పోర్నోగ్రఫీపై భారతీయ చట్టం ఏం చెబుతోంది..?

by Anukaran |   ( Updated:2021-08-27 01:39:40.0  )
పోర్నోగ్రఫీపై భారతీయ చట్టం ఏం చెబుతోంది..?
X

దిశ, ఫీచర్స్ : పోర్నోగ్రఫిక్ చిత్రాలను రూపొందించి మొబైల్ యాప్స్ ద్వారా ప్రచురిస్తున్న కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, బిజినెస్ మ్యాన్ రాజ్ కుంద్రా అరెస్టయిన సంగతి తెలిసిందే. మోడల్స్‌ను ట్రాప్ చేసి వారితో చిత్రీకరించిన అశ్లీల కంటెంట్‌ను ‘హాట్‌షాట్స్’ అనే మొబైల్ ఫోన్ అప్లికేషన్‌ ద్వారా స్ట్రీమింగ్ చేసినట్లు రాజ్ కుంద్రాపై ఆరోపణలు ఉన్నాయి. అయితే అతన్ని అరెస్టు చేసిన తర్వాత ఇండియాలో ‘పోర్న్ చట్టబద్ధత’ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో అసలు పోర్నోగ్రఫీ గురించి భారతీయ చట్టం ఏం చెబుతోంది? ఇక్కడ అశ్లీల కంటెంట్ అనుమతించబడిందా? పోర్న్ వీడియోలపై నిషేధమున్నా ఏ విధంగా అందుబాటులో ఉంటున్నాయి? ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సాఫ్ట్ పోర్న్ ఎలా టెలికాస్ట్ అవుతుందో? జస్ట్ రీడ్..

వినియోగదారుల కోసం చట్టాలు..

ఇండియాలో ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టం 2000, ఇండియన్ పీనల్ కోడ్ (IPC), ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (POCSO) చట్టం 2012’లోని నిబంధనలు పోర్నోగ్రఫీ గురించి వివరిస్తాయి. కానీ ఈ చట్టాలు అశ్లీల చర్యను చట్టబద్ధం చేయవు లేదా నిషేధించవు. కేవలం చైల్డ్ పోర్నోగ్రఫీని తప్ప శృంగార వీడియోలు చూడటం లేదా డౌన్‌లోడ్ చేయడాన్ని అడ్డుకోలేవు. శృంగార సంబంధ సమాచారాన్ని ప్రచురించడం, షేర్ చేయడం వంటి చర్యలకు పాల్పడితే మాత్రం జరిమానా విధిస్తాయి. రాజ్యాంగపరంగా.. భావప్రకటనా స్వేచ్ఛపై ఏదేని పరిమితి విధించాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2)కి చెందిన ఎనిమిది అంశాలకు కట్టుబడి ఉండాలి.

వ్యాపారాల కోసం చట్టాలు..

సాంకేతిక పరిజ్ఞానం రాకమునుపు IPC సెక్షన్ 292.. ప్రత్యేకంగా ఏవైనా అసభ్యకర పుస్తకాల అమ్మకం, పంపిణీ, బహిరంగ ప్రదర్శన లేదా సర్క్యులేషన్, డ్రాయింగ్, పెయింటింగ్ తదితర చర్యలను పర్యవేక్షించేది. ఎవరైనా వ్యక్తి వాటిని చదివితే, చూస్తే లేదంటే వింటే అవి ‘కామపూరితంగా లేదా అలాంటి ఆసక్తిని కలిగించేలా లేదా దాని ప్రభావం.. ఒక వ్యక్తిని కించపరిచేలా, భ్రష్టుపట్టించేలా ఉన్నట్టయితే అసభ్యకరంగా పరిగణించబడతాయని ఈ చట్టం చెబుతోంది. IPC సెక్షన్ 293 ప్రకారం 20 ఏళ్ల కంటే తక్కువ వయసున్న ఎవరికైనా అశ్లీల వస్తువులను విక్రయించడం, పంపిణీ చేయడం, ప్రదర్శించడం లేదా సర్క్యులర్ చేయడం చట్టవిరుద్ధం. ఇక ఏదైనా అసభ్యకరమైన చర్యకు పాల్పడటం లేదా బహిరంగ ప్రదేశాల్లో అశ్లీలతతో కూడిన పాటలు పాడటాన్ని ‘సెక్షన్ 294’ నేరంగా పరిగణిస్తుంది.

ఏదేమైనా, పోర్నోగ్రఫిక్ మెటీరియల్ ఎక్కువగా ఎలక్ట్రానిక్ ఫామ్‌లోనే లభిస్తుంది. కాగా IT యాక్ట్ 2000.. అశ్లీల కంటెంట్ లేదా లైంగికంగా ప్రేరేపించేలా ఉన్న మెటీరియల్‌ను ఎలక్ట్రానిక్ రూపంలో ప్రచురించడం లేదా ప్రసారం చేయడాన్ని చట్టవిరుద్ధం చేస్తుంది. చట్టంలోని సెక్షన్ 67 కూడా ఎలక్ట్రానిక్ రూపంలో ‘అసభ్యకరమైన విషయాలను’ ప్రచురించడం లేదా ప్రసారం చేయడాన్ని ఇల్లీగల్‌గా పరిగణిస్తుంది. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి 5 లక్షల జరిమానాతో పాటు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు. ఇక IT చట్టంలోని సెక్షన్ 67A ప్రకారం.. ఎలక్ట్రానిక్ రూపంలో లైంగికంగా ప్రేరేపించే అసభ్యకర కంటెంట్‌ను ప్రచురించినందుకు లేదా ప్రసారం చేసినందుకు రూ. 10 లక్షల జరిమానాతో పాటు ఐదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

నిషేధం ఎందుకు?

