ప్లేఆఫ్స్‌లో ఎవరెవరికి చోటు? ఆసక్తికరంగా ఐపీఎల్ 2021

by Shyam |   ( Updated:2021-09-27 10:50:15.0  )
IPL
X

దిశ, స్పోర్ట్స్: యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2021లో 39 మ్యాచ్‌లు (ఆదివారం నాటికి) ముగిసే సరికి పాయింట్స్ టేబుల్ ఆసక్తికరంగా మారింది. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు చెరి 16 పాయింట్లతో టాప్ 2 స్థానాల్లో ఉన్నాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ రెండు జట్లు ప్లేఆఫ్ వెళ్లడం దాదాపు ఖరారు అయినట్లే. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం మిగిలిన ఆరు జట్లు కూడా పోటీ పడుతుండటం విశేషం. గతంలో ఎన్నడూ లేనట్లుగా తొలి సారి ఐపీఎల్‌లో 39 మ్యాచ్‌లు ముగిసినా.. ఎవరెవరికి ప్లేఆఫ్స్‌లో స్థానం ఉంటుందనేది స్పష్టం కాకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 12 పాయింట్లతో ఉండగా కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ తలా 8 పాయింట్లతో ఉన్నాయి. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం 2 పాయింట్లు మాత్రమే సాధించింది. ఇకపై జరిగే మ్యాచ్‌లు ఆయా జట్లకు కీలకంగా మారనున్నాయి. సోమవారం రాజస్థాన్-హైదారబాద్ మ్యాచ్ తర్వాత అన్ని జట్లకు తలా 4 మ్యాచ్‌లు ఉంటాయి.

ఎవరికీ చాన్స్?

చెన్నై, ఢిల్లీ ఒక్క మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో కనీసం 2 మ్యాచ్‌లు గెలిస్తే ప్లేఆఫ్స్ చేరుకునే అవకాశం ఉన్నది. అయితే పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ మాత్రం తప్పకుండా అన్ని మ్యాచ్‌లు గెలిచి తీరాల్సిందే. మిగిలిన రెండు స్థానాలకు గాను బెంగళూరు ఒక బెర్త్ కొల్లగొడితే.. మిగిలిన ఒక్క స్థానం కోసం పోటీ తీవ్రతరం కానున్నది. అన్ని జట్లు నాలుగు మ్యాచ్‌లు గెలవడం సాధ్యం కాదు. ప్రస్తుతం ఉన్న ఫామ్‌ను బట్టి కేకేఆర్ జట్టుకు నాలుగో స్థానం దక్కుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేకేఆర్ ఒక్క మ్యాచ్ ఓడినా ప్లేఆఫ్ బెర్త్ క్లిష్టతరం కానున్నది. ఏదేమైనా మరో నాలుగు మ్యాచ్‌లు జరిగితే ప్లేఆఫ్స్ బెర్తుల విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది.

సన్‌రైజర్స్‌కూ అవకాశం..

ఐపీఎల్ 2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ నుంచి దాదాపు నిష్క్రమించింది. 9 మ్యాచ్‌లకు గాను 8 మ్యాచ్‌లలో ఓడిపోయింది. అయినా ఎస్‌ఆర్‌హెచ్‌కు ఒక అవకాశం ఉన్నది. ఇందుకోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ మిగిలిన అన్ని మ్యాచ్‌లు భారీ తేడాతో గెలవడంతో పాటు ఇతర జట్ల సమీకరణలకు కూడా మారాల్సి ఉన్నది. చెన్నై తమకు మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో ఒకటి ఓడిపోవాలి. అంతే కాకుండా ఢిల్లీ కూడా ఒక మ్యాచ్ ఓడిపోవాలి. ఇక ఆర్సీబీ మిగిలిన నాలుగు మ్యాచ్‌లకు గాను రెండింటిలో ఓడిపోవాలి. రాజస్థాన్ రాయల్స్ తమకు మిగిలిన మ్యాచ్‌లలో మూడు ఓడిపోవాలి. కోల్‌కతా, ముంబై, పంజాబ్ జట్లు మిగిలిన మ్యాచ్‌లు అన్నీ ఓడిపోవాలి. అప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ 12 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశం ఉంటుంది. కానీ అలా జరగడానికి చాలా తక్కువ శాతం అవకాశాలు మాత్రమే ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed