నేటితో రెడ్ క్రాస్ సొసైటీకి వందేండ్లు !

by Shyam |
నేటితో రెడ్ క్రాస్ సొసైటీకి వందేండ్లు !
X

దిశ, హైదరాబాద్ :

మన దేశంలో సామాజిక బాధ్యతతో స్వచ్ఛంద సేవలందిస్తోన్న ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నేటికి వందేళ్ళు పూర్తిచేసుకుంది. అనేక దేశాల్లో రెడ్‌క్రాస్ సొసైటీ పేరుతో కొనసాగుతున్నా.. భారత్‌లో మాత్రం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీగా 1920 నుంచి సేవలందిస్తోంది. రక్తదాన శిబిరాలను నిర్వహించడం, హెల్త్ క్యాంపుల ద్వారా పేదలకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం, విపత్తుల సమయంలో సహాయక చర్యలతో బాధితులకు అండగా నిలవడం, ఆపదలో ఉన్నవారికి సేవలందించే ఈ సొసైటీ.. వందేళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా భారీ లక్ష్యాన్నే నిర్దేశించుకుంది. మరోవైపు సమాజాభివృద్ధికి సవాలుగా మారిన ప్లాస్టిక్ నివారణ అవగాహనలోనూ తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకుంది.

రక్తదానంపై ప్రత్యేక ఫోకస్ :

హైదరాబాద్ జిల్లాలో ఏడాదికి దాదాపు 1000 యూనిట్లకు పైగా రక్తాన్ని శిబిరాల ద్వారా సేకరిస్తోంది. ఈ రక్తాన్ని తలసేమియా బాధితులకు, ఆపద సమయంలో వైద్య సేవలు పొందే వారికి అందిస్తోంది. 2018-19, 2019-20 సంవత్సరాల్లో 2083 యూనిట్లను సేకరించింది. ఈ ఏడాది ఇప్పటికే సుమారు 1000 యూనిట్ల రక్తాన్ని సేకరించింది. సుమారు 7 వేల మందికి పైగా నిరుపేదలు వివిధ రకాల వైద్య సేవలు పొందారు. వివిధ పనుల నిమిత్తం నగరానికి వచ్చేవారికి వేసవిలో అంబలి కేంద్రాన్ని నిర్వహించడంతో పాటు జిల్లాలోని విద్యార్థులకు ఫస్ట్ ఎయిడ్ చికిత్సపై అవగాహన కల్పిస్తోంది. ప్రస్తుతం లాక్‌డౌన్ అమల్లోఉన్నందున 40 రోజులుగా రోజూ 3 వేల ఆహార ప్యాకెట్లను వలస కూలీలకు అందజేసింది. ట్రైన్ల ద్వారా తరలిపోతున్న వారికి రైల్వే స్టేషన్ల దగ్గరే రోజూ 1000 ప్యాకెట్లను పంపిణీ చేస్తోంది.

లక్ష జ్యూట్ బ్యాగుల తయారీ

హైదరాబాద్ నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు గాను ప్రజల్లో జూట్ బ్యాగులను వినియోగంపై చైతన్యం కలిగిస్తోంది. మహిళలకు కుట్టుమిషన్ శిక్షణతో పాటు ఉపాథి అవకాశాలను కల్పిస్తోంది. వారాసిగూడ, మాసబ్‌ట్యాంక్‌లోని రెడ్‌క్రాస్ కార్యాలయంలో జ్యూట్ బ్యాగుల తయారీ జరుగుతోంది. మొత్తం లక్ష బ్యాగులను ప్రజలకు పంపిణీ చేయాలని భావిస్తోంది.

ఆపత్కాలంలో ఆదుకోవడమే లక్ష్యం :

– మామిడి భీం రెడ్డి, హైదరాబాద్ జిల్లా చైర్మన్

తోటివారికి సాయం చేయడంలో ఎలాంటి వివక్ష లేకుండా పనిచేయడం రెడ్ క్రాస్ సొసైటీ లక్ష్యం. ఇప్పటికే రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలతో పాటు అనేక సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్నాం. శ్రీకాకుళం జిల్లాలో వచ్చిన తిత్లీ తుఫాను, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అగ్నిప్రమాదం సంభవించినపుడు, తదితర ఆపత్కాల సమయాల్లోనూ సాయంకోసం ఎదురు చూస్తున్నవారికి ఆపన్న హస్తం అందించాం. నిరుద్యోగ యువతకు ఉపాథి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేకంగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వందేండ్లకు చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తాం.

Tags: Indian Redcross society, 100 Years, social service, blood bank

Advertisement

Next Story

Most Viewed