హుజురాబాద్‌లో ఇంటెలిజెన్స్ రహస్య సర్వే.. ప్రజలు ఎటువైపు?

by Anukaran |   ( Updated:2023-05-19 12:37:49.0  )
హుజురాబాద్‌లో ఇంటెలిజెన్స్ రహస్య సర్వే..  ప్రజలు ఎటువైపు?
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్: హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంపై ఇంటెలిజెన్స్ అధికారులు, సిబ్బంది క‌న్నేశారా..? ఎప్ప‌టిక‌ప్పుడు రాజకీయ ప‌రిణామాల‌పై, ప్ర‌జాభిప్రాయాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టేబుల్‌పైకి నివేదిక‌ను చేరుస్తున్నారా..? అంటే ఖ‌చ్చితంగా అవున‌నే చెప్పాలి. ఇందుకు స్ప‌ష్ట‌మైన ఆధారాలు కూడా ల‌భ్య‌మ‌వుతుండ‌టం గ‌మ‌నార్హం. క‌మ‌లాపూర్ మండ‌లంలో శుక్ర‌వారం ఐబీ సిబ్బంది రాజ‌కీయ స‌ర్వే నిర్వ‌హిస్తూ దొర‌క‌డంతో ఈ విష‌యం తేట‌తెల్ల‌మైంది. కేసీఆర్ ప్ర‌భుత్వం ఎలా ఉంది..? ప్ర‌భుత్వం ద్వారా మీకేం ల‌బ్ధి చేకూరింది..? ఏమేం ప‌థ‌కాలు వ‌చ్చాయి..? ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి..? ఎవ‌రికి ఓటేద్దామ‌నుకుంటున్నారు..? ఈట‌ల రాజేంద‌ర్ గురించి ఏమ‌నుకుంటున్నారు…? ఈట‌ల రాజేంద‌ర్ గెలుస్తాడా..? గెలిచినా ప్ర‌భుత్వానికి ఎదురించి ఏమైనా చేస్తాడా..? ఇలా దాదాపు ఇర‌వైకి పైగా అంశాల‌పై హుజురాబాద్ నియోజ‌క‌వర్గ ప్ర‌జ‌ల నుంచి ఇంటెలిజెన్స్ అధికారులు, సిబ్బంది ఆరా తీస్తున్న‌ట్లు స‌మాచారం. నాలుగైదు రోజుల క్రితం జ‌మ్మికుంట కూర‌గాయ‌ల మార్కెట్లో అమ్మ‌కం దారుల వ‌ద్ద నుంచి కూడా ఇలానే కొంత‌మంది స‌మాచారం సేక‌రించిన‌ట్లు స‌మాచారం.

మండ‌లానికో ప‌దిమంది సిబ్బంది మ‌కాం

ఆర్టీసీ బ‌స్‌స్టేష‌న్లు, హోట‌ళ్లు, కిరాణం దుకాణందారులు, పాన్‌షాపుల వ‌ద్ద‌, వ్య‌వ‌సాయ మార్కెట్ల‌లో, కూర‌గాయ మార్కెట్ల వ‌ద్ద, గ్రామ కూడ‌ళ్ల వ‌ద్ద నిల్చోని సైలెంట్‌గా ఉంటూ త‌మ చెవికి ప‌ని చెబుతున్నారట‌. ఒక్కో మండ‌లంలో దాదాపు 10మందికిపైగా ఉన్న ఐబీ సిబ్బంది నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు 60మందికి పైగా ప‌నిచేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. గ‌డిచిన నెల రోజుల కాలం నుంచి కూడా సిబ్బంది నియోజ‌క‌వ‌ర్గంలో మ‌కాం వేశారు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారాన్ని సెల్‌ఫోన్ల ద్వారా ఉన్న‌తాధికారుల‌కు చేర‌వేస్తున్నారు. అంతేకాదు పాత్రికేయుల‌కు కూడా ఫోన్ చేసి షెడ్యూల్‌, రాజ‌కీయ‌ ప‌రిణామాల‌ను క‌నుక్కుకుంటున్నారు.

ఎవ‌రెవ‌రు ఎటు వైపు…!?

ఐబీ అధికారులు ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌తో ఆగిపోకుండా ఏకంగా రాజ‌కీయ నాయ‌కుల క‌ద‌లిక‌ల‌పై కూడా దృష్టి పెడుతున్నారు. ఈట‌ల వెంటే ఉండిపోయిన నేతలు, టీఆర్ ఎస్‌లో ఉండిపోయిన నేత‌ల క‌ద‌లిక‌ల‌పై స‌మాచారం సేక‌రిస్తుండ‌టం గ‌మ‌నార్హం. అంతేకాదు.. ఈట‌ల‌కు అత్యంత స‌న్నిహితంగా గ‌తంలో మొదిలిన టీఆర్ ఎస్ నేత‌లు.. పార్టీలో కొన‌సాగుతున్నామ‌ని బయటికి చెబుతున్నా.. వారిపై ఓ క‌న్నేసి ఉంచిన‌ట్లుగా తెలుస్తోంది. పార్టీకి నిజంగానే ప‌నిచేస్తున్నారా..? లేదా అనే కోణంలో వారి గ్రామాల్లో ప‌ర్య‌టించి అస‌లు విష‌యం సేక‌రిస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఈట‌ల అనుచరులు, బీజేపీ నేత‌ల అభిప్రాయాల‌ను కూడా సోర్స్‌గా భావిస్తున్నారట‌.

ఐబీ సిబ్బందిని నిల‌దీసిన బీజేపీ నేత‌లు

క‌మ‌లాపూర్ మండ‌లం భీంపల్లి గ్రామం వ‌డ్డెర కాల‌నీలో ఓటెవ‌రికి వేస్తారంటూ ప్ర‌జాభిప్రాయం సేక‌రిస్తున్న ఇంటెలిజెన్స్ సిబ్బందిని బీజేపీ నేత‌లు రెడ్‌ హ్యాండెడ్‌గా ప‌ట్టుకోవ‌డం గ‌మ‌నార్హం. భీంప‌ల్లిలో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ఈట‌ల జ‌మున ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో అక్క‌డకి చేరుకున్న బీజేపీ నేత‌ల‌కు కొత్త వ్య‌క్తులు తార‌స‌ప‌డటంతో వివ‌రాలు అడిగారు. వివ‌రాలు తెలిపేందుకు వారు ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డంతో బీజేపీ నేత‌ల్లో అనుమానం మ‌రింత పెరిగింది. వివరాలు తెలిపేంత వ‌ర‌కు వారిని వ‌ద‌ల్లేదు. ఇంటెలిజెన్స్ సిబ్బంది అంటూ చివ‌రికి ఐడీ కార్డు చూపారు. అయితే ఇంటెలిజెన్స్ సిబ్బందికి గ్రామాల్లో ప‌నేంటంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. బీజేపీ నేత‌లు ప్ర‌శ్నిస్తుండ‌గానే ఐబీ సిబ్బంది అక్క‌డి నుంచి వెళ్లిపోయారు.

Advertisement

Next Story

Most Viewed