డిగ్రీ చదివినా చెల్లని ఓట్లు వేసే.. ఏం లాభం..?

by Anukaran |
డిగ్రీ చదివినా చెల్లని ఓట్లు వేసే.. ఏం లాభం..?
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్విరామంగా కొనసాగుతోంది. అయితే కొంతమంది పట్టభద్రులు ఓట్లు చెల్లుబాటు కాని విధంగా వేయడం ఓట్ల లెక్కింపులోని అధికారులను విస్మయానికి గురి చేస్తోందనే చెప్పారు. ఐదు రౌండ్లలో ఆయా అభ్యర్థులకు వచ్చిన ఓట్ల క్రమాన్ని చూస్తే.. చెల్లుబాటు కాని ఓట్లకు ఆరో స్థానం దక్కడం గమనార్హం. కానీ చెల్లుబాటు ఓట్లను లెక్కలోకి తీసుకోని కారణంగా ఆరో స్థానాన్ని మరో అభ్యర్థికి దక్కినట్టు అయ్యింది. ఈ ఐదు రౌండ్లలో చెల్లుబాటు కాని ఓట్లు 15,533గా అధికారులు గుర్తించారు. జయసారథి రెడ్డి(6906), చెరుకు సుధాకర్(6828), రాణి రుద్రమ(5764) కంటే చెల్లుబాటు కాని ఓట్లు(15533) ఎక్కువ ఉండడం గమనార్హం.

అయితే, ఈ ఓట్ల లెక్కింపులో చెల్లని ఓట్ల శాతం ఏ మాత్రం తగ్గడం లేదనే చెప్పాలి. మొదటి రౌండ్‌లో 3151 ఓట్లు చెల్లుబాటు కాకపోగా, రెండో రౌండ్‌లో 3009 ఓట్లు, మూడో రౌండ్‌లో 3092, నాలుగో రౌండ్‌లో 3223, ఐదో రౌండ్‌లో 3058 ఓట్లు చెల్లుబాటు కాలేదు. ఈ ఐదు రౌండ్లలో చెల్లుబాటు కాని పట్టభద్రుల ఓట్లు 15533 ఉండడం గమనార్హం. నిజానికి పట్టభద్రుల ఓట్లు ఈ స్థాయిలో చెల్లుబాటు కాకపోవడంపైనా కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా డిగ్రీ చదివి సరిగ్గా ఓటు వేయలేని పరిస్థితి ఉంటుందా..? లేక అర్హత లేకున్నా.. ఫేక్ ఓట్లు నమోదు చేసుకున్న వారి ఓట్లే ఇలా చెల్లుబాటు కావడం లేదా.. అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Advertisement

Next Story