మహిళా క్రికెట్‌లో మరో చరిత్ర..

by Anukaran |   ( Updated:2021-05-20 08:12:46.0  )
మహిళా క్రికెట్‌లో మరో చరిత్ర..
X

దిశ, స్పోర్ట్స్: క్రికెట్ పుట్టి శతాబ్దం గడిచినా… మహిళల క్రికెట్‌కు ఇప్పటికీ పెద్దగా ఆదరణ లేదు. ఐసీసీ మహిళా క్రికెట్‌పై దృష్టిపెట్టి ఈ మధ్యే వారికి ఆదరణ కల్పిస్తున్నది. ఇంగ్లాండ్, ఆప్ట్రేలియా వంటి దేశాల్లో మహిళా క్రికెట్‌ను ఆయా బోర్డులు తమ సొంత చేసుకొని చాలా ఏళ్లయ్యింది. ఇండియాలో మహిళా క్రికెట్ 70వ దశకంలోనే ప్రారంభం అయినా.. అది బీసీసీఐలో కలవడానికి దాదాపు 40 ఏళ్ల సమయం పట్టింది. ఒకప్పుడు బీసీసీఐ అంటే కేవలం పురుషుల క్రికెట్ జట్టే. కానీ 2006 నుంచి మహిళల క్రికెట్ జట్టును కూడా బీసీసీఐ తమలో విలీనం చేసుకున్నది. ఆ తర్వాతే ఇండియాలో మహిళల క్రికెట్‌కు మరింత ఆదరణ లభించింది. పురుషుల క్రికెట్‌లో పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ప్రారంభం అయ్యాక టెస్ట్ క్రికెట్‌కు ఆదరణ తగ్గింది.

ఒకప్పుడు క్రికెట్ అంటే టెస్టు మ్యాచ్‌లే.. కానీ వన్డేలు ప్రారంభం అయ్యాక సుదీర్ఘ క్రికెట్‌ను చూడటానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. ఇక టీ20 క్రికెట్ మొదలయ్యాక.. టెస్ట్ క్రికెట్‌పై ఆసక్తి పూర్తిగా పోయింది. అయితే ఎప్పుడైతే ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ప్రారంభించిందో.. అప్పటి నుంచి ఐదు రోజుల క్రికెట్‌కు ఆదరణ పెరిగింది. గతంలో డ్రా కోసం ప్రయత్నించిన జట్లే ఇప్పుడు ఫలితం కోసమే ఆడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ మహిళల క్రికెట్‌లో కూడా టెస్టు మ్యాచ్‌లను పెంచాలని నిర్ణయించింది.

మరో చరిత్ర..

మహిళల క్రికెట్‌లో టెస్టు మ్యాచ్‌ల సంఖ్యను పెంచాలని ఐసీసీ నిర్ణయం తీసుకున్నా అభిమానుల నుంచి ఆకర్షణ ఉండదనే కారణంతో ఆయా దేశాల క్రికెట్ బోర్డులు వెనకడుగు వేస్తున్నాయి. టీమ్ ఇండియా తొలి టెస్టు 1977లో ఆడింది. ఇప్పటి వరకు న్యూజీలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లతో తప్ప మరే ఇతర జట్లతో భారత మహిళా జట్టు టెస్టు మ్యాచ్‌లు ఆడలేదు. ఆస్ట్రేలియాతో భారత మహిళా జట్టు ఇప్పటి వరకు కేవలం 9 టెస్టులే ఆడింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా గడ్డపై 15 ఏళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడబోతున్నది. అయితే అడిలైడ్‌లో జరిగే ఈ మ్యాచ్ డే/నైట్ రూపంలో నిర్వహించాలని ఇరు బోర్డులు నిర్ణయించాయి.

ఆసీస్, ఇండియా మధ్య జరగబోయే తొలి పింక్ బాల్ టెస్టు ఇదే కానున్నది. టీమ్ ఇండియా మహిళలు ఆడబోతున్న తొలి డే/నైట్ టెస్ట్ ఇదే కావడం గమనార్హం, మహిళల క్రికెట్ చరిత్రలో ఇది రెండో పింక్ బాల్ టెస్ట్. అంతకు ముందు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య 2017 నవంబర్‌లో సిడ్నీలో తొలి పింక్ బాల్ టెస్ట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ డ్రాగా ముగియడం గమనార్హం.

మళ్లీ మిథాలీ..

టీమ్ ఇండియా మహిళా జట్టులో లేడీ సచిన్ అని పేరు తెచ్చుకున్న మిథాలీ రాజ్‌కు అనేక రికార్డులు సొంతం. 2006లో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించి ఒక టెస్ట్ మ్యాచ్ ఆడింది. అప్పుడు మిథాలీ రాజ్ భారత జట్టు కెప్టెన్‌గా ఉన్నది. ఆ తర్వాత టీమ్ ఇండియా ఇంగ్లాండ్ పర్యటనలో టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ ఆడింది. అన్నింటా భారత జట్టు పై చేయి సాధించింది. మిథాలీ నాయకత్వంలో భారత జట్టకు టెస్టుల్లో మంచి రికార్డే ఉన్నది. కానీ ఆస్ట్రేలియాపై మాత్రం ఇంత వరకు టీమ్ ఇండియా ఒక్క టెస్టు కూడా గెలవలేదు. 2006లో టెస్టుల్లో టీమ్ ఇండియాకు కెప్టెన్సీ చేసిన మిథాలీనే 15 ఏళ్ల తర్వాత కూడా ఆస్ట్రేలియాకు కెప్టెన్ హోదాలోనే వెళ్లనున్నది.

భారత జట్టు ఆరేళ్ల క్రితం 2015లో మైసూరులో చివరి సారిగా టెస్టు మ్యాచ్ ఆడింది. దాంట్లో టీమ్ ఇండియా విజయం సాధించింది. ఇక ఇప్పుడు మిథాలీ నేతృత్వంలోనే తొలి పింక్ బాల్ టెస్టు ఆడనున్నది. 2022లో న్యూజీలాండ్‌లో జరుగనున్న మహిళల వన్డే వరల్డ్ కప్ తర్వాత రిటైర్ కానున్న మిథాలీ రాజ్ ఇప్పుడు పింక్ బాల్ టెస్టు కూడా ఆడనున్నది. ఇది నిజంగా ఆమెకు గర్వకారణమే. దిగ్గజ క్రికెటర్ సచిన్ కూడా సాధించలేని ఫీట్ కేవలం మిథాలీ సొంతం కానున్నది.

“టీమ్ ఇండియా మహిళల జట్టును మరింత ముందుకు తీసుకెళ్లాలని మేము భావిస్తున్నాము. ఈ క్రమంలో భారత మహిళా జట్టు తొలి సారిగా పింక్ బాల్ టెస్టు ఆడనున్నది. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో భారత జట్టు డే/నైట్ టెస్టు ఆడనున్నది” అని బీసీసీఐ కార్యదర్శి జై షా అన్నారు.

Advertisement

Next Story

Most Viewed