా ఇద్దరు బ్రదర్స్ వివిధ రంగాలలో స్థిరపడ్డారు.

పుట్టి పెరిగిన ఊరుకు ఏదో చేయాలని..

పుట్టి పెరిగిన ఊరుకు ఏదో చేయాలని జలంధర్ రెడ్డి బ్రదర్స్ నిత్యం పరితపిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే గత రెండు సంవత్సరాల క్రితం గ్రామంలోని అక్షరాభ్యాసాలు నేర్చిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సొంత ఖర్చులతో సుమారు 15 లక్షలు పైచిలుకు ఖర్చు చేసి పాఠశాల మరమ్మతుల చర్యలు చేపట్టారు. అలాగే ఇతరులు కూడా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ చేదోడువాదోడుగా వారి వంతు సహకారం అందిస్తూనే ఉన్నారు.

కిలోమీటర్ డబల్ రోడ్డు..

గ్రామంలో రహదారి వ్యవస్థ బాగలేదని గ్రామ సర్పంచ్ , పెద్దలు జలంధర్ రెడ్డి బ్రదర్స్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు సానుకూలంగా స్పందిస్తూ గత రెండు రోజుల క్రితం ప్రధాన రహదారి అంబేద్కర్ విగ్రహం నుంచి గ్రామంలోని చెరువు వరకు డబల్ రోడ్డును సొంత ఖర్చులతో నిర్మిస్తామని హామీ ఇచ్చి తక్షణమే పనులు ప్రారంభించారు. ఇలా అనేక విధాలుగా తన పుట్టి పెరిగిన ఊరుకు జలంధర్ రెడ్డి బ్రదర్స్ గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారు.

గ్రామస్తుల హర్షం..

మాచారం గ్రామానికి చెందిన జలంధర్ రెడ్డి కుటుంబాన్ని గ్రామస్తులు అభినందిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పెరుమాళ్ళ చెన్నకేశవులు జలంధర్ రెడ్డి బ్రదర్స్ కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారికి ఉన్న దాంట్లో గ్రామ అభివృద్ధికి సహకారం చేయడం హర్షించదగ్గ విషయమని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సర్పంచ్ పెద్ది రాజు..

జలంధర్ రెడ్డి బ్రదర్స్ మా గ్రామానికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తారని గ్రామస్తులు అందరి తరపున వారి కుటుంబానికి సర్పంచ్ పెద్ది రాజు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామానికి ఇలాంటి వారు ఎవరో ఒకరు సహాయ సహకారాలు అందిస్తే ఏ గ్రామమైన మరింత అభివృద్ధి బాటలో కొనసాగుతుందని, నా హయాంలో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి, గ్రామంలో డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు.

Advertisement

Next Story