- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాళేశ్వరంలో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత..!
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఒకటి కాదు.. రెండు కాదు వందల ఎకరాల్లో అక్కడి సర్కారు భూములకు రెక్కలొచ్చాయి. ఓ వైపున కాళేశ్వరం ప్రాజెక్టు, మరో వైపున అంతరాష్ట్ర వంతెన పూర్తి కావడమే దళారులకు పంట పండినట్టయింది. నిన్న మొన్నటి వరకు వేలల్లో పలికిన భూముల ధరలు ఇప్పుడు లక్షలకు చేరడంతో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత అన్నట్టుగా తయారైంది.
భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం క్రాసింగ్ నుంచి మహదేవపూర్ మండలం కాళేశ్వరం వరకూ ప్రభుత్వ భూములు పట్టాలుగా మారిపోతున్నాయి. కళ్ళ ముందే సాక్షాత్కరిస్తున్నా ఈ వ్యవహారాన్ని నియంత్రించేందుకు ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదు. రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తుంటే అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన పంచాయతీలు చోద్యం చూస్తాన్నాయో లేక తమ వంతు పాత్రను పోషిస్తున్నాయో అంతు చిక్కడం లేదు. దీంతో రూ. కోట్లు విలువ చేసే భూములు మాత్రం హంఫట్ అవుతున్నాయి. ఇక్కడ సర్కారు భూముల్లో సాదా బైనామాల దందాకు తెరలేపిన కొందరు ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకుంటున్నారు. కాటారం మండల కేంద్రంలో 128, 131, 132, 139, 41, 58తో పాటు పోతుల్వాయి, గంగారం క్రాసింగ్ రోడ్డులోని ప్రభుత్వ స్థలాల్లో మేడలు నిర్మించుకుంటున్నారు. మహదేవపూర్ మండల కేంద్రంలోని 600 బంచరాయ, 473, 473/1తో పాటు పలు ప్రభుత్వ భూములు దర్జాగా విక్రయించుకుంటున్నారు. అలాగే కాళేశ్వరంలోని 129, 119, 142, పూస్కుపల్లి శివారులోని ప్రభుత్వ భూమిని కూడా ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారు.
అధికారుల చోద్యం…
బహిరంగ మార్కెట్‌లో రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులు దర్జాగా దందా కొనసాగిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. రెవెన్యూ అధికారులు కూడా అత్యంత విలువైన భూమిని కబ్జా చేస్తున్నా పట్టించుకోకపోవడం విస్మయం కలిగిస్తోంది. మరో వైపున చట్టానికి పని చెప్పాల్సిన పంచాయతీ వింగ్ కూడా తమకేమీ తెలియదన్నట్టుగా వ్యవహరిస్తోంది. పంచాయితీ అనుమతి లేకుండా జరుగుతున్న నిర్మాణాలను ఎక్కడిక్కడ నిలిపివేసి వాటిని కూల్చే అధికారం ఉన్నా పంచాయతీ యంత్రాంగం మాత్రం కళ్లు మూసుకుని ముందుకు సాగుతోంది. దీంతో వందాలది ఎకరాల ప్రభుత్వ భూములు పదుల ఎకరాల్లో కూడా లేకుండా పోయాయి. నూతన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ డీపీఓ యంత్రాంగం మాత్రం సాహసించడం లేదు. కాళేశ్వరం పంచాయతీపై ఫిర్యాదు రావడంతో డీపీఓ ఆశాలత విచారణ జరిపిస్తున్నారు. వాస్తవంగా కాళేశ్వరం ఇప్పుడు అంతరాష్ట్ర కూడలిగా మారడంతో పాటు ప్రాజెక్టు నిర్మాణంతో వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరిగిపోయింది. రానున్న కాలంలో ఇక్కడకు వచ్చే భక్తులకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ స్థలాలు అవసరం ఉంటుంది. కానీ అధికార యంత్రాంగం చర్యలు తీసుకోకపోవడం విస్మయానికి గురి చేస్తోంది.
విచారణ జరుపుతున్నాం: ఆశాలత, భూపాలపల్లి డీపీఓ
కాళేశ్వరం పంచాయతీలో వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాం. అక్రమ నిర్మాణాలు జరిగిన విషయంలోనూ ఆరా తీస్తున్నాం. మహదేవపూర్, కాటారం, మల్హర్ మండలాల్లో అక్రమ నిర్మాణాలు జరిగినట్టు ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూముల్లో అనుమతి లేకుండా నిర్మాణాలు జరిగినా వాటిని కూల్చేయాల్సిన బాధ్యత పంచాయతీలదే.