‘కక్కుర్తి.. స్కూల్ డ్రెస్‌లను వదలడం లేదు’

by Shyam |
‘కక్కుర్తి.. స్కూల్ డ్రెస్‌లను వదలడం లేదు’
X

దిశ, మెదక్ : సర్కారు బడుల్లో చదువుకునే విద్యార్థులందరికీ ప్రతి ఏటా ప్రభుత్వం డ్రెస్‌లు అందిస్తోంది. వీటిని సైతం కొందరు అక్రమార్కులు తమ చేతివాటాన్ని చూపుతున్నారు. సర్కారు పాఠశాలల్లో చదివేది పేద, మధ్యతరగతికి చెందిన పిల్లలే. వీరిలో సమానత్వం, ఐకమత్యం కోసం ప్రభుత్వం ప్రతి ఏటా రెండు జతల ఏకరూప దుస్తులు అందిస్తోంది. వీటిలోనూ కొందరు అధికారులు కక్కుర్తి పడుతున్నారు. ఫలితంగా విద్యార్థులకు నాణ్యత లేమి, చాలీచాలని దుస్తులు అందుతున్నాయి. ఈ ఏడాది సైతం అదే తీరులో దుస్తులు సిద్ధం చేశారు.

ఈ ఏడాది అందలేదు

ఉమ్మడి మెదక్ జిల్లాలో 20,309 ప్రాథమిక పాఠశాలలు ఉండగా, ప్రాథమికోన్నత పాఠశాలు 648, ఉన్నత పాఠశాలలు 772 ఉన్నాయి. వీటిలో సుమారు 3,99,939 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలలు పున:ప్రారంభం కాగానే వీరికి పాఠ్యపుస్తకాలతో పాటు రెండు జతల ఏకరూప దుస్తులను విద్యాశాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేయాలి.

కానీ కరోనా కారణంగా ఈ ఏడాది పాఠశాలలకు విద్యార్థులు వచ్చేందుకు ప్రభుత్వం అనుమతినివ్వలేదు. ఆన్‌లైన్ పాఠాలు చెబుతున్నామని కేవలం పుస్తకాలు పంపిణీ చేశారు. కానీ ఏకరూప దుస్తులు ఇవ్వలేదు. బడులు ప్రారంభం అయ్యాక దుస్తులు పంపిణీ చేసే అవకాశమున్నట్టు అధికారులు చెబుతున్నారు.
వాస్తవానికి పాఠశాలలు పున:ప్రారంభం అయిన రోజునే విద్యార్థులకు ఏకరూప దుస్తులు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. కానీ అది ఎన్నడూ అమలు కాలేదు. సరైన కార్యాచరణ లేకపోవడంతో సమయానికి దుస్తులు పంపిణీ చేయడంలో విద్యాశాఖ విఫలమవుతూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా బట్ట‌ల సరఫరా బాధ్యత ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగించడంతో మరింత ఆలస్యమవుతున్నదనే ఆరోపణలు ఉన్నాయి.

ఎస్‌ఎంసీ కమిటీలకు నో ఇన్ఫర్మేషన్..

ఏకరూప దుస్తుల వస్త్రం పంపిణీ, కుట్టడంలో ప్రధానోపాధ్యాయులు, ఎస్‌‌ఎంసీ (స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ‌) సమన్వయంతో పనిచేయాల్సి ఉన్నా.. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చాలాచోట్ల కమిటీలకు కనీసం సమాచారం ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో మాదిరిగానే ఏకరూప దుస్తులు కుట్టించి అందించేందుకు ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు మొగ్గుచూపుతున్నారు. ఈ విషయాలేవి తమకు తెలియదని, కనీసం సమాచారం కూడా ఇవ్వడంలేదని కమిటీ చైర్మెన్‌లు చెబుతున్నారు.

కొందరి చేతివాటం

దుస్తుల కుట్టుకూలీ కోసం ఎస్‌‌ఎంసీ ఖాతాలో ప్రభుత్వం డబ్బులు వేస్తుంది. కానీ ఎస్‌ఎంసీ కమిటీల్లో ఉన్న పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు అంతగా చదువుకోక‌పోవడం, వారికి వీటిపై అవగాహన లేకపోవడం వల్ల ప్రధానోపాధ్యాయులు చెప్పగానే వారు చెక్కులపై సంతకాలు పెట్టేస్తున్నారు.

ఇక్కడే కొందరు ప్రాధానోపాధ్యాయులు, ఎం ఈఓలు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కమిటీలకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా.. తీర్మాణం చేయకుండానే ఏంఈఓలతో కలిసి చెక్కులపై సంతకాలు పెట్టించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాల్లో కొందరు జిల్లా స్థాయి అధికారుల పాత్ర ఉందన్న విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. మెదక్ జిల్లాలోని ఓ సెక్టోరియల్ అధికారి ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్నట్టు విద్యాశాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed