కరోనాతో అడిషనల్ ఎస్పీ మృతి

by Shyam |   ( Updated:2020-08-25 23:12:43.0  )
కరోనాతో అడిషనల్ ఎస్పీ మృతి
X

దిశ, జగిత్యాల: జగిత్యాల జిల్లా పోలీసు శాఖలో విషాదం నెలకొంది. జిల్లా అడిషనల్ ఎస్పీగా పని చేస్తున్న దక్షిణ మూర్తి బుధవారం తెల్లవారు జామున కరోనా సోకి మృత్యువాతపడ్డారు. వారం రోజులుగా కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1989 బ్యాచ్ కు చెందిన దక్షిణ మూర్తి వరంగల్ జిల్లాలో ఎస్సై, సీఐ, డీఎస్పీగా పనిచేశారు. నక్సల్స్ ఆపరేషన్స్ తో పాటు వరంగల్ లో సంచలనం కల్గించిన యాసిడ్ దాడి కేసులో నిందితుల ఎన్ కౌంటర్ లో కూడా ఆయన పాల్గొన్నారు. కరీంనగర్ సవారాన్ స్ట్రీట్ కు చెందిన దక్షిణ మూర్తి జిల్లాల పునర్విభజనతో జగిత్యాల అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఇటీవల జిల్లాలో కరోనా సోకి అనారోగ్యం పాలైన పోలీసులు చికిత్స పొంది విధుల్లో చేరినప్పుడు వారికి ఘన స్వాగతం పలికి పోలీసుల్లో మనో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అసాంఘీక కార్యకలాపాల కట్టడిలో కఠినంగా వ్యవహరిస్తారని పోలుస్ విభాగంలో ఆయనకు గుర్తింపు ఉంది. కరోనా మహమ్మారి ఆయనను బలి తీసుకోవడంతో జిల్లా పోలీసు శాఖలో విషాదం నెలకొంది.

Advertisement

Next Story