కోవిడ్ సోకిన చిన్నారులకు ఐవీఐ ఇంజక్షన్లు

by Shyam |
corona
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా మూడో ముప్పు సమీపంలోనే ఉందని వివిధ సర్వే సంస్థలతో పాటు జాతీయ విపత్తుల సంస్థ కూడా హెచ్చరించడంతో దాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమవుతున్నది. ముఖ్యంగా థర్డ్ వేవ్ ప్రభావం చిన్నారులపై ఉంటుందనే అంచనాతో వైద్యారోగ్యవాఖ ఆ దిశగా ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నది. చిన్నారులకు వైద్యం అందించేందుకు పీడియాట్రిక్ డాక్టర్లతో పాటు మౌలిక వసతులు, మందులను కూడా సమకూర్చుతున్నది. దీనిలో భాగంగా కోవిడ్ సోకిన చిన్నారులకు ఐవీఐజీ(ఇంట్రావీనస్ ఇమ్యూనోగ్లోబిన్ ఇంజక్షన్లను) లను ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే గాంధీ, నిలోఫర్ ఆసుపత్రుల్లో 3 వేల ఇంజక్షన్లను సిద్ధం చేయగా, మరో 10 వేల వయల్స్ కు ఆర్డర్ పెట్టినట్లు టీఎస్ఎంఎస్ఐడీసీ(తెలంగాణ స్టేట్ మెడికల్ ఇన్‌ఫ్రా‌స్ట్ర‌క్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) అధికారులు వెల్లడించారు. వారానికి వెయ్యి చొప్పున వీటిని ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నేరుగా కొనుగోలు చేయనున్నట్లు వైద్యారోగ్యశాఖ చెబుతోంది.

దేశంలో నాలుగు ఉండగా, హైదరాబాద్ లోనే మూడు…

ఈ ఇంజక్షన్లను తయారు చేసే కంపెనీలు దేశ వ్యాప్తంగా నాలుగు ఉండగా, వీటిలో మూడు హైదరాబాద్ లోనే ఉండటం గమనార్హం. దీంతో మన రాష్ర్టానికి అవసరమయ్యే ఇంజక్షన్లను వేగంగా సేకరించవచ్చని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. వాస్తవానికి దీన్ని ప్లాస్మా ఆధారంగా తయారు చేస్తారు. ప్లాస్మా లభ్యతను బట్టి వీటి తయారి ఉంటుంది. దీంతోనే ఇవి పరిమిత సంఖ్యలో ఉత్పత్తి అవుతాయి.

దీన్ని ఎప్పుడు ఇస్తారు?

చిన్నారులకు కోవిడ్ సోకిన రెండు వారాల తర్వాత ఈ ఇంజక్షన్ ను ఇస్తారు. దీన్ని 5 నుంచి 12 లోపు వయస్సు పిల్లలకు మాత్రమే ఇవ్సాల్సి ఉంటుంది. అయితే కరోనా వైరస్ ప్రభావం హార్డ్, కిడ్నీ, లివర్ వంటి ఆర్గన్ల(ఎంఐఎస్-సీ ప్రాబ్లామ్ ) మీద పడితే ఈ ఇంజక్షన్ ను ఇవ్వనున్నారు. దీంతో ఆ అవయవాలు క్షీణించకుండా ఉండేందుకు మేలు జరుగుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం చిన్నారులకు ప్రత్యేక మెడికేషన్ లేనందున దీన్ని వినియోగిస్తే వేగంగా కోలుకుంటారని డాక్టర్లు వివరిస్తున్నారు. కానీ ఈ ఇంజక్షన్లు సీరియస్ పరిస్థితుల్లో ఉన్న వారికి మాత్రమే ఇవ్వనున్నారు. అంతేగాక షుగర్, ఆస్తమా సమస్యలున్నోళ్లపైన దీని ప్రభావం మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. అయితే దీన్ని చిన్నారుల బరువు, ఆరోగ్య పరిస్థితిని బట్టి అందించనున్నారు. ఇవి కూడా కాక్ టెయిల్ ఇంజక్షన్లు వలే పనిచేస్తాయని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. వీటిని ప్రస్తుతానికి నిలోఫర్, గాంధీలో అందుబాటులో ఉంచామని, రాబోయే రోజుల్లో అన్ని జిల్లా ఆసుపత్రుల్లో సిద్దం చేయనున్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

70 శాతం చిన్నారులకు అడ్మిట్ అవసరం లేదు: డా. కిరణ్ మాదాల

కొవిడ్ సోకిన చిన్నారుల్లో 70 శాతం మంది ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే కోలుకుంటారు. రెగ్యులర్ గా కరోనా ట్రీట్మెంట్ కు వినియోగించే మెడిసిన్స్ తో వైరస్ కంట్రోల్ లోకి వస్తుంది. కానీ హార్ట్ , కిడ్నీ, శ్వాస సమస్యలున్నోళ్లు ఐవీఐజీ తీసుకుంటే బెటర్ . అయితే థర్డ్ వేవ్ కేవలం చిన్నారులపై ప్రభావం చూపుతుందనడంలో అర్ధం లేదు. పెద్దలు వ్యాక్సిన్ తీసుకున్నారు కాబట్టి చిన్నారుల పై ప్రభావం కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. అంతేగాక డెల్టా కాకుండా కొత్త వేరియంట్ పుడితే తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉందని పలు ఇంటర్నేషనల్ రీసెర్చ్ లు స్పష్టం చేస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed