భారత్ లోని ఆ రంగంలోకి వస్తాం.. ఇటాలియన్ సంస్థ

by Harish |
enel
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఇటాలియన్ విద్యుత్ పంపిణీ సంస్థ ఎనెల్ గ్రూప్ భారత్‌లో విద్యుత్ పంపిణీ విభాగంలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించింది. దేశీయంగా విద్యుత్ రంగంలో ఇటీవల పెరుగుతున్న సంస్కరణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. తాజాగా, ఎనెల్ గ్రూప్ సీఈఓ ఫ్రాన్సిస్కో స్టారెస్ ఈ అంశంపై మాట్లాడుతూ.. భారత్‌లో విద్యుత్ పంపిణీ కోసం ప్రైవేట్ యాజమాన్యానికి అవకాశం లభించిందన్నారు. అయితే, ఎనెల్ గ్రూప్ సంస్థ భారత్‌లో ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. కొత్తగా ఇప్పుడు ఉత్పత్తి తర్వాతి దశ పంపిణీని కూడా చేపట్టాలని భావిస్తోంది. రానున్న రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో తలసరి విద్యుత్ వినియోగం పెరుగుతుందని ఆశిస్తున్నట్టు స్టారెస్ పేర్కొన్నారు.

సాధారణంగా విద్యుత్‌ రంగంలో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఉన్నప్పటికీ విద్యుత్‌ పంపిణీ వ్యవహారాలన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహిస్తాయి. ఈ ఏడాది ఆగష్టులో విద్యుత్ మంత్రిత్వ శాఖ విద్యుత్ సవరణ బిల్లు-2021ని తీసుకొచ్చింది. ఈ బిల్లు ద్వారా విద్యుత్‌ రంగంలోకి ప్రైవేటు సంస్థల ప్రవేశం పెరగనుంది. ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం.. ఈ సవరణ బిల్లుతో విద్యుత్ వినియోగదారులకు రిటైల్ టారిఫ్, డిస్ట్రిబ్యూషన్ భారాన్ని తగ్గించేందుకు వీలవుతుందంటున్నారు. టెలికాం సర్వీసుల తరహాలో వినియోగదారులు వివిధ సర్వీస్ ప్రొవైడర్లను ఎంచుకునే వీలుంటుందని కేంద్రం చెబుతోంది. అయితే, ఈ బిల్లును చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed