దిశ ఎన్‌కౌంటర్.. ఎంక్వయిరీ కమిషన్ ముందుకు సజ్జనార్

by Shyam |   ( Updated:2021-09-27 10:19:51.0  )
దిశ ఎన్‌కౌంటర్.. ఎంక్వయిరీ కమిషన్ ముందుకు సజ్జనార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఎంక్వయిరీ కమిషన్ ఎదుట ఐపీఎస్ అధికారి సజ్జనార్ హాజరుకానున్నారు. ఎన్‌కౌంటర్‌పై అనేక రకాల అనుమానాలు, అభిప్రాయాలు, వాదనలు వినిపిస్తుండడంతో.. జస్టిస్ సిర్పూర్కర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిషన్ బుధవారం సజ్జనార్‌ను విచారించనున్నది. ఎన్‌కౌంటర్ ఎలా జరిగింది? అందుకు దారితీసిన పరిస్థితులు, పరస్పరం కాల్పులు చోటుచేసుకోడానికి ఉన్న అవకాశాలు, తదితర అనేక అంశాలపై కమిషన్ ప్రశ్నించనున్నది. ఇప్పటికే శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డిని విచారించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారిగా ఉన్న మరో ఐపీఎస్ అధికారి మహేశ్ భగవత్‌ను, వనపర్తి ఎస్పీ అపూర్వారావును సోమవారం ప్రశ్నించింది. ఇప్పుడు సజ్జనార్ వంతు వచ్చింది.

ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు సజ్జనార్ సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ఎన్‌కౌంటర్ జరిగింది. ప్రజలంతా భారీ స్థాయిలో ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఎంక్వయిరీ కమిషన్ ఎదుట హాజరై అప్పటి ఎన్‌కౌంటర్ గురించి ఏం చెప్తారన్నది ఆసక్తికరంగా మారింది. వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం సంఘటన తర్వాత నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు జస్టిస్ సిర్పూర్కర్ నేతృత్వంలో ముగ్గరు సభ్యులతో ఎంక్వయిరీ కమిషన్‌ను కోర్టు నియమించింది. కరోనా కారణంగా సకాలంలో క్షేత్రస్థాయి పర్యటన జరపడంలో, బాధిత కుటుంబాలను విచారించడంలో, సాక్ష్యాలను సేకరించడంలో జాప్యం జరిగింది. దీంతో మూడుసార్లు పదవీకాలాన్ని పొడిగించింది. డిసెంబరు చివరికల్లా నివేదిక సమర్పించాలని, ఇదే తుది గడువు అని చెప్పడంతో గత కొన్ని వారాలుగా విచారణను స్పీడప్ చేశారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నలుగురి తల్లిదండ్రులు, బంధువులు, ప్రత్యక్ష సాక్షులను ఇప్పటికే విచారించారు.

Advertisement

Next Story