ఇంటర్ విద్యార్థులకు ఇది బ్యాడ్ న్యూసే.. మరో నెలరోజులు..

by Shyam |
Inter-Student-1
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఇంటర్ విద్యార్థులకు మరో ఆంటంకం ఎదురైంది. ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్‌కు ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లను పంపించడంతో పాఠాలు బోధించేవారు లేక ఆ కాలేజీలకు అనధికారిక సెలవులు ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు నష్టం జరుగుతోంది. స్పాట్‌కు ప్రైవేట్ కాలేజీల్లో పనిచేసే లెక్చరర్లు రావాలని నిబంధన ఉన్నా యాజమాన్యాలు వారిని పంపించడం లేదు. దీంతో స్పాట్ వాల్యుయేషన్‌కు ప్రభుత్వ లెక్చర్లు మాత్రమే వెళ్తుండగా రాష్ట్రవ్యాప్తంగా 15రోజుల్లో పూర్తి కావాల్సిన వాల్యుయేషన్ ప్రక్రియ నెలరోజులు పట్టే అవకాశం ఉంది.

ఉన్నట్టుండి పరీక్షల తంతు..

కరోనా మహమ్మారి కారణంగా సక్రమంగా కాలేజీలు నిర్వహించలేకపోయామని ప్రభుత్వం ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులను ప్రమోట్ చేసింది. సెకండ్ ఇయర్‌కు ప్రమోట్ అయిన విద్యార్థులు ఫస్టియర్ చదువులకు స్వస్తి చెప్పి ముందుకు సాగుతున్నారు. ఇంటర్ బోర్డు ఉన్నట్టుండి విద్యా సంవత్సరం మధ్యలో పరీక్షలను నిర్వహించింది. అక్టోబర్ చివరి వారంలో మిడిల్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహించడంతో అప్పుడు దాదాపు వారంపాటు కాలేజీల్లో తరగతులు నిర్వహించలేకపోయారు.

ఇప్పుడు మూల్యాంకనం వంతు..

రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 2 వరకు జరిగిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 4 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ పేపర్ల మూల్యాంకనం కోసం రాష్ట్రంలో 14 కేంద్రాలను ఏర్పాటుచేశారు. 6వ తేదీ నుండి ప్రారంభం అయిన ఈ స్పాట్ వాల్యుయేషన్‌తోనే అసలు సమస్య మొదలైంది. సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేట్, కళాశాలలతో పాటు మోడల్ పాఠశాలల్లో పనిచేసే అధ్యాపకులు సైతం మూల్యాంకనంలో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రస్తుతం మోడల్ స్కూల్, ప్రభుత్వ కళాశాలల రెగ్యులర్, కాంట్రాక్ట్, గెస్ట్ అధ్యాపకులు మొత్తం స్పాట్ డ్యూటీకి హాజరవుతున్నారు. దీంతో పాఠాలు బోధించేవారు లేక ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు కాలేజీల వైపు కూడా చూడడంలేదు.

ఫలితాల విడుదలలోనూ జాప్యం

చాలా వరకు ప్రైవేట్ విద్యాసంస్థలు వాళ్ల అధ్యాపకులను స్పాట్‌కు పంపడంలేదు. దీంతో 90శాతం వరకూ ప్రభుత్వ కాలేజీల అధ్యాపకులే స్పాట్ డ్యూటీ చేస్తున్నారు. కేవలం 10శాతం ప్రైవేట్ కాలేజీ లెక్చరర్లు రాష్ట్రంలోని 14 స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల్లో డ్యూటీకీ హాజరవుతున్నారు. మూల్యాంకనం విధులకు ఎంత ఎక్కువ మంది లెక్చరర్లు హాజరైతే అంత తొందరగా ఫలితాలు వెలువడే అవకాశం ఉంటుంది. ఒక్కో లెక్చరర్ సగటున రోజుకు 30 పేపర్లు మాత్రమే మూల్యాంకనం చేయగలుగుతారు. 4లక్షలకు పైగా ఉన్న విద్యార్థుల పరీక్ష పేపర్ల మూల్యాంకనం కోసం 404 ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్న 5,600 మంది లెక్చరర్లు అందరూ హాజరవుతున్నారు. రాష్ట్రంలో 1600లకు పైగా ఉన్న ప్రైవేట్ కాలేజీల్లో సుమారు 50వేల మంది లెక్చరర్లు పనిచేస్తుండగా కేవలం 10శాతం మంది స్పాట్‌కు హాజరవుతున్నారు. దీంతో మూల్యాంకనం ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యి ఫలితాల విడుదలలోనూ జాప్యం ఏర్పడనుంది.

కమిషనర్ ఆదేశాలు బేఖాతర్..

కచ్చితంగా ప్రతి కాలేజీ నుండి స్పాట్‌కు లెక్చరర్లు హాజరు కావాలని ఇంటర్మీడియట్ కమిషనర్ ఉమర్ జలీల్ ఉత్తర్వులు జారీ చేశారు. అయినా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు స్పందించక పోవడం విస్మయం కల్గిస్తోంది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో నిరాటంకంగా చదువులు కొనసాగిస్తూ ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు అన్యాయం చేస్తున్నట్టుగా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటర్ విద్యా కమిషనర్ ఆదేశాలనే బేఖాతర్ చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటారా లేక నిమ్మకుండి పోతారా అన్న చర్చ సాగుతోంది. అయితే విద్యాశాఖ నిబంధనల ప్రకారం స్పాట్ వాల్యుయేషన్‌కు హాజరు కాని లెక్చరర్ల జాబితాను అనుసరించి కాలేజీలకు జరిమానా విధించవచ్చు. ఒక్కొక్కరికీ రూ.20వేల వరకూ ఫైన్లు విధించవచ్చు. అయితే ఈ ప్రక్రియకు శ్రీకారం చుడతారా లేదా వేచి చూడాలి.

అధికారులదీ అనాలోచితమే…

అర్ధాంతరంగా పరీక్షలు నిర్వహించాలన్న నిర్ణయం తీసుకున్న అధికారులు విద్యార్థుల మెరిట్ కోసమేనని చెప్తున్నా.. వారి భవిష్యత్తును ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదో అంతుచిక్కకుండా తయారైంది. విద్యా సంవత్సరం మధ్యలో నిర్వహించిన పరీక్షల స్పాట్ వాల్యుయేషన్‌ను మొదటి విడతలో కొన్ని సబ్జెక్టులకు, మరో విడతలో మిగతా సబ్జెక్టులకు మూల్యాంకనం చేసేందుకు చర్యలు తీసుకుంటే బావుండేది. దీని వల్ల స్పాట్‌లో మ్యూలంకనం చేసే సబ్జెక్టులు కాకుండా ఇతర పాఠ్యాంశాల విద్యాబోధన సాగేది. కానీ.. అధికారులు అనాలోచితంగా తీసుకున్న నిర్ణయంతో అన్ని పాఠ్యాంశాల బోధనకు బ్రేక్ పడింది.

Advertisement

Next Story

Most Viewed