ఆన్‌లైన్ ద్వారా ఇంటర్ మెమోలు జారీ

by Shyam |
inter memos
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా మెమోలను అందిస్తున్నట్టుగా ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. ఇంటర్ బోర్డ్ వెబ్ సైట్ tsbie.cgg.gov.in ద్వారా కలర్ మెమోలను డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. జులై 1 మధ్యాహ్నం 2 గంటల నుంచి మెమోలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఇంటర్ సెకండ్ ఇయర్ ఉత్తీర్ణత పొందిన జనరల్, ఒకేషనల్, జనరల్ బ్రిడ్జ్ కోర్స్, ఒకేషనల్ బ్రిడ్జికోర్స్ మెమోలను పొందవచ్చని పేర్కొన్నారు. ఈ ఏడాది మెమోలను కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే అందిస్తామని స్పష్టం చేశారు. ఈ మెమోలతో ఉన్నత తరగతుల్లో ప్రవేశం పొందవచ్చని సూచించారు.

మెమోలో ఏమైన తప్పులు దొర్లితే సంబంధిత కళాశాల ప్రిన్సిపాళ్ల ద్వారా ఇంటర్ బోర్డ్ కు ఫిర్యాదు చేసి సరిచేసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయంతో రాష్ట్ర వ్యాప్తంగా 4,75,850 మంది విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా మెమోలను పొందనున్నారు. జూన్ 28 న ఫలితాలను వెల్లడించిన ప్రభుత్వం విద్యార్థులు పై తరగతుల్లో చేరేందుకు ఇబ్బందులు ఎదురవకుండా తగిన చర్యలు చేపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి మెమోలను ఆన్ లైన్ ద్వారా విద్యార్థులకు అందిస్తున్నారు.

కరోనా సమయంలో కళాశాలలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా విద్యార్థుల సౌఖర్యార్థం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మెమోలను ఆన్ లైన్ ద్వారా పొందిన విద్యార్థులు టీసీ, బోనఫైడ్ లను మాత్రమే కళాశాలల నుంచి పొందాల్సి ఉంటుంది. ఉన్నత చదువుల కోసం కళాశాలలో సీట్లు పొందిన అనంతరం టీసీ, బోనఫైడ్ లను అందించాల్సి ఉంటుంది. డిగ్రీలో ప్రవేశాలు పొందాలనుకుంటున్న విద్యార్థులు ప్రభుత్వం అందించిన మార్కుల జాబితాలతో దోస్త్ వెబ్ సైట్ ద్వారా ఎంపిక చేసుకున్న కళాశాలలో సీట్లను పొందవచ్చు.

Advertisement

Next Story