డెహ్రాడూన్‌లో 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి సంబంధించిన పిటిషన్‌ను 2018 డిసెంబరులో విచారించిన సమయంలో ఉత్తరాఖండ్ హైకోర్టు పోర్న్ వెబ్‌సైట్‌లను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అశ్లీల చిత్రాలను వీక్షించిన తర్వాత తాము అత్యాచారానికి పాల్పడినట్లు రేప్ కేసు నిందితులు ఇచ్చిన వాంగ్మూలాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది. ఈ మేరకు న్యాయపరమైన మద్దతుతో 827 పోర్న్ వెబ్‌సైట్లను బ్లాక్ చేయాలని టెలికాం శాఖ ISPలను ఆదేశించింది. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ వంటి ప్రధాన టెలికాం కంపెనీలు తమ నెట్‌వర్క్‌లోని అనేక వెబ్‌సైట్స్‌తో పాటు ఇతర నెట్‌వర్క్స్‌లోని చట్టబద్ధ వెబ్‌సైట్స్‌ను కూడా నిషేధించాయి, చైల్డ్ పోర్నోగ్రఫీని హోస్ట్ చేయొద్దంటూ సూచించాయి. అయితే ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాలతో పాటు టెలికాం విభాగం, ISPల స్పష్టమైన వైఖరితో ఉన్నప్పటికీ, ఇంటర్నెట్‌లో శృంగార వీడియోలు ఇప్పటికీ అందుబాటులో ఉండటం గమనార్హం.

ఎలా తప్పించుకుంటున్నాయి?

పోర్న్‌పై విధించిన బ్యాన్‌ను ఉల్లంఘించేందుకు సదరు వెబ్‌సైట్లు తెలివిగా తమ డొమైన్ పేరును మార్చడం లేదా ‘మిర్రర్ వెబ్‌సైట్’ సృష్టించడం చేస్తున్నాయి. ప్రముఖ పోర్న్ సైట్ ‘పోర్న్‌హబ్’ 2018లో ఇదే ట్రిక్‌ను అవలంబించింది. అంతేకాదు కొందురు యూజర్లు ‘యూసీ బ్రౌజర్’ వంటి ఇతర బ్రౌజర్లలో నిషేధిత వెబ్‌సైట్‌లను యాక్సెస్ చేసుకోవడంతో పాటు VPNను ఉపయోగించే వీలుండటంతో నిషేధం పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. ఆన్‌లైన్‌లో అశ్లీల వీడియోలను అప్‌లోడ్ చేస్తున్న వారందరినీ గుర్తించి, పట్టుకోవడం పోలీసులకు అసాధ్యంగా మారింది. అందుకే రాజ్ కుంద్రా కేసు మాదిరి – ఏవేని పోర్నోగ్రఫిక్ మెటీరియల్ పబ్లికేషన్ లేదా సర్క్యులేషన్ విషయంలో బాధిత వ్యక్తి ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం చాలావరకు OTT ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్ మోడల్స్‌లో మూవీస్ లేదా షోస్‌ను మొబైల్ యాప్‌ ద్వారా అందిస్తున్నాయి. వీటిలో కొన్ని యాప్స్ తమ కంటెంట్‌ను టెలికాస్ట్ చేసేందుకు భారతదేశం వెలుపల సర్వర్‌లను ఉపయోగిస్తాయి. రాజ్ కుంద్రా‌ విషయంలోనూ అదే జరిగింది.

OTTలు ఎక్కడ ఉన్నాయి

సాఫ్ట్ పోర్న్ కంటెంట్ OTT ప్లాట్‌ఫామ్స్‌లో విస్తృతంగా అందుబాటులో ఉంది. ఇవి సదరు మూవీ లేదా షోకు సంబంధించిన స్టోరీలో కలిసిపోయి, ప్రీమియం ప్రొడక్ట్స్‌‌గా కనిపించగలవు. ఏక్తాకపూర్ యాజమాన్యంలోని ఆల్ట్ బాలాజీ ప్లాట్‌ఫామ్‌తో పాటు మరికొన్ని షోస్‌.. ఇలాంటి కంటెంట్‌నే ప్రదర్శిస్తున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఇండియాలోని కఠినమైన సెన్సార్‌షిప్ రూల్స్ నుంచి OTTలు స్వేచ్ఛను పొందుతుండగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం.. డిజిటల్ కంటెంట్ కంప్లైంట్ కౌన్సిల్(DCCC)పేరుతో ఒక న్యాయాధికార సంస్థను ఏర్పాటు చేసింది. ఇక అభివృద్ధి చెందుతున్న పరిశ్రమకు స్వీయ-నియంత్రణ కోడ్-కంటెంట్‌ను ఏర్పాటు చేయడానికి ఇన్ఫర్మేషన్ & బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ మార్చి నెలలో అల్టిమేటం ఇచ్చింది. అయితే, ఈ విషయంపై దృష్టిసారించేందుకు అనేక ప్లాట్‌ఫామ్స్‌ కొంత సమయాన్ని కోరాయి.

Read more:

పోలీస్ రాసలీలలు.. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను ముద్దు అడుగుతూ

Advertisement

Next Story