అది ఒమిక్రాన్‌ మందు కాదు.. రోగనిరోధక శక్తి పెంచేది : ఆనందయ్య షాకింగ్ కామెంట్స్

by srinivas |   ( Updated:2021-12-29 02:59:38.0  )
అది ఒమిక్రాన్‌ మందు కాదు.. రోగనిరోధక శక్తి పెంచేది : ఆనందయ్య షాకింగ్ కామెంట్స్
X

దిశ, ఏపీ బ్యూరో: అనుమతులు లేకుండా ఒమిక్రాన్‌కు ఆయుర్వేద మందు పంపిణీ చేస్తున్నానంటూ వస్తున్న వార్తలపై ఆనందయ్య స్పందించారు. తాను ఒమిక్రాన్‌కు మందు పంపిణీ చేయడం లేదని చెప్పుకొచ్చారు. ఒమిక్రాన్‌ను అరికట్టేందుకు మందు పంపిణీ చేస్తున్నానని ఏనాడూ చెప్పలేదని చెప్పుకొచ్చారు. తాను కేవలం రోగ నిరోధక శక్తి పెంచే మందు మాత్రమే ఇస్తున్నట్లు వివరణ ఇచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇప్పటికే పంపిణీ చేస్తున్న మందును సైతం నిలిపివేసినట్లు పేర్కొన్నారు. మందు పంపిణీకి సంబంధించి జేసీ ఇచ్చిన నోటీసులకు త్వరలోనే వివరణ ఇస్తానని ఆనందయ్య స్పష్టం చేశారు. ఇకపోతే కరోనా సెకండ్ వేవ్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇలాంటి తరుణంలో కరోనాను ఖతం చేసే మందులు తన దగ్గర ఉందంటూ తెరపైకి వచ్చారు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య.

కరోనా వైరస్ అరికట్టేందుకు తన వద్ద ఆయుర్వేద మందు ఉందని ప్రకటించిన తర్వాత ఆయన లీగల్ ఇష్యూలు సైతం ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరకు అన్ని సమస్యలు తొలగడంతో కరోనా వైరస్ మందు పంపిణీ చేపట్టారు. దీంతో ఆనందయ్య ఒక ఆపద్భాంధువుడిగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా వైరస్ వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్‌ను 48 గంటల్లో నివారించే ఆయుర్వేద మందు తన దగ్గర ఉందంటూ ఆనందయ్య ప్రచారం చేశారు. ఆయుర్వేద మెడిసిన్ కావాలనుకునేవారు తనను సంప్రదించాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.

అయితే కరోనా వైరస్‌ సెకండ్ వేవ్‌లో మందు పంపిణీకి సహకరించిన గ్రామస్థులు ఈసారి తిరుగుబాటు ఎగురవేశారు. మందు పంపిణీ చేయకూడ‌ద‌ని కృష్ణపట్నం వాసులు ఆనందయ్య ఇంటి దగ్గర నిరసనకు దిగారు. అంబులెన్స్‌లలో, బైక్‌లలో రోగులు పెద్ద ఎత్తున గ్రామంలోకి రావడంతో జనసంచారం పెరిగి తమకు కూడా కరోనా సోకుతుందని వారు ఆరోపిస్తున్నారు. గతంలోనే ఈ మహమ్మారి వల్ల చాలామందిని కోల్పోవాల్సి వచ్చిందని వారు ఆరోపించారు. అంతేకాదు గ్రామ పంచాయతీ సైతం ఆకస్మాత్తుగా అత్యవసర సమావేశం నిర్వహించింది. ఆనందయ్య ఒమిక్రాన్ మందు పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. అనుమతి లేకుండా ఆనందయ్య ఒమిక్రాన్‌కు మందు పంపిణీ చేయోద్దని తీర్మాణం చేసింది.

జేసీ నోటీసులు

కృష్ణపట్నంలో నెలకొన్న గందరగోళ పరిస్థితి ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఆనందయ్యకు జిల్లా జాయింట్ కలెక్టర్ గణేశ్‌ కుమార్ నోటీసులు జారీ చేశారు. ఒమిక్రాన్ కు ఆనందయ్య మందు అని వచ్చిన ప్రకటనపై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. అంతేకాదు ఒమిక్రాన్ కు ఆ మందు పంపిణీ చేసేందుకు ఏయే అనుమతులు తీసుకున్నారో సమాధానం ఇవ్వాలని నోటీసులో స్పష్టం చేశారు. ఒక‌వేళ‌ అనుమతులు లేకుండా మందు పంపిణీ చేస్తున్న‌ట్ల‌యితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చ‌రించారు. ఈ నోటీసులకు వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలని జేసీ ఆదేశించారు.

పంచాయతీ తీర్మానం దురదృష్టకరం : ఆనందయ్య

జేసీ నోటీసులపై మీడియా సాక్షిగా ఆనందయ్య స్పందించారు. తాను ఒమిక్రాన్‌ కోసం మందు త‌యారు చేశాన‌ని ఎక్క‌డా చెప్పలేదని వెల్లడించారు. తన మందు ఏ వ్యాధికైనా రోగ‌నిరోధ‌క‌త‌ను పెంచుతుందని, ఆ విష‌యాన్నే ఇప్పటికీ చెబుతున్నట్లు తెలిపారు. త‌న‌కు జాయింట్‌ కలెక్టర్ నుంచి అందిన‌ నోటీసుల‌కు పూర్తి వివరాలతో సమాధానం ఇస్తానని తెలిపారు. ఈ మందును తాను ఉచితంగానే ప్ర‌జ‌ల‌కు ఇస్తున్నానని చెప్పుకొచ్చారు. అయితే ఈ మందు ఇస్తున్నందుకు త‌న‌కు వ్య‌తిరేకంగా త‌మ‌ గ్రామ పంచాయతీలో తీర్మానం చేయడం దురదృష్టకరమన్నారు. ఇప్ప‌టికే అధికారుల ఆదేశాలతో తాను ఆ మందు పంపిణీని నిలిపివేసినట్లు ఆనందయ్య చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed