మిషన్ భగీరధ చాలా రాష్ట్రాలకు ఆదర్శం: జల్ జీవన్ మిషన్ డైరెక్టర్

by Shyam |
మిషన్ భగీరధ చాలా రాష్ట్రాలకు ఆదర్శం: జల్ జీవన్ మిషన్ డైరెక్టర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అనేక రాష్ట్రాలు ఇప్పుడు ప్రతీ ఇంటికీ రక్షిత త్రాగునీటిని అందిస్తున్నాయని, వాటికి ప్రేరణ తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ‘మిషన్ భగీరధ’ పథకమేనని కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ డైరెక్టర్ అజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎన్నో రాష్ట్రాలకు మిషన్ భగీరధ ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ఈ పథకం తీరును పరిశీలించడానికి నగరానికి వచ్చిన ఆయన, పలువురు అధికారుల బృందం ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరధ కార్యాలయంలో ఉన్నతాధికారులతో భేటీ అయింది. ప్రతీ ఇంటికీ నల్లా ద్వారా శుద్ధీకరణ చేసిన నీరు ఏ విధంగా సరఫరా అవుతూ ఉందో ఇంజనీర్-ఇన్-ఛీఫ్ కృపాకర్ రెడ్డితో పాటు పలువురు అధికారులను అడిగి తెలుసుకుంది.

ఈ సమావేశం అనంతరం అజయ్ కుమార్ రాష్ట్ర అధికారులతో మాట్లాడుతూ, త్రాగునీటి రంగంలో శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయడం విప్లవాత్మకమైన నిర్ణయమని, అనేక అనారోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. అనేక గ్రామాలకు పైప్ లైన్ ద్వారా అందించడం వెనక కృషి గొప్పదని ప్రశంసించారు. అధికారుల నుంచి అందిన వివరాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో అమలుతీరును అధ్యయనం చేయడానికి జల్ జీవన్ మిషన్ అధికారులు రెండు బృందాలుగా విడిపోయి సూర్యాపేట, ఖమ్మం, భద్రాచలం, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కొన్ని గ్రామాలకు వెళ్ళారు. ఈ పర్యటన తర్వాత కేంద్రానికి నివేదిక సమర్పించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